బీజేపీ డిసైడైందా. అవును అదే జరుగుతున్నట్లుగా ఉంది. కమలనాథులు పాత మిత్రుడితో చేతులు కలిపేందుకు సిద్ధమైనట్లే ఉన్నారు. ఇంతకాలం జనసేనతోనే తమకు పొత్తు ఉంటుందని చెబుతూ వచ్చిన బీజేపీ నేతలు… ఇప్పుడు టీడీపీతో కూడా..అని జతపరిచేందుకు ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కేంద్ర నాయకత్వం పావులు కదుపుతున్నట్లు రాష్ట్ర కార్యవర్గానికి కూడా సంకేతాలు అందాయి….
బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా ఆమె సహచర నేతలు ఇంతకాలం ఒక మాట చెబుతూ వచ్చారు. తమకు తెలిసినంతవరకు జనసేనతో మాత్రమే పొత్తు ఉందని… పొత్తులను విస్తృత పరిచే ప్రక్రియను అధిష్టానం మాత్రమే చూసుకుంటుందని వెల్లడిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సీన్ మారబోతోంది. నిన్నటిదాకా ఒక లెక్క. ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పుకోవాల్సి వస్తుంది. టీడీపీకి బీజేపీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. చంద్రబాబుతో ఎన్నికల పొత్తుకు మోదీ నిర్ణయించుకున్నట్లేనని ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది.అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలాబలాలను బేరీజు వేసుకుంటూ తెలుగు స్టేట్స్ పరిస్థితి కూడా అంచనా వేసుకున్నారు. ఎవరితో ఎక్కడ పొత్తు పెట్టుకుంటే మంచిదన్న లెక్క చూసుకుని చివరకు ఏపీలో టీడీపీతో దోస్తీ..భవిష్యత్తుకు పూల బాట వేస్తుందని నిర్ణయానికి వచ్చారు…
బీజేపీ అసలు వ్యహమేంటి ? గల్లీ నుంచి ఢిల్లీ దాకా కలిసిపోవాలన్న ఆలోచన ఎందుకొచ్చింది. చంద్రబాబు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా ఎందుకు కనిపిస్తున్నారా… మోదీ ఆలోచన వెనుక ఐదేళ్ల గేమ్ ప్లాన్ దాగొందా…
బీజేపీ పెద్దలు ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఏపీలో ఎవరితో వెళ్తే రాజకీయ లాభం అన్నది కూడా వారు అన్నీ ఆలోచించుకున్న మీదటనే కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు . టీడీపీని తిరిగి ఎన్డీయేలోకి ఆహ్వానించాలని బీజేపీ పెద్దలు సూత్రప్రాయాంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి కారణం ఏపీ నుంచి ఎక్కువ సంఖ్యలో ఎంపీలు బీజేపీకి కావాలి. పొత్తు పార్టీగా టీడీపీ కూడా బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వడానికి రెడీ అయినట్లుగా చెబుతున్నారు. ఏడు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లపై కమలం పార్టీ కన్నేసినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా బీజేపీకి టీడీపీ ఎంపీలు కూడా మద్దతుగా ఉంటారు. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ పై కన్నేసిన వేళ..ఎన్నికల తర్వాతి సమీకరణాలను సైతం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. నిన్నటిదాకా భయపెట్టిన ఇండియా కూటమి ఇపుడు బీటలు వారుతోంది. దాంతో పాటుగా అందులో ఉన్న కీలక నేతలను కూడా బీజేపీ తమ వైపునకు తిప్పుకుంటోంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇప్పుడు ఎన్డీయే కూటమిలోకి వచ్చారు. ఆ తరువాత శివసేనకు చెందిన ఉద్ధవ్ థాక్రేని కూడా బీజేపీలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంజాబ్ లో అకాళీ దళ్ కూడా ఎన్డీయేలో చేరనుంది అని తెలుస్తోంది. పాత మిత్రుడు చంద్రబాబుని కూడా ఎన్డీయేలోకి తీసుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ ఇప్పుడు తమకు ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. దీని వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా తమ ఖాతాలో ఉందని చెప్పుకోవడానికి వీలుంటుంది…
రికార్డు మెజార్టీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది . కనిష్ఠంగా 400 స్థానాల్లో గెలవాలని ప్రయత్నిస్తోంది. ఈ దిశగానే చంద్రబాబు సహా పలువురు నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. బాబుకు కూడా కొన్ని అనివార్యతలు ఉన్నాయి. జగన్ రెడ్డి అంతబలం, అర్థబలాన్ని తట్టుకోవాలంటే బీజేపీతో దోస్తీ అవసరం. అందుకే ఇద్దరికీ మళ్లీ స్నేహం కుదరడం కష్టమేమీ కాదనిపిస్తోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…