ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితి మనకు మరెక్కడా కనిపించదు. ఎన్నికలకు ఇంకా సంవత్సరం పైగా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ప్రతిపక్ష నాయకులు రంగంలోకి దిగి ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వం మీద తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. నారా లోకేశ్ యువగళం పేరుతో 400 రోజులు 4000 కిలోమీటర్లు లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా రంగంలోకి దిగి రోడ్‌షోలు ర్యాలీలతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నారు. రేపోమాపో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన వారాహి వాహనంతో రోడ్డెక్కబోతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా ప్రభుత్వ వ్యతిరేక కథనాలతో తమవంతు పాత్ర పోషిస్తోంది. ఈ విధంగా జగన్ మీద ముప్పేట దాటి చేసేందుకు ప్రతిపక్షాలు పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలవక తప్పని పరిస్థితి చంద్రబాబుది. మళ్లీ గనక ఓడిపోతే ఇక తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. జనసేనతో పొత్తు దాదాపు ఖరారు అయిపోయింది. అవసరం అయితే బీజేపీతో చేతులు కలిపేందుకు కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. కానీ చంద్రబాబు తత్వం తెలిసిన కమలనాధులు ససేమిరా అంటున్నారు. ఈ మూడు ముక్కలాటలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుందని ఒక పత్రిక ప్రత్యక కథనంలో పేర్కొంది.
తెలుగుదేశం అధినేత మళ్లీ అధికారంలోకి రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ను మళ్లీ గెలవకుండా చేయడం ఎలా అన్నదానిపై కేసీఆర్ దృష్టి సారించారట. అందుకోసం వెయ్యి కోట్లు ఖర్చు పెడతానని తనతో చేతులు కలపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు తన దూతలను పంపించాడట. చంద్రబాబు అంటే తనకు గిట్టదు కాబట్టి పవన్ ను ఆయన నుంచి దూరం చేస్తే జగన్ అధికారానికి ఢోకా ఉండదని కేసీఆర్ ఉద్దేశమట. తెలంగాణలో చంద్రబాబు పోటీ చేస్తే కమ్మ సామాజిక వర్గం తనకు దూరమవుతుందని అందుకే ఆ లోటును భర్తీ చేసుకోడానికి కాపులను చేరదీయాలని యోచిస్తున్నారట. తెలంగాణలో కాపులు పవన్ కళ్యాన్‌తో ఉన్నారట వారిని చేరదీయడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని అనుకుంటున్నారట కేసీఆర్. అంతేకాదు ఏపీలో పవన్‌తో పొత్తు పెట్టుకుని ఎంపిక చేసుకున్న 50 నియోజకవర్గాల్లో పోటీచేద్దామని 30 చోట్ల గెలిస్తే చాలు ముఖ్యమంత్రి కావొచ్చని పవన్‌కు కేసీఆర్ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఇదంతా నిజమో కట్టుకథో తెలియదు కానీ ఈ కథనం రాసిన పత్రికాధిపతి మాత్రం చంద్రబాబుకు నమ్మినబంటు. అందుకే ఆయన ఏ వార్త రాసినా అందులో చంద్రబాబుకు మేలు జరగాలనే తాపత్రయమే కనిపిస్తూ ఉంటుంది. ఈ కథనం కూడా అలాంటిదే అయి ఉండవచ్చు అనంటున్నారు పరిశీలకులు.