ఏపీపై కేసీఆర్ నజర్.. ఆంధ్రాలోకి సారు కారు

By KTV Telugu On 23 December, 2022
image

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణకు తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన గులాబీ దళపతి త్వరలో పొరుగు రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ శాఖ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ బాధ్యతలను కేసీఆర్ కొందరికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఏపీలో కేసీఆర్ రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది. ఆంధ్రాలో సీఎం జగన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు చంద్రబాబుతో ఉన్న రాజకీయ వైరంతో ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ పైన భిన్న అంచనాలు ఉన్నాయి. అక్కడ బీఆర్ఎస్‌ను ఎవరు లీడ్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో తనకున్న పరిచయాల దృష్ట్యా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు కేసీఆర్ ఆ రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ నుంచి పలువురు నేతలు కేసీఆర్‌ను కలిసి వెళ్తుండడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయం పూర్తిగా సామాజిక సమీకరణాలపైనే ఆధార పడి ఉంటుంది. బీసీ ఓటు బ్యాంకును పూర్తిగా తమవైపు మళ్లించుకునే ప్రయత్నాల్లో వైసీపీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తమ వెంటే ఉంటారని విశ్వసిస్తోంది. అటు టీడీపీ కూడా తమది బీసీల పార్టీ అని చెప్పుకుంటోంది. ఏపీలో, తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షులు కూడా బీసీలే. ఇక జనసేన మాత్రం పూర్తిగా కాపు సామాజికవర్గంపైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది. కాపులంతా ఈసారి తమ వెంటే ఉంటారని పవన్ భావిస్తున్నారు. ఆ దిశగా అంతా ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనెల 26న విశాఖలో కాపు నాడు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో కాపు పెద్దలు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇక, కేసీఆర్ కూడా పూర్తిగా సామాజిక సమీకరణాల ఆధారంగానే ఏపీలో రాజకీయం నడుపుతారానే విశ్లేషణలు సాగుతున్నాయి.

తాజాగా ఏపీ బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు రామక్రిష్ణ యాదవ్ నాయకత్వంలో వివిధ బీసీ సంఘాల అధ్యక్షులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఏపీలో బీఆర్ఎస్ ఏర్పాటు విస్తరణ దిశగా చర్చలు జరిపారు. వారికి ముఖ్యమంత్రి తన పార్టీ లక్ష్యాలను వివరించారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విస్తరణ దిశగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. బీసీ వర్గాల నేతలు కేసీఆర్ ను కలవటం ద్వారా ఆ వర్గాల నుంచి ఏపీలో బీఆర్ఎస్‌కు ఏ మేర మద్దతు లభిస్తుందనేది ఆసక్తిగా మారుతోంది. కేసీఆర్ పూర్వీకులది ఉత్తరాంధ్ర. అక్కడ వెలమ సామాజికవర్గం ఓటర్లు అధికారంగా ఉన్నారు. వారితో పాటు టీడీపీలోని గత పరిచయాల కారణంగా కొంతమంది తమ వెంట వస్తారని కేసీఆర్ లెక్కలేసుకుంటున్నారట. క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నవారు ఏ పదవులు లేని నేతలకు బీఆర్ఎస్ టచ్‌లోకి వెళ్తోంది. అదేసమయంలో కాంగ్రెస్‌ నేతలపైనా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ నేతలు ఏపీలో పర్యటించబోతున్నారు.

ఏపీలో ప్రధానంగా ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయి. మోడీతో తన బంధం ప్రత్యేకమైనదని జగన్ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లేందుకు జనసేన ఇప్పటికే సిద్ధమైంది. అటు టీడీపీ కూడా ఆ రెండు పార్టీలతో జతకట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈనేపథ్యంలో తెలంగాణలో బీజేపీతో ఢీ అంటే ఢీ అంటోన్న కేసీఆర్ ఏపీలో బీజేపీ పాలన, ఆ పార్టీని వ్యతిరేకించే వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ వామపక్ష పార్టీలతో కేసీఆర్ జతకట్టే అవకాశముంది. ఇక అదే సమయంలో తెలంగాణలో తమకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఏపీలో బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అసద్ తమ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఏపీలో మజ్లిస్ పార్టీ జగన్‌కు సపోర్ట్‌గా నిలుస్తుందనే టాక్ ఉంది. ఏపీలో మజ్లిస్ ఎక్కడా పోటీ చేయడం లేదు. జగన్‌ను కాదని అసద్ కేసీఆర్‌కు ఏపీలో అవకాశమిస్తారా? ఒకవేళ అసద్ కేసీఆర్ వెంట నడిస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌కు మైనారిటీ ఓట్లు బలం అవుతాయి. మొత్తంగా తన పొరుగు రాష్ట్రమైన మరో తెలుగు రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయ వ్యూహం ఏవిధంగా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.