వచ్చే నెలలోనే ఏపీలో అడుగుపెట్టబోతున్న కేసీఆర్‌

By KTV Telugu On 26 December, 2022
image

భారత రాష్ట్ర సమితి పేరుతో దేశవ్యాప్తంగా సత్తా చాటేందుకు సీఎం కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కూడా పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ లో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం అమరావతిలో అద్దె భవనం కోసం చూస్తున్నట్లు సమాచారం. జనవరిలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను ప్రారంభిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ వ్యవహారాలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయడానికి వీలుగా ఏపీలో బలపడేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా ముందుగా పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. సభ్యులుగా చేరే కార్యకర్తలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు. అదే పద్ధతిలో బీఆర్ఎస్ విషయంలోనూ పాటించాలని నేతలు భావిస్తున్నారు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫోన్‌ ద్వారా సభ్యత్వం ఇచ్చే ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఓమొబైల్ నెంబర్ కేటాయించారు. 9491015222 నెంబరుకు ఫోన్ చేసి పార్టీ సభ్యత్వం పొందవచ్చని ఇప్పటికే ప్రకటించారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన ప్రముఖులను, రిటైర్డ్‌ ఉద్యోగులను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలను కలిసి కేసీఆర్‌ బీఆర్ఎస్ లో చేరాలని కేసీఆర్ కోరనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. గతంలో తనతో సన్నిహితంగా ఉన్న ఏపీ నేతలకు కేసీఆర్ ఇప్పటికే ఫోన్ చేసినట్లు వివరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పోటీలోకి దిగనుందని తెలుస్తోంది. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను ఎంచుకుని అక్కడ అభ్యర్థులను బరిలోకి దింపనుందని చెబుతున్నారు. సంక్రాంతి తరువాత ఏపీలో భారీ బహిరంగా సభ ఏర్పాటుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఆ సభలో కేసీఆర్‌ పాల్గొంటారని సమాచారం. ఏపీలో పాటు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తోన్నారు. జనవరిలో నాందేడ్‌ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. సంక్రాంతి నుంచి మరింత దూకుడు పెంచాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ బీఆర్‌ఎస్‌ను ఏపీ ప్రజలను ఎలా ఆదరిస్తారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.