బీఆర్‌ఎస్‌తో వైసీపీ కొత్త సవాళ్లు తప్పవా?

By KTV Telugu On 13 December, 2022
image

తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపి రాష్ట్రాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిపోయింది. ఇదివరకు కేసీఆర్‌ది ప్రాంతీయపార్టీ. ఇప్పుడది జాతీయపార్టీ. ఏపీతో పాటు దేశంలో ఎక్కడైనా పోటీచేస్తుంది. పార్టీ బలోపేతానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. భారత రాష్ట్ర సమితి ఏర్పాటును ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్వాగతించారు. బీఆర్‌ఎస్‌కు మద్దతుపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయపార్టీకి గట్టి పునాదికోసం కేసీఆర్‌ తక్షణం దృష్టిపెట్టే మూడు నాలుగు రాష్ట్రాల్లో ఏపీనే ముందుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. అప్పుడప్పుడూ విభజన నేపథ్యంపై విమర్శలతో వాతావరణం వేడెక్కుతోంది. ఈమధ్యే రెండురాష్ట్రాల కలిసిపోవాలన్నట్లు సజ్జల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఈ సమయంలో ఏపీలో బీఆర్‌ఎస్‌ విస్తరణకు వైసీపీ ఎంతవరకు సహకరిస్తుందన్న చర్చ మొదలైంది.

జాతీయ పార్టీగా నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవాలంటే కేసీఆర్‌కి ఏపీనే ఫస్ట్‌ ప్రయారిటీ. ఎందుకంటే ఎనిమిదిన్నరేళ్ళకు ముందు రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నాయి. తెలుగు మాట్లాడే ప్రజలు కావటంతో ఆ సెంటిమెంట్‌ కూడా కలిసొస్తుంది. నేతలు కొన్నిసార్లు మాటలు తూలుతున్నా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నా కేసీఆర్‌-జగన్‌లమధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త జాతీయపార్టీ విషయంలో రెండు రాజకీయపక్షాలు ఇచ్చిపుచ్చుకున్న ధోరణితోనే వ్యవహరిస్తాయా? ఏపీలోకి బీఆర్‌ఎస్ ఎంట్రీతో వైసీపీకి ఎంత లాభం ఎంతమేర నష్టం అన్నదానిపైనా చర్చ సాగుతోంది. విభజన తర్వాత ఎప్పుడైనా ఏపీకి వచ్చినప్పుడు కేసీఆర్‌కి ఘనస్వాగతం లభిస్తోంది. రాజకీయాల్లో కేసీఆర్‌ దూకుడికి ఏపీలో కూడా ఆయన అభిమానగణం ఉంది. ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను నిందించినా కొన్ని పరుషపదాలు వాడినా ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రత్యేకహోదాకోసం పోరాడతానని కేసీఆర్‌ హామీఇవ్వొచ్చు. పోలవరంతో పాటు అమరావతి రాజధానికి మద్దతు తెలపొచ్చు. అదే జరిగితే వైసీపీమీద ఒత్తిడిపెరగొచ్చు.

ఇప్పటికే కేసీఆర్‌ కొత్తపార్టీకి టచ్‌లో ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌లాంటి వాళ్లు వైసీపీని టార్గెట్‌ చేసుకుంటున్నారు. కేంద్రంతో రాజీపడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ బలపడాలంటే దూకుడు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ దూకుడు వైసీపీపై ఒత్తిడి పెంచడమైతే ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడ కేంద్రంగా ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పోస్టర్లు వెలిశాయి. కొందరు నాయకులు కేసీఆర్‌ జాతీయపార్టీవైపు చూస్తున్నారు. రైతుబంధు, దళితబంధులాంటి తెలంగాణ పథకాలు ఏపీ ప్రజలను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఎవరయినా పార్టీ పెట్టొచ్చంటున్న వైసీపీ నేతలు బీఆర్‌ఎస్‌ వచ్చాక ఎలాంటి పరిణామాలుంటాయో ఇంకా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. మరోవైపు కేసీఆర్‌లాంటి నేతతో పొత్తుపెట్టుకుంటే పార్టీకి లాభం ఉంటుందని కొందరు లెక్కలేసుకుంటున్నారు. ఒకవేళ బీఆర్‌ఎస్‌కి దూరంగా ఉండాలనుకుంటే కేసీఆర్‌ బీజేపీతో పాటు వైసీపీని కూడా టార్గెట్‌ చేసుకోవడం ఖాయం. అప్పుడు టీడీపీ-జనసేనలకు మరో గొంతు తోడవుతుంది. దీంతో వైసీపీ తొందరపడకుండా వేచిచూసే ధోరణితో ఉంది. కానీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఒళ్లో కూర్చోబెట్టుకోవాలో, మొహాన తలుపేయాలో ఏదో ఒకటి త్వరలో తేల్చుకోకతప్పదు.