బాబు- పవన్‌ టార్గెట్‌గా కేసీఆర్-జగన్ రాజకీయం

By KTV Telugu On 25 February, 2023
image

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు, ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ పెట్టనే లేదు. పట్టుమని పదిమంది లీడర్లు కార్యకర్తలు కూడా లేరు. కానీ, వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి తీరుతామంటోంది ఆ పార్టీ. 2024లో అన్ని నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతామంటూ ఆంధ్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. అబ్‌కీ బార్‌, కిసాన్‌ సర్కార్‌ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్ ఏపీలోను బలపడేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రైతులు యువత మహిళలకు సంబంధించిన సమస్యలే పార్టీ ప్రాథమిక ఎజెండాగా ముందుకెళ్లేందుకు కార్యచరణ రెడీ చేశారు. అదే సమయంలో విభజన హామీలు, రాష్ట్ర రాజధాని, పోలవరం, వైజాగ్ రైల్వే జోన్ దుగ్గరాజపట్నం ఓడరేవు సహా అనేక అంశాలను అజెండాగా మల్చుకొని కేంద్రంపై యుద్ధబాణం సంధించేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. విభజన జరిగి 9ఏళ్లు అవుతున్నా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం రాష్ట్రానికి రాజధాని అంటూ ఒకటి లేకపోవడం లాంటి అంశాలను లేవనెత్తుతూ అస్త్రాలుగా తయారుచేసుకుంటోంది బీఆర్ఎస్. తాము అధికారంలోకి వస్తే మూడు, నాలుగేళ్లలో రాజధాని నిర్మించడంతో పాటు అన్ని హామీలను నెరవేరుస్తామని తోట కేసీఆర్‌ మాటగా చెబుతున్నారు.

ఏపీలో జనసేన ఎంత పోరాడుతున్నా ఆ పార్టీకి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేని పరిస్థితి. బీజేపీ తామున్నామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రమంతా పోటీ చేసే బలం బలగం ఆ పార్టీకి కూడా లేదు. అయితే కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడన్నట్లు వచ్చే ఎన్నికల్లో ఏకంగా బీఆర్ఎస్ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పడాన్ని కూడా కొంతమంది అలాగే చూస్తున్నారు. తెలంగాణ మాదిరే ఏపీలోనూ కేసీఆర్ మైండ్ గేమ్ మొదలుపెట్టారని విశ్లేషిస్తున్నారు. 175 సీట్లలో పోటీకి సిద్దమవుతుండటం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. అయితే తెలంగాణ రాజకీయాలు వేరు ఏపీ రాజకీయాలు వేరు. తెలంగాణలో సెంటిమెంట్ అనే అయింట్ మెంట్ ప్రధాన అస్త్రమయితే ఏపీలో కుల రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇదే విషయాన్ని అనేక మంది నేతలు స్పష్టం చేశారు కూడా. అలాంటి చోట కేసీఆర్ చాణక్యం చెల్లుబాటు అవుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది.

ఇప్పటికే 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ అంత కాకపోయినా 160 సీట్లలో కచ్చితంగా గెలుస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ 175 సీట్ల పోటీ ప్రకటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీతో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అంటకాగుతున్నా అధికార పార్టీ మాత్రం అది కేవలం కేంద్ర రాష్ట్ర సంబంధాలుగానే చెప్పుకుంటోంది. కానీ జనసేన మాత్రం నేరుగా మిత్రపక్షంగా ఉంది. టీడీపీ బీజేపీతో పొత్తు కోసం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో జగన్‌ కోసమే కేసీఆర్ వ్యూహాలనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికే జనసేన ఓటు బ్యాంకుగా భావిస్తున్న కాపులకు పెద్దపీట వేసేందుకు తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్ ఆ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మిగిలింది టీడీపీ. అంటే వీరిద్దరికీ తీవ్ర నష్టం కలిగించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది.