బుచ్చయ్యకు బై బై..!-butchaiah-chowdary-tdp-flag-janasena-flag

By KTV Telugu On 22 February, 2024
image

KTV TELUGU :-

సోషల్ మీడియాలో ఆయన్ను బుచ్చయ్య తాత అని పిలుస్తారు. టీడీపీలో ఎక్కువ వయసున్న నాయకుడు కావడం వల్లే ఆయన్ను అలా పిలుస్తుండొచ్చు. పైగా ఆయన మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ.. వైసీపీని  తూర్పార పడుతుంటారు. అందుకే వైసీపీ సోషల్ మీడియా ఆయనకు బుచ్చయ్య తాత అని పేరు పెట్టింది. అలాంటి భీష్మాచార్యుడి రాజకీయ జీవితం ఎండ్ అయ్యే పరిస్థితి వచ్చిందన్న అనుమానాలు కలుగుతున్నాయి… ఇంతకీ అలా ఎందుకు జరుగుతోంది….

రాజమండ్రి రూరల్ టీడీపీ సిట్టింగ్ స్థానం. 77  ఏళ్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ నియోజకవర్గానికి  ఎమ్మెల్యే. మళ్లీ తనకే  టికెట్ దక్కుతుందని బుచ్చయ్య ఎదురు చూశారు. ఇప్పుడు సడన్ గా అక్కడ జనసేన ప్రతినిధి చేసిన ప్రకటనతో బుచ్చయ్యకు ముచ్చెమటలు పట్టాయి. రాజమండ్రి రూరల్ నుంచి తాను పోటీలో ఉంటున్నానని, తనకు టీడీపీ కూడా మద్దతిస్తుందని కందుల దుర్గేష్ అనే  జనసేన నేత ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఆదేశానుసారం తాను ఈ ప్రకటన చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. టీడీపీ వారిని సమాధానపరిచి తనకు మద్దతిచ్చేవిధంగా మాట్లాడుకోవాలని, అందుకు చంద్రబాబు కూడా ఒప్పుకుంటారని పవన్ చెప్పినట్లుగా కందుల దుర్గేష్ పెద్ద  బైట్ ఇచ్చేశారు. దీనితో ఇప్పుడు బుచ్చయ్యకు దిక్కుతోచని  పరిస్థితి ఏర్పడింది. జనసేన  తొందరపడి ప్రకటన చేసిందా లేక చంద్రబాబు మంత్రాంగంలో భాగమా అన్నది అర్థం కాక ఆయన తల్లడిల్లిపోతున్నారు. పైకి మాత్రం మేకపోతు  గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు..

నిజానికి ఇంకా బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు ఖరారు కాలేదు. సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. ముందే రెండేసి  స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి కొంత టెన్షన్ క్రియేట్ చేసుకున్నా తర్వాత  సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ రాజమండ్రి రూరల్ వ్యవహారంలో జనసేన ఒక అడుగు ముందుకు వేయడం వెనుక ఎవరి  మంత్రాంగం ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. అందుకోసం ఆచి తూచి అడుగులు వేస్తున్నానని  చెబుతుంటారు. మరి ఇప్పుడు రాజమండ్రి రూరల్ వ్యవహారాన్ని ఏకపక్షంగా సెటిల్ చేసుకోవాలని ప్రయత్నించడం వెనుక ఏదో ఉందన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఇదీ చంద్రబాబు గేమ్ ప్లానేనని బుచ్చయ్య లోలోన మథనపడుతున్నారని తెలుస్తోంది. రాజ‌మండ్రి రూర‌ల్ టీడీపీ సిటింగ్ స్థానం. అలాంటి చోట జ‌న‌సేన అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే, చంద్ర‌బాబునాయుడు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు ప్రేక్ష‌క పాత్ర పోషించ‌డం అంటే… ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌కు ఆమోద ముద్ర వేసిన‌ట్టు కాదా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. గ‌తంలో ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేసే సంద‌ర్భంలో చంద్ర‌బాబుపై గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఎన్టీఆర్ తుది శ్వాస వ‌ర‌కూ ఆయ‌న వెంటే గోరంట్ల న‌డిచారు. ఆ త‌ర్వాత కాలంలో రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా చంద్ర‌బాబు వెంట గోరంట్ల న‌డుస్తున్నారు.ఇప్పుడు త‌న‌పై నాడు చేసిన ఘాటు విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటున్నాడ‌నే అనుమానాల‌కు ఊతం ఇచ్చేలా బుచ్చ‌య్య టికెట్ విష‌యంలో బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పైగా  కొంతకాలం క్రితం నారా లోకేష్ పై కూడా బుచ్చయ్య ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఇప్పుడు అన్ని కలిపి కొడుతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి..

కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి. బహుశా చంద్రబాబు, పవన్ కల్యాణ్ గేమ్ ప్లాన్ కూడా అదే కావచ్చు. చేతికి మట్టి అంటకుండా బుచ్చయ్యను సాగనంపాలన్న కోరిక వారిలో ఉండొచ్చు. అందుకే ఒక అడుగు  ముందుకేస్తే.. బుచ్చయ్య అర్థం చేసుకుని తప్పుకుంటారని కూడా భావించొచ్చు. అసలు నిజమేంటో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి