చంద్రబాబు చెప్పిందేమిటి..చేస్తున్నదేమిటి…

By KTV Telugu On 30 October, 2024
image

KTV TELUGU :-

హామీలు బారెడు, చేసిందీ మూరెడు అన్నట్లుగా ఉన్నదీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ పరిస్థితి. వచ్చి నాలుగు నెలలైనా సరే… ప్రజలు సంతృప్తిగా చెప్పుకునే పని ఒక్కటి కూడా చేయలేదు. పైగా టీడీపీ వారికే ఆందోళన కలిగించే అంశాలు ఇప్పుడు తెరపైకి వచ్చి.. వాళ్లంతా నానా గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో తన్నులు తిన్న వారు, తిండి -నీడ లేకుండా ఉద్యమాలు చేసిన వారి పరిస్థితి కూడా ఇప్పుడు అతీ గతీ లేకుండా పోయింది. ఎందుకలా జరుగుతుందో, దానికి కారణాలు ఎవరు చెబుతారో అర్థం కాక టీడీపీ కేడర్, ఆ పార్టీ సానుభూతిపరులు ఆవేదనలో మునిగిపోయారు….

వైసీపీని గద్దె దించడంలో కీలక పాత్ర వహించిన అంశాల్లో అమరావతి ఉద్యమం కూడా ఒకటి. జగన్ రెడ్డి మూడు ముక్కలాటకు తెర తీసి అమరావతి రాజధానిని అటకెక్కించిన నాటి నుంచి రైతులు, ముఖ్యంగా దళితులు రోడెక్కి నిరసనోద్యమాలు కొనసాగించారు. వైసీపీకి వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్ సృష్టించడంలో అమరావతి ఉద్యమానిదీ ప్రధాన భూమిక అని చెప్పాలి. అధికారానికి రాగానే అమరావతికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతలకు మాత్రం ఇంతవరకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. కనీసం వారి సేవలను గుర్తించినట్లుగా ఒక ప్రకటన కూడా చేయకపోవడంతో ఆయా నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.. రాత్రి పగలు తేడా లేకుండా అమరావతి కోసం కష్టపడిన దళిత నేతలు ఇప్పుడు ఉసూరుమంటున్నారు….

రాష్ట్రం విడిపోయాక రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాల సారవంతమైన భూమిని ఇచ్చేశారు. చంద్రబాబు అడిగారూ, రాష్ట్ర భవిష్యత్తు బావుంటుందీ అన్న ఆలోచనతోనే వాళ్లు తమ భూములను ప్రభుత్వానికి రాసిచ్చారు. జగన్ రెడ్డి వాళ్ల కడుపు కొట్టారన్నది వేరే విషయం. ఇప్పుడు మాత్రం అమరావతి రైతులు సంతృప్తి చెందే ఎలాంటి పనీ చంద్రబాబు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమరావతిలో పెట్టుబడులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను పెంచే చర్యలు ఇంకా మొదలు కాకపోవడం కాస్త ఆందోళన కలిగించే అంశమే అవుతుంది. ఉద్యోగులకు ఇళ్లు, ప్రైవేటు ఆస్పత్రులు, కార్పొరేట్ కళాశాలలకు ఏర్పాటు చేసినంత మాత్రాన లక్షలాది మందికి ఉపాధి ఎలా వస్తుందని ఆర్థిక రంగ నిపుణులే ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు అరచేతిలో వైకుఠం చూపించిన చంద్రబాబే ఇప్పుడు నాకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలే మొత్తుకుంటున్నాయి.

2014 నుంచి 2019 వరకు సింగపూర్ కతలు, ఐకానిక్ భవనాల పేరుతో కళ్లెదుటే కనికట్టు విద్యలు చూపించిన చంద్రబాబు ఒక సారి ఓడిపోయిన మాట అటుంచితే.. ఇప్పుడు మాత్రం పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు కనిపించడం లేదు. 2030 నాటికి నలభై లక్షల రాజధాని జనాభా కోసం మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ముందడుగు పడిన ఆనవాళ్లు లేక అమరావతి జనం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మూడు ప్రైవేటు యూనివర్సిటీలు, కొన్ని తాత్కాలిక భవనాలు మాత్రమే ఉన్నాయి. ఇకపై ఉద్యోగుల కోసమే అమరావతి నిర్మిస్తే కేవలం 10 నుంచి 15 వేల కుటుంబాలతో సరిపెడతారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వారి కోసం ఫైవ్ స్టార్ హోటళ్లు, కార్పొరేట్ అస్పత్రులు అవసరమా అన్నదే అందరూ వేస్తున్న ప్రశ్న…

అమరావతిలో యూనిట్ పెడుతున్నట్లు తయారీ రంగానికి చెందిన ఏ ఒక్క పెద్ద మనిషి గత ఆరు నెలలుగా ప్రకటించినదీ లేదు. పైగా ఇప్పుడు అమరావతి రైతులకు కొత్త డౌట్స్ వస్తున్నాయి. ఎంతసేపటికి ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటున్నారో తప్ప.. అమరావతిపై చంద్రబాబు గానీ, లోకేశ్ గానీ సమగ్ర కార్యాచరణ ఆవిష్కరించడం లేదని ఆవేదన చెందుతున్నారు. జగన్ రెడ్డి తరహాలో ఇప్పుడు చంద్రబాబు కూడా విశాఖపైనే దృష్టి పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. సాగర నగరంలోనే ఐటీ హబ్స్ …డేటా హబ్స్, ఆర్థిక రాజధాని అంటూ చంద్రబాబు టైమ్ పాస్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. టెస్లా కంపెనీని అనంతపురానికి ఆహ్వానిస్తున్నారే తప్ప ఎక్కడా అమరావతి ప్రస్తావన చేయడం లేదు. యువనేత నారా లోకేష్ అమెరికా పర్యటనలో సైతం ఇతర ప్రాంతాలను ఉదహరిస్తున్నారే తప్ప… అమరావతి ప్రస్తావన రావడం లేదు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అమరావతి జనం వ్యతిరేకించడం లేదు. తమ గతి ఏమిటన్నది మాత్రమే వాళ్లు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. రోడ్లు, రైల్వే లైన్లు వచ్చినంత మాత్రాన చేసేదేముందని..భారీగా తయారీ రంగం వచ్చినప్పుడే తమ జీవితాలు మారతాయని వారు గుర్తు చేస్తున్నారు. అమరావతి ఉద్యోగ కల్పన కేంద్రంగా మారినప్పుడే తమకు, తమ భవిష్యత్తు తరాలకు ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ దిశగా అమరావతిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు, కేడర్ కూడా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి చెందుతున్నారు. అసలు అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారా అన్నది వారి ప్రశ్న. అమరావతిని ఘోస్ట్ సిటీగా మార్చొద్దని వారు వేడుకుంటున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి