ఏపీ బిఆర్ఎస్ పార్టీ ఇంన్ ఛార్జ్ తోట పరిస్థితేంటి

By KTV Telugu On 12 April, 2023
image

 

జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పుదామని చేతులు రెడీ చేసుకుంటోన్న కొన్ని పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికలకు ఏడాది ముందు కొన్ని పార్టీలకు ఉన్న జాతీయ హోదాను రద్దు చేసింది. కాకపోతే కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యగా తయారైన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంత వరకు లేని జాతీయ హోదా వచ్చి పడింది. ఇక తెలంగాణా కేంద్రంగా ఆవిర్భవించిన భారతీయ రాష్ట్రసమితికి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా కూడా రద్దయ్యింది. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సాధించిన విజయాలు ఓట్ల శాతం ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేశారు తదిర అంశాల ప్రాతిపదికన జాతీయ హోదా కల్పిస్తారు. ఒక సారి జాతీయ హోదా వస్తే అది కలకాలం ఉండిపోతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీ అయినా ప్రమాణాలకు అనుగుణంగా ఫలితాలు సాధించలేకపోతే వాటి హోదాను రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ క్రమంలోనే దేశంలో జాతీయ పార్టీలుగా చెలామణీ అవుతోన్న బెంగాల్ లో ఆవిర్భవించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహారాష్ట్ర కేంద్రంగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లకు జాతీయ హోదా రద్దు చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఇదే సమయంలో ఇంత వరకు జాతీయ హోదా లేని ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పించారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకుని తీరతామని ప్రతిజ్ఞ చేసిన బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఈ పరిణామం శరాఘాతమే. బిజెపిని నిలువరించేందుకు విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోన్న తరుణంలో విపక్షాల కూటమికి రాహుల్ సారధ్యం వహిస్తే బిజెపిని ఎప్పటికీ ఓడించలేం అన్నారు మమతా బెనర్జీ. కాంగ్రెస్ స్థానంలో తానే విపక్షాలకు నాయకత్వం వహించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆమె ఆశ పడ్డారు. ఇపుడు పార్టీకి జాతీయ హోదా పోవడంతో రాజకీయంగా ఇది దీదీకి ఎదురు దెబ్బే. ఇక మరాఠా యోధుడు శరద్ పవార్ కూడా బిజెపి వ్యతిరేక కూటమి మరీ బలంగా అవతరిస్తే ప్రధాని పదవిని చేపట్టడానికి ఏ మూలనైనా ఏ చిన్న అవకాశమైనా ఉంటుందా అని చూసే రకం. అయితే ఆయనకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కూడా హోదా ఊడింది. ఇది ఆయనకూ నిరాశ కలిగించేదే.
మమతా బెనర్జీతో కలిసి వ్యవహారాలు నడుపుతోన్న కేజ్రీవాల్ కు మాత్రం చాలా హుషారైన వార్త అందించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పంజాబ్ కు సామ్రాజ్యాన్ని విస్తరించి అక్కడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ పార్టీ మొన్న గుజరాత్ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. తాజాగా కర్నాటక ఎన్నికల బరిలోనూ దిగుతోంది. చాలా చోట్ల కాంగ్రెస్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుని బిజెపికి తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు పంపుతోంది. అందుకే కేజ్రీవాల్ పార్టీపై కాంగ్రెస్ నిరంతరం విమర్శలు గుప్పిస్తోంది.

ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో సిపీఎం తన జాతీయ హోదాను కాపాడుకోగలిగింది. సిపిఐ మాత్రం జారిపోయింది. ఇకపై సిపిఐ జాతీయ పార్టీ కాదు. దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సిపిఎం బహుజన సమాజ్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ లే ఇకపై జాతీయ హోదా కలిగి ఉన్నాయి. ఇక కొద్ది వారాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణకు పావులు కదిపిన భారత రాష్ట్ర సమితి కి చేదు అనుభవం ఎదురైంది. ఆ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా రద్దు చేసింది ఎన్నికల సంఘం. టి.ఆర్.ఎస్. పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2014, 2019 ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. పోటీ చేయకపోవడం తో రాష్ట్ర పార్టీ హోదా రద్దు అయ్యింది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బి.ఆర్.ఎస్. కు ఆంధ్రప్రదేశ్ ఇన్ ఛార్జ్ గా తోట చంద్రశేఖర్ ను నియమించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. పార్టీ ఏపీలోని అన్ని స్థానాలకూ పోటీ చేస్తుందని చంద్రశేఖర్ ప్రకటించారు కూడా. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటునూ ఆర్బాటంగా చేశారు. అయితే రాష్ట్ర పార్టీ హోదా రద్దు కావడంతో వచ్చే ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.