అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలకు ఇప్పుడు చెవుల్లో పోలీస్ సంగీతం వినిపిస్తోంది. అప్పుడు రెచ్చిపోయిన వారంతా ఓటమి ఎదురుకాగానే బక్కచిక్కి చచ్చిపోతున్నారు. శ్రీకృష్ణజన్మస్థానానికి చేరుకోకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఆ దిశగా ముందస్తు బెయిల్ ఇవ్వండి మహా ప్రభో అంటూ కోర్టులను వేడుకుంటున్నారు. ఈ కోర్టు కాకుంటే ఇంకో కోర్టు అంటూ తెగ హైరానా పడిపోతున్నారు. అలా టెన్షన్ పడే వారిలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలు కూడా ఉన్నారు.
2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. ఫర్నీచర్ పగులగొట్టడంతో పాటు అక్కడున్న వారిని కొట్టారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో కేసును మసిపూసి మారేడుకాయను చేశారు. ఎవరో ఒకరిని అరెస్టు చేసి మమ అనిపించారు. ఇప్పుడు టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత కేసును రీ ఓపెన్ చేయడంతో తమను బుక్ చేయడం ఖాయమని పలువురు వైసీపీ అగ్రనేతలు భయపడుతున్నారు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఆ కేసులో 56 మందిని నిందితులుగా చేర్చారు. అందులో దేవినేని అవినాష్, లేళ్ల అప్పరెడ్డి, తలసిల రఘురాం, నందిగం సురేష్ కూడా ఉన్నారు. కొందరికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఈ నెల 16 వరకు అరెస్టు చేయకూడదని ఏపీ హైకోర్టు ఆదేశించింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కూడా నోటీసులు ఇవ్వడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనది కూడా అదే పరిస్థితి
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అలా ఉండగా, రఘురామ కృష్ణరాజు థర్డ్ డిగ్రీ కేసులో మాజీ సీఎం జగన్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జగన్ తదుపరి చర్యలేమిటన్న సస్పెన్స్ కొనసాగుతుండగానే.. ఉత్తరాంధ్ర వైపు నుంచి టీడీపీ నరుక్కు వస్తోంది. మాజీ మంత్రి సీదిరి అప్పల రాజుపై కేసు నమోదు చేయాలని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలోని టీడీపీ బృందం ఈ ఫిర్యాదు చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఆరోపించింది. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదని, ఆ విషయాన్ని వైద్యుడిగా తాను ధృవీకరిస్తానని అప్పట్లో అప్పల రాజు వ్యాఖ్యానించారు. అప్పుడు కేసు పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తే పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిర్యాదు చేసి కేసు పెట్టాలని కోరుతోంది. పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలుపొందిన సీదిరి అప్పలరాజు.. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి స్వింగ్‌లో అప్పలరాజు దారుణంగా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష.. ఆయనపై 40 వేల మెజార్టీతో గెలిచారు.
వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు నేతలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే వారు అంత సులభంగా తప్పించుకునే అవకాశాలు లేవు. త్వరలో ఏదోకటి జరగడం ఖాయం. ఎంతమంది అరెస్టు అవుతారో చూడాలి…..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…