వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ఎంక్వయిరీ వైసీపీని ఆత్మరక్షణలో పడేస్తోంది. అవినాష్‌రెడ్డి ప్రమేయంలేదనో బంధువులు ఎవరూ కుట్ర చేయలేదనో చెప్పే ప్రయత్నంలో లాజిక్ మర్చిపోతోంది వైసీపీ. వైఎస్ వివేకా హత్య టీడీపీ పాలన ముగింపులో జరిగుండొచ్చు. కానీ ఎంక్వయిరీ వైసీపీ పాలనలో స్పీడ్ అందుకుంది. స్వయానా ముఖ్యమంత్రి బాబాయ్ హత్యకేసు. విచారణ జరుపుతోంది సీబీఐ. వైసీపీ ఇప్పుడు ఏ వాదన వినిపించినా అది వేరేరకంగానే వెళ్తుంది. జగన్ స్పీడ్‌ని ఎలా కంట్రోల్ చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్న టీడీపీకి వైఎస్ వివేకా హత్యకేసు బ్రహ్మాస్త్రంలా దొరికింది. విపక్షపార్టీ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో వైసీపీనేతలు రాంగ్ స్టెప్స్ వేస్తున్నట్లు కనిపిస్తోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు. విజయసాయిరెడ్డి సైడ్ అయిపోయాక పార్టీలో ప్రభుత్వంలో ఆయనే అందరికీ నెంబర్‌టూ. స్వతహాగా జర్నలిస్ట్ అయిన సజ్జల ఆచితూచి మాట్లాడతారు. బంగారాన్ని తూచినట్లే చాలా బ్యాలెన్స్‌గా ఉంటుంది ఆయన మాటతీరు. ఆయన చెప్పారంటే అది కచ్చితంగా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లే కానీ ప్రభుత్వ విధానాలగురించో వివాదాస్పద అంశాలమీదో తమ స్టాండ్‌ని నిక్కచ్చిగా చెప్పే సజ్జల వైఎస్ వివేకా మర్డర్ కేసు విషయంలో మాత్రం తడబడుతున్నారు. పార్టీ స్టాండ్‌మీద క్లారిటీ ఇవ్వలేక దాటవేత ధోరణి కనబరుస్తున్నారు.
వైఎస్ వివేకా కేసును సీబీఐ హ్యాండిల్ చేసిందంటే అది ఆయన కూతురు సునీత పోరాటం వల్లే. కేసు విచారణ పక్క రాష్ట్రానికి వెళ్లడం కూడా వివేకా కూతురి న్యాయపోరాటంతోనే. చంద్రబాబు కోరుకున్నదే జరుగుతుండొచ్చేమోగానీ ఆయనకి ఈ వ్యవహారంలో వేలుపెట్టే అవకాశమేలేదు. కానీ సీబీఐని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నాడని వైసీపీ భావిస్తే అంతకంటే అమాయకత్వం మరోటి ఉండదు. సీబీఐలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారన్నట్లు సజ్జలలాంటి వ్యక్తి కామెంట్ చేయడమంటే అది టీడీపీ అధినేతకు బూస్టప్ ఇవ్వడమే. చంద్రబాబు వల్లే సీబీఐ వైఎస్ కుటుంబీకుల్ని అనుమానిస్తోందన్న వాదన మీదే వైసీపీ ఉంటే కష్టం. ఎందుకంటే వైఎస్ వివేకా హత్యపై అప్పట్లో సీబీఐ ఎంక్వయిరీని తానే డిమాండ్ చేసిన విషయం వైసీపీ మర్చిపోయినట్లుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక బాబాయ్ హత్యకేసును సీరియస్‌గా తీసుకుని ఉంటే విచారణ ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు. కేసు పక్కదారి పడుతుందనే అనుమానంతోనే వివేకా కూతురు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేసులో న్యాయం జరుగుతుందని చెల్లెలికి జగన్ భరోసా ఇవ్వలేకపోవడం స్వయంకృతమే. ఇప్పుడాకేసు వైఎస్ కుటుంబసభ్యుల చుట్టే తిరుగుతోంది. పార్టీ ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డిని సీబీఐ అనుమానిస్తోంది. హత్యకేసు నిందితులు ఆయన ఇంట్లోనే ఉన్నారన్న వాదన తెరపైకి వచ్చింది. సీబీఐ దగ్గర బలమైన ఆధారాలుంటే అనుమానితులెవరూ తప్పించుకోలేరు. ఇలాంటప్పుడు అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు వైసీపీ ఎంక్వయిరీని తప్పుపట్టాల్సిన పన్లేదు. చంద్రబాబుని అనుమానించాల్సిన పన్లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.