ఆయన గెలవలేదు. వైసీపీ అభ్యర్థిని ఓడించారు. కసి కొద్ది ఆ పనిచేశారు. నిన్నటి అధికార పార్టీని ఓడించేందుకు సర్వ శక్తులు వినియోగించారు. తన మిషన్ కంప్లీట్ అయినందున ఇప్పుడు మళ్లీ కొత్త రూటు వెదుకుతున్నారు. తరచూ పార్టీలు మార్చే ఉమ్మడి ప్రకాశం నేత ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు ఏపీ అధికార పార్టీ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నారు. పిలిస్తే వస్తాం కదా అన్నట్లుగా సంకేతాలిస్తున్నారు….
నిన్నటి ప్రకాశం, నేటి బాపట్ల జిల్లాల్లో ఆమంచి యాక్టివ్ నేత అనే చెప్పాలి. ఏ పార్టీలో ఉన్నా కీలకంగా వ్యవహరిస్తారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారం ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు వైసీపీలో పెత్తనం సాగించిన ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీ అభ్యర్థిని దెబ్బతీశాడని ప్రచారం జరుగుతుంది. దీని కోసం వైసీపీలో ఉండి సంపాదించుకున్న సొమ్మునే వైసీపీ అభ్యర్థి ఓటమి కోసం ఖర్చు చేశారని టాక్. నిజానికి 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీరాల నుండి పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అనుచరుడిగా పేరున్న ఆమంచి కృష్ణమోహన్ 2009 నుండి 2014 ఎన్నికల వరకు చీరాలలో తన హవా సాగించారు. అయితే 2014 ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల అనంతరం టీడీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ అక్కడ కూడా నిలవకుండా 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరారు. చీరాల టికెట్ దక్కించుకొని పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఫ్యాన్ గాలిలోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో చీరాలలో టీడీపీ నుండి గెలుపొందిన కరణం బలరాం…ఆయన కుమారుడు వెంకటేష్ తో కలిసి వైసీపీలో చేరడంతో ఆమంచికి కష్టకాలం మొదలైంది. అప్పటి నుంచి చీరాలలో పెత్తనం కోసం ఆమంచి, కరణం వర్గాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగింది. పరిస్థితిని చక్కబెట్టే క్రమంలో ఆమంచిని వైసీపీ అధిష్టానం పర్చూరు ఇంచార్జీగా ప్రకటించింది. అయితే అక్కడా నిలవలేదు…
సూది దూరే సందు ఇస్తే శరీరాన్ని దోపే టైపుగా ఆమంచికి పేరు ఉంది. పర్చూరులో కూడా అవసరానికి మించి పెత్తనం చేయడంతో ఆమంచిపై ఫిర్యాదులు వెళ్లాయి. దానితో ఆయన మళ్లీ తనదైన ఫిరాయింపు రాజకీయాలకు తెరతీశారు….
పర్చూరులో సీనియర్లను సైతం పక్కకు నెట్టిన ఆమంచి ఇష్టానుసారం వ్యవహరించడంతో తాడేపల్లి ప్యాలెస్ కు వరుస ఫిర్యాదులు వెళ్లాయి. ఒకటి రెండు సార్లు హెచ్చరికలు కూడా రావడంతో పర్చూరును వదిలేసిన ఆమంచి.. ఎన్నికల్లో చీరాల టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆమంచిని పట్టించుకోని వైసీపీ అధిష్టానం చీరాల టికెట్ ను కరణం వెంకటేష్ కు కేటాయించింది. దానితో తీవ్ర ఆగ్రహం చెందిన ఆమంచి.. వ్యూహం మార్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీరాల టికెట్ తీసుకుని… కరణం వెంకటేష్ ఓటమి కోసం పనిచేశారు. ఎన్నికల్లో గెలుపు కంటే కరణం వెంకటేష్ ఓటమి కోసమే ఎక్కువగా పనిచేశారు. భారీగా డబ్బు ఖర్చు పెట్టి వైసీపీ ఓట్లను చీల్చారు. ఫలితాల రోజున చూస్తే ఆమంచి వ్యూహం ఫలించినట్లు అర్థమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనకు 25 శాతం వరకు ఓట్లు వచ్చాయి. కరణం వెంకటేష్ కు 30 శాతం ఓట్లు వచ్చాయి. 42 శాతం ఓట్లతో టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య గెలుపొందారు. ఆమంచి ఓట్లు చీల్చకపోతే కరణం వెంకటేష్ సునాయాసంగా గెలిచేవారని చీరాలలోని వైసీపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఓడిన తర్వాత ఇప్పుడు ఆమంచి ఊరికే కూర్చోలేకపోతున్నారు. ఎలాగైనా తను ప్రస్తుత అధికార పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారు. నేరుగా అడక్కుండా సందేశాలు పంపుతున్నారని తెలుస్తోంది.
టీడీపీలో ఇప్పటికే ఓవర్ క్రౌడ్ అయిపోయింది. కొత్తగా బెర్తులు ఖాళీ లేవని చెబుతున్నారు.పైగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ చాలా బలంగా ఉంది. అక్కడ పార్టీని ప్రత్యేకంగా బలోపేతం చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు ఆమంచి వెళ్లి నేరుగా అడిగినా చేర్చుకుంటారన్న నమ్మకమైతే లేదు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…