జనసేనకూ పచ్చటోపీయేనా?

By KTV Telugu On 23 December, 2023
image

KTV TELUGU :-

చంద్రబాబు నాయుడి దర్శకత్వంలో  కొనసాగుతోన్న   మెగా  సీరియల్ ఆక్ పాక్ కరివేపాక్ సిరీస్ లోని తాజా ఎపిసోడ్ లో జనసేనానికి భంగపాటు తప్పదంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు నాయుడు జైల్లోనూ.. టిడిపి  పీకల్లోతు సంక్షోభంలోనూ  ఉన్న సమయంలో   మీకు నేనున్నాను అంటూ  చంద్రబాబు నాయుడికి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ కు రాబోయే ఎన్నికల్లో  కోలుకోలేని షాక్ ఇవ్వడానికి  రంగం సిద్ధమైపోయిందంటున్నారు. టిడిపితో పొత్తు తో అసెంబ్లీలో పార్టీ ప్రాతినిథ్యం పెంచుకోవాలని చూస్తోన్న పవన్ కళ్యాణ్ కు  అరకొరగా సీట్లు  విదిల్చి చేతులు దులిపేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

పవనొకటి తలిస్తే ..బాబు ఇంకోటి తలిచారు. తెలుగుదేశం పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు   అండగా ఉన్నందుకు జనసేన  పార్టీకి   కిరీటం తొడుగుతారని.. ఆవిధంగా కృతజ్ఞతలు వ్యక్తం చేసుకుంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. పొత్తులో భాగంగా జనసేనకు తాము అడిగిన విధంగా వీలైనన్ని ఎక్కువ స్థానాలు కేటాయిస్తారని కూడా పవన్ నమ్మారు. అంతే కాదు టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే  పవన్ కు ఒక ఏడాది అయినా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ నూ చంద్రబాబు ముందుంచారట. విశ్వసనీయ వర్గాల  సమాచారం ప్రకారం  జనసేనకు కనీసం 50 నుండి 60 అసెంబ్లీ స్థానాలు అయిదు నుండి 8వరకు లోక్ సభ స్థానాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్  కోరినట్లు  తెలుస్తోంది.తాము అడిగినన్ని సీట్లు ఎలాగూ ఇవ్వరు కాబట్టి బేరసారాలకోసం అడిగేదేదో ఎక్కువ స్థానాలే అడిగేద్దాం అన్నది జనసేన వ్యూహకర్తల యోచనగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 50 నుండి 60 స్థానాలు అడిగితే చంద్రబాబు కనీసం 40 నుంచి 45 స్థానాలు అయినా ఇస్తారన్నది జనసేన వ్యూహం.

అయితే జనసేనకు  పాతిక సీట్లు కూడా అవసరం లేదన్నది చంద్రబాబు   ఆలోచనగా తెలుస్తోంది. అయితే తన మనసులో మాటను చంద్రబాబు బయట పెట్టడం లేదు. తన పుత్రరత్నం అయిన లోకేష్‌ ద్వారా తన మనసులో మాటను  ప్రచారంలో పెడుతున్నారు. టిడిపి-జనసేన పొత్తులో భాగంగా జనసేనకు నామమాత్రంగా మాత్రమే సీట్లు కేటాయించనున్నారని   స్పష్టం చేసేశారు లోకేష్.నారా లోకేష్  చేపట్టిన యువగళం పాదయాత్రను అర్ధంతరంగా ముగించేసిన   టిడిపి నాయకత్వం ఉత్తరాంధ్రలో  విజయోత్సవ సభను నిర్వహించింది.

ఈ సభకు రెండు రోజుల ముందు  టిడిపి అనుకూల మీడియాకు లోకేష్  ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ఛానెల్ ప్రతినిథితో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి 150స్థానాల్లో అభ్యర్ధులను  ఖరారు చేసేసుకుందని స్పష్టం చేశారు. మిగతా పాతిక సీట్లలోనూ రెండు మూడు  సీట్లు  అటూ ఇటూ కావచ్చునన్నారు. ఈ నర్మగర్భపు వ్యాఖ్య వెనుక చాలా అంతర్యం ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఒక వేళ తమతో పొత్తుకు బిజెపి ససేమిరా అంటే..జనసేనతో పాటు కమ్యూనిస్టులను కూడా చంద్రబాబు కలుపుకుపోయే అవకాశాలున్నాయి. అపుడు  రెండు కమ్యూనిస్టు పార్టీలకూ చెరో మూడు స్థానాలు ఇచ్చి  జనసేనకు 19 స్థానాలు  మాత్రమే కేటాయించే అవకాశాలు ఉండచ్చంటున్నారు.

లేదంటే కమ్యూనిస్టు పార్టీలకు మొత్తం మీద నాలుగు స్థానాలు ఇచ్చి  జనసేనకు 21 స్థానాలు ఇచ్చి  అధికారంలోకి వస్తే  రెండో మూడో ఎమ్మెల్సీలు ఇస్తామని ఆఫర్ ఇచ్చే అవకాశం కూడా ఉండచ్చంటున్నారు. జనసేనను చివరి దాకా భ్రమల్లో ఉంచి సీట్ల కేటాయింపు సమయంలో అసలు వ్యూహానని అమలు చేస్తారని అంటున్నారు. ఎక్కువ స్థానాలకోసం పవన్  పట్టుబట్టడానికి వీల్లేకుండా తెలంగాణా ఎన్నికల్లో జనసేన పరాజయాల పరంపరను సాకుగా చూపే అవకాశాలున్నాయంటున్నారు. అదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అంటున్నారు.

జనసేనకు కేటాయించే సీట్ల విషయంలోనే కాదు ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ లోకేష్  అయిదు కోట్ల మంది  ఆంధ్రులకు క్లారిటీ ఇచ్చారు. టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే  ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అని   టిడిపి అనుకూల మీడియా ప్రతినిథి లోకేష్ ను ప్రశ్నించారు.దానికి లోకేష్ ఏ మాత్రం తడుముకోకుండా ..శషభిషలు లేకుండా ఇంకెవరు చంద్రబాబు నాయుడే మా ముఖ్యమంత్రి అని    స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యపై  జనసైనికుల్లో చర్చ జరిగిందంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నదే జనసైనికుల అజెండా. అందుకోసమే  వారు  అహోరాత్రులూ శ్రమిస్తున్నారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అంటే జనసేన కార్యకర్తలు కానీ పవన్ అభిమానులు కానీ టిడిపికి మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి