ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కేబినెట్ కూర్పులో ఈసారి గతానికంటే భిన్నంగా వ్యవహరించారు. చంద్రబాబు తనతో పాటు గతంలో పనిచేసిన సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టి ఏకంగా 17 మందికి తొలిసారి మంత్రులుగా అవకాశం కల్పించారు. సామాజికవర్గాల వారీగా చూస్తే అగ్రకులాలకే చంద్రబాబు అగ్రతాంబూలం లభించింది. చంద్రబాబు కేబినెట్ లో ఆయన కుమారుడు లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపించిందందనే చర్చ ఎందుకు మొదలైంది?
ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి మంత్రివర్గ కూర్పులో చంద్రబాబు ముద్ర కంటే కూడా ఆయన తనయుడు నారా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఎన్‌టీఆర్ హయాం నుంచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగినవారిని పక్కన పెట్టిన చంద్రబాబు…లోకేష్ అనుచరులుగా ముద్రపడ్డ అనేక మంది కొత్త ఎమ్మెల్యేలకు తన క్యాబినెట్‌లో అవకాశం కల్పించారు. మంత్రివర్గంలో తన తర్వాతి స్థానంలో ఉండే లోకేష్ మాటకు ఎదురు లేకుండా ఉండేందుకే..ఆయన ఒత్తిడి మేరకే సీనియర్లందరినీ పక్కన పెట్టేసిన చంద్రబాబు కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది.
గడచిన ఐదు సంవత్సరాలుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లోకేష్ తో సన్నిహితంగా ఉంటూ, ఆయన మనుషులుగా పార్టీలో ముద్ర ఉన్నవారికి అత్యధికంగా మంత్రి పదవులు దక్కాయి. చంద్రబాబు క్యాబినెట్‌లో ఆయన తనయుడు లోకేష్‌కు అత్యధిక ప్రాధాన్యత దక్కిందని చెప్పడానికి ఇదే నిదర్శనమంటున్నారు. లోకేష్ కి సన్నిహితులైన టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, సంధ్యారాణి, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్ వంటి వారికి మంత్రి పదవులు దక్కాయి.
కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలుండగా పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో పాటు..నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కింది. వాస్తవానికి జనసేన పార్టీకి క్యాబినెట్‌లో ఐదు బెర్తులు వస్తాయని ప్రచారం సాగింది. కాని చంద్రబాబు పవన్ పార్టీ నుంచి ముగ్గురికి మాత్రమే పదవులు ఇచ్చారు. ఆ ముగ్గురు మంత్రులు కూడా అగ్రవర్ణాలవారే ఉన్నారు. బిజెపి నుండి 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. బీజేపీ నుంచి గెలిచినవారిలో చంద్రబాబు మనుషులుగా ముద్రపడ్డవారు కాకుండా అమిత్ షా మనిషిగా ముద్ర ఉన్న వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నుండి సత్య కుమార్ కి క్యాబినెట్‌లో చోటు లభించింది.
చంద్రబాబు తన కేబినెట్ లో మొత్తం 17 మందికి తొలిసారి మంత్రులుగా అవకాశం కల్పించారు. వారిలో పది మంది అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 1 వైశ్య సామాజికవర్గ నేతకు మంత్రి పదవులు ఇచ్చారు. 8 మంది బీసీ నేతలకు మంత్రి పదవులు దక్కాయి. రాష్ట్ర మంత్రివర్గంలో అగ్రవర్ణాలదే సింహ భాగం. అగ్రవర్ణాలకు 13 మంత్రి పదవులు, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీలకు 12 మంత్రి పదవులు ఇచ్చారు. అయితే మరో బెర్త్ ఖాళీగా ఉంది. ఆ పదవి ఎవరికి ఇస్తారో కొద్ది రోజుల్లో తేలనుంది.
నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా మరో 8 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై మంత్రులయ్యారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. చంద్రబాబు ఈసారి క్షత్రియ, బ్రాహ్మణ, బోయ, కాళింగ వంటి సామాజికవర్గాలకు తన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదు. మొత్తం మీద అగ్రవర్ణాలకు ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు క్యాబినెట్‌లో లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందనే టాక్ మొదలైంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…