టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్తితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా తయారవుతోంది. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో చంద్రబాబు ఉన్నారన్న టాక్ మొదలైనప్పటి నుంచి ఇంతవరకు ఆయన ఏం చేశారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏపీకి ఏ మేర నిధులు తెస్తారని కొందరు ప్రశ్నిస్తుంటే, ప్రత్యేక హోదా సాధించే సీన్ ఉందా అని మరికొందరు నిలదీస్తున్నారు. రాజకీయంగా నేలకు దిగిన వైసీపీ కూడా ఇప్పుడు చంద్రబాబుపై అటాక్ చేస్తోంది. మరో పక్క స్పీకర్ పదవి విషయంలో వెనక్కి తగ్గితే చంద్రబాబు నష్టపోతారని ఎన్డీయేతో సంబంధం లేని ఉద్ధవ్ ఠాక్రే శివసేన హెచ్చరిస్తోంది.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనేక అవకాశాలను కల్పిస్తూనే మరిన్ని ప్రశ్నలకు ఆవిష్కరించాయి. కూటమికి 160కి పైగా స్థానాలు రావడం, టీడీపీకి సొంత మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు దక్కడంతో పార్టీ శ్రేణులు అమితానందం పొందుతున్నారు. కేంద్రంలో టీడీపీ సహిత ఎన్డీయేకు కూడా మెజార్టీ ఉంది. కాకపోతే అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. టీడీపీ లేకపోతే ఎన్డీయే లేదన్న పరిస్థితిని సంఖ్యా బలాలు ఆవిష్కరించాయి. బీజేపీకి సొంతబలంపై ప్రభుత్వాన్ని కాపాడుకునే అవకాశం లేకపోవడంతో టీడీపీ, జేడీయూపై ఆధారపడాల్సి వస్తోంది. టీడీపీ వైదొలిగితే… ఎన్డీయే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే అంశాన్ని ఇప్పుడు ఏపీ విపక్షంతో పాటు, కొన్ని పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు మోదీపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నాయి. నిజానికి అదీ మోదీపై ఒత్తిడి కాదు… చంద్రబాబుపై ఒత్తడిలా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఆంధ్రప్రదేశ్ నిధుల విషయంలో చంద్రబాబు ఏ మేరకు చొరవ చూపిస్తారనేది పెద్ద ప్రశ్నే అవుతోంది. రాష్ట్రం కోసం మోదీ ప్రభుత్వాన్ని చంద్రబాబు గట్టిగా నిలదీస్తారా లేక గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇచ్చినదానితో సరిపెట్టుకుంటారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2019కి ముందు మోదీపై అలిగి చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. అప్పుడు చంద్రబాబు ఓడిపోతే,కేంద్రంలో మోదీ గెలిచారు. చంద్రబాబు ఐదేళ్లు విపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చినా తొందరపడి ఎలాంటి దూకుడును ప్రదర్శించేందుకు సిద్ధంగా లేరు. ఆ సంగతి తేలిసే….రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై వత్తిడి తెచ్చి సైకలాజికల్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు…
వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రజలను ఆకట్టుకునేందుకు ఇప్పుడు ప్రయత్నించక తప్పదు. ఈ క్రమంలో మళ్లీ స్పెషల్ స్టేటస్ వ్యవహారం తెరపైకి తీసుకు వస్తున్నారు. పార్టీలకు అది మంచి టైమ్ పాస్ అని కూడా అందిరకీ తెలుసు. మరో పక్క ఇండియా కూటమి నేతలు కూడా ఎన్డీయేను అస్థిర పరిచేందుకు చంద్రబాబు, మోదీ మధ్య తగవు పెట్టేందుకు పావులు కదుపుతున్నారు….
25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంతో కొట్లాడి స్పెషల్ స్టేటస్ తీసుకువస్తామని 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ రెడ్డి డాంబికాలు పలికారు. అప్పటికే స్పెషల్ స్టేటస్ కోసం సంకీర్ణం నుంచి టీడీపీ తొలగిపోయింది. అప్పటి ఎన్నికల్లో వైసీపీకి 22 లోక్ సభా స్థానాలు వచ్చాయి. వెంటనే జగన్ ప్లేట్ ఫిరాయించేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ సొంత మెజార్టీ వచ్చినందున తమకు 22 మంది ఎంపీలున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఐనా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూనే ఉంటామని ఆయన చెప్పుకున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కాపీ పేస్ట్ వినతిపత్రాలు సమర్పించడం తప్పితే జగన్ సాధించిందేమీ లేదు. కాలచక్రంలో ఐదేళ్లు కదలిపోగా, ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారానికి రాగానే ప్రత్యేక హోదా వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్రంలో వీక్ గా ఉన్న బీజేపీ మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకురావాలని జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ట్వీట్ల మీద ట్వీట్లు వదులుతున్నారు. మంచి తరుణం మించిపోనీకు అని పాటలు పాడుతున్నారు. అమరావతి రాజధానికి, పోలవరానికి నిధులు తెచ్చుకునేందుకు కూడా ఇదే తగిన తరుణమని చంద్రబాబు ప్రత్యర్థులు వాదిస్తున్నారు. సోమవారం పోలవారం అంటూ మళ్లీ పాతనినాదాన్ని అందుకున్న చంద్రబాబు.. ఒక సారి ప్రాజెక్టు సందర్శన పూర్తి చేశారు.మరి పోలవరం నిధులు కేంద్రం జాప్యం చేస్తుంటే చంద్రబాబు దాని గురించి ఎందుకు మాట్లాడరని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీని నెత్తినెక్కించుకుంటే టీడీపీని మింగేస్తారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రావత్ హెచ్చరిస్తున్నారు. టీడీపీకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే లోక్ సభ స్పీకర్ పదవిని డిమాండ్ చేయాలని ఆయన అంటున్నారు. బీజేపీ బుద్ధి తమకు తెలుసని, ఇతర పార్టీలను చీల్చినట్లుగా టీడీపీని కూడా చీల్చేందుకు వెనుకాడదని ఆయన విశ్లేషిస్తున్నారు. టీడీపీ నేత స్పీకర్ స్థానంలో ఉంటే ఫిరాయింపులను అడ్డుకునే అవకాశాలు ఉంటాయన్నది సంజయ్ రావత్ అభిప్రాయం.అవకాశం వస్తే టీడీపీని ఇండియా గ్రూపులోకి లాక్కుని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నది ఆయన ఆలోచనగా అనుకోవాలి..
చాలా మంది సలహాలు ఇస్తారు. చంద్రబాబుకు మాత్రం ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారమే ఆయన ముందుకు సాగుతారు. తమ రాజకీయ భవిష్యత్తును కూడా లెక్కలోకి తీసుకుని ఆయన పావులు కదుపుతారు. ఇప్పట్లో మోదీతో పెట్టుకుంటే ఇబ్బందేనని ఆయనకు తెలుసు.కాకపోతే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం ఎలాగన్నదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఆ సంగతిని చంద్రబాబు అర్థం చేసుకుంటే చాలు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…