పూలమ్మిన చోటే కట్టెలు అమ్ముకోవడం చాలా కష్టం. అంతకు మించి చాలా అవమానకరం. రాజకీయాల్లో ఇటువంటి కష్టాలు చాలా మంది సీనియర్లను బాధపెట్టిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు గిర్రున చక్రాలు తిప్పిన టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన సీటును జనసేనకు కేటాయించేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బుచ్చయ్య వర్గం పార్టీ నాయకత్వంపై ఆగ్రహంగా ఉంది.
ఉమ్మడిగోదావరిజిల్లాల టీడీపీలో బుచ్చయ్యచౌదిరి గురించి తెలియనివారుండరు..టీడీపీలో ఆయన చంద్రబాబు కంటే సీనియర్…ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా కూడా పనిచేశారు. రాజమండ్రి సిటీ రాజకీయాల్లో ఎన్నోఏళ్లు చక్రం తిప్పారు. ఇపుడు పరిస్థితి మారిపోయింది. బుచ్చయ్యను పక్కన పెట్టేందుకు రంగం సిద్ధమైంది.జనసేన పొత్తులో భాగంగా ఈసారి రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించినట్టు స్పష్టమైపోయింది. దీంతో జనసేన నేత కందులదుర్గేష్ అక్కడ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఈ నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. అధిష్ఠానమే తన సీటుకు ఎసరు పెడుతోందని అర్ధం కావడంతో బుచ్చయ్యకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
టీడీపీలో చంద్రబాబుకంటే సీనియర్ అయిన గోరంట్ల ఆ పార్టీ ఫౌండర్ అయిన ఎన్టీఆర్ కు నమ్మకమైన వ్యక్తి. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది లగాయితు ఆయన్ను అంటిపెట్టుకునే ఉన్నారు బుచ్చయ్య చౌదరి. చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో సైతం బుచ్చయ్య చౌదిరి ఎన్టీఆర్ వైపే నిలిచారు. ఎన్టీయార్ మరణించే వరకు బుచ్చయ్య ఆయనతోనే ఉన్నారు. చంద్రబాబు కోటరీలోకి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. చివరకు ఎన్టీయార్ మరణానంతరం కొంత కాలం లక్ష్మీపార్వతి పార్టీలో ఉండి ఆ తర్వాతనే చంద్రబాబు పంచన చేరారు. అందువల్లే చంద్రబాబు గోరంట్లను పూర్తిగా నమ్మరనే ప్రచారం ఉంది.
దీంతోపాటు తనకు అన్యాయం జరిగిందని భావిస్తే,పార్టీ అntrధినాయకత్వంపై గోరంట్ల విరుచుకుపడతారనే ముద్ర ఉంది. తనకు మంత్రి పదవి రాని సమయంలో పార్టీలో పదవులను నాయకులు అమ్ముకుంటున్నారంటూతీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అటువంటి వ్యక్తిని ఇపుడు పొమ్మనకుండానే పొగబెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ రాజకీయాలకు లోకేశ్ కేంద్ర బిందువు అయినప్పటి నుంచి పార్టీలో బుచ్చయ్య ప్రభ తగ్గుతూ వస్తోంది. పార్టీ అధిష్టానం ఆయనపై పెద్దగా నమ్మకం ఉంచిన పరిస్థితులు కనపడటం లేదు.
స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నపుడు ఆపార్టీ చేపట్టిన ఆందోళనలకు స్థానిక నాయకుడు, రాజమండ్రి సిటి ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసు నాయకత్వం వహించారు. దీంతో సహజంగానే లోకేశ్, చంద్రబాబులు ఆదిరెడ్డి కుటుంబానికి అధిక ప్రాథాన్యత ఇచ్చారు. ఇపుడు ఒక్కొక్క మెట్టూ దింపుతూ ఆఖరుకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రూరల్ నియోజకవర్గాన్ని కూడా పొత్తులో భాగంగా జనసేనకు కట్టబెట్టడంపై బుచ్చయ్యవర్గీయులు మండిపడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్ధాయిలో నిర్వహించే కీలక సమావేశాల నిర్వహణ విషయంలో బుచ్చయ్యకు పార్టీ వర్గాలు మొండిచెయ్యే చూపుతున్నాయి.కొద్దిరోజుల క్రితం జరిగన టీడీపీ- జననసే సమన్వయ కమిటీ సమావేశంలో కూడా బుచ్చయ్యకు అవకాశం కల్పించలేదు. బుచ్చయ్య కన్నా జూనియర్లు అయిన నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్యలను సమన్వయ కమిటీ సమావేశానికి పిలవడం గమనార్హం.
మరోవైపు బుచ్చయ్యను లోక్ సభ బరిలో దింపాలని అధిష్టానం భావించినా, బుచ్చయ్య అందుకు సిద్ధంగా లేరు..తానుఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, అది రూరల్ నుంచే చేస్తానని స్పష్టం బుచ్చయ్య స్పష్టం చేశారు. పార్టీకి నమ్మకంగా పనిచేసే బుచ్చయ్యను అధిష్టానం విస్మరించడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…