చంద్రబాబు కుప్పాన్ని వీడుతున్నారా? -chandrababu-Naidu-Nara Brahmani-kuppam-TDP

By KTV Telugu On 23 February, 2024
image

KTV TELUGU :-

ఏడు సార్లు గెలిచిన కుప్పం నియోజక వర్గం ఈ సారి తనకి సేఫ్ కాదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో  చంద్రబాబు నాయుడు వేరే నియోజక వర్గానికి బదలీ అవ్వాలని ఆలోచన చేస్తున్నారా? ఇపుడీ ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. రాజకీయ వర్గాల్లోనే కాదు టిడిపి వర్గాల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరే. తాజాగా ఆమె కుప్పం నియోజక వర్గంలో చేసిన వ్యాఖ్యలే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతా అనేసి చివర్లో ఆమె ఏదో సరదాకి ఇలా అన్నాను అన్నా కూడా..ఆమె మనసులో ఇంకేదో ఉందనే అంటున్నారు.చంద్రబాబు నాయుడి ఆదేశాలతోనే ఆమె అటువంటి వ్యాఖ్య చేసి ఉంటారని  అంటున్నారు.

నారా భువనేశ్వరి కుప్పంలో  నిజం గెలవాలి  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  అక్కడకు తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు, కుప్పం ప్రజలను ఉద్దేశించి  నారా భువనేశ్వరి ప్రసంగించారు.  నా భర్త చంద్రబాబు నాయుణ్ని ఇప్పటికి 35 ఏళ్లుగా గెలిపిస్తూనే ఉన్నారు మీరు..ఔనా కాదా? అని భువనేశ్వరి అన్నారు. అందరూ అవును అని బదులిచ్చారు. దానికి ప్రతి స్పందనగా భువనేశ్వరి అందుకుని ఇక ఆయనకు రెస్ట్ ఇద్దాం. నా మనసులోని కోరిక ఏంటంటే..ఏ సారి కుప్పం నుంచి నేను పోటీ చేస్తాను అన్నారు. ఆ వెంటనే చంద్రబాబుకావాలనుకునే వారు చేతులు ఎత్తండన్నారు. కొందరు చేతులు ఎత్తారు. ఆ వెంటనే నేను కావాలనుకున్న వారు చేతులెత్తండి అన్నారు. మళ్లీ ఆ వ్యక్తులే చేతులు ఎత్తారు. ఇద్దరూ కావాలంటే కుదరదు ఎవరు కావాలో చెప్పండంటూ నవ్వేశారు. ఆ వెంటనే ఇది నేను ఏదో సరదాకి జోక్ గా అన్నారు సీరియస్ గా కాదన్నారు.

అయితే చంద్రబాబు నాయుడి సతీమణి హోదాలో చాలా రిజర్వుడుగా  ఉంటూ తక్కువ మాట్లాడే భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారంటే అది జోక్ గా కానే కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందులో ఏదో ఒక మర్మం కచ్చితంగా ఉందంటున్నారు వారు. కుప్పం ప్రజల నాడిని పట్టుకునేందుకే ఆమె ఈ వ్యాఖ్య చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇదంతా కూడా  రాజకీయ దురంధరుడైన చంద్రబాబు నాయుడి వ్యూహం ప్రకారమే జరిగిందని వారు అనుకుంటున్నారు. ఈ ప్రశ్నను బయటి వ్యక్తుల చేతనో ఇతర పార్టీ నేతల చేతనో అనిపిస్తే బాగుండదన్న ఆలోచనతోనే తన భార్యచేతనే చంద్రబాబు  పలికించారని అంటున్నారు.

భువనేశ్వరి వ్యాఖ్య వెనుక ఆంతర్యం ఏంటన్నది ఇపుడు చర్చనీయాంశమవుతోంది. కుప్పం నియోజక వర్గం నుంచి పోటీకి చంద్రబాబు నాయుడు అంతగా ఆసక్తి చూపడం లేదా? లేక కుప్పం ప్రజల్లో తన పట్ల ఆదరణ ఏ మేరకు ఉంది? అన్నది తెలుసుకోవాలని బాబు అనుకుంటున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదంటున్నారు  రాజకీయ విశ్లేషకులు. 2019 ఎన్నికల్లో టిడిపి అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ  చంద్రబాబు నాయుడి సొంత నియోజక వర్గం అయిన కుప్పంలో టిడిపికి ఘోర పరాజయాలే  వచ్చాయి. అన్ని ఎన్నికల్లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది.

కుప్పం మున్సిపాలిటీని  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం మండలంలోని 29  పంచాయతీల్లో 25 చోట్ల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  బలపర్చిన అభ్యర్ధులే విజయాలు సాధించారు. గుడిపల్లి మండలంలో 18 పంచాయతీలు ఉంటే అందులో 14 పంచాయతీల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధులే గెలిచారు. 22 ఎంపీటీసీ స్థానాలుంటే అందులో 20 చోట్ల   పాలక పక్షం జెండా ఎగిరింది.

కుప్పం నియోజక వర్గంలో ఉన్న నాలుగు జెడ్పీటీసీలూ పాలక పక్షం ఖాతాలో పడ్డాయి. ఇలా వరుసగా ఏ ఎన్నిక జరిగినా టిడిపికి పరాజయాల పరాభవాలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకుంటామని వైసీపీ నేతలు అప్పట్లోనే ఛాలెంజ్ చేశారు.

ఈ పరాజయాల తర్వాతనే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో మొదటి సారి కుప్పంలో సొంత ఇల్లు నిర్మాణానికి నడుం బిగించారు. రెండు మూడు నెలలకోసారి కుప్పం వెళ్లి రెండు మూడు రోజులు అక్కడే మకాం వేస్తున్నారు. అయినా ఆయనకు కుప్పంలో టిడిపికి అనువైన వాతావరణ ఉందన్న ధీమా రావడం లేదంటున్నారు. ఈ సారి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజక వర్గం అయితే తనకు సురక్షితమైనదని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. చేస్తే కుప్పంతో పాటు పెనమలూరు నుంచి పోటీ చేయచ్చు. లేదా కుప్పం వదిలేసి పెనమలూరు ఒక్క చోటు నుంచే పోటీ చేయచ్చని అంటున్నారు. ఏది ఏమైనా భువనేశ్వరి చేసిన వ్యాఖ్య టిడిపిని ఒక విధంగా డిఫెన్స్ లో పడేసిందనే చెప్పాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి