ఏపీ రాజకీయాల్లో కొత్త స్కీములు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ అంగబలం, అర్థబలం, అధికార దుర్వినియోగాన్ని దెబ్బకొట్టేందుకు టీడీపీ కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది.పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఈ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. వాటిపై తనదైన శైలిలో అంచనా వేసుకోవడం కూడా పూర్తయ్యిందంటున్నారు. ఇక రేపే మాపో కార్యాచరణ కూడా మొదలవుతుందని అంటన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా మారినట్లున్నారు. కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. అది ముందు జాగ్రత్త చర్య కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు కూడా కేసీఆర్ తరహాలోనే ఆలోచిస్తున్నారు. తాను కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కుప్పంతో పాటు మరో నియోజకవర్గం వేట దాదాపుగా పూర్తయినట్లు చెబుతున్నారు..
చంద్రబాబు ఇప్పుడు ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం విజయవంతం కావడంతో ఆయన కొత్త ప్రచారంతో ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. చంద్రబాబు ఇంతవరకు టూర్ చేయని 30 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఏపీలో ఓట్ల గోల్ మాల్ పై పోరాడుతూనే జనంలో తిరిగేందుకు కూడా సిద్ధపడుతున్నారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే చర్యల్లో భాగంగా నిర్వహించే ఉద్యమాలతో పాటు ఎన్నికల వ్యూహాలను కూడా ఆయన పారలల్ గా సిద్ధం చేస్తున్నారు. జగన్ మొదలు పెట్టిన వైనాట్ 175కి విరుగుడుగా చేపట్టాల్సిన చర్యలు కూడా ఆయన మదిలో మెదులుతున్నాయి. ఎవరెవరినీ ఎక్కడెక్కడ పోటీ చేయించాలో నిర్ణయించడం ఒక వంతయితే… తాను కుప్పంలో పోటీ చేస్తే సరిపోతుందా లేక మరెక్కడైనా కూడా పోటీ చేయాలా అన్నది కూడా చంద్రబాబు ముందున్న సవాలుగా చెప్పుకోవాలి. అందుకే ఆయన ప్లాన్ బీ ని కూడా అమలు చేయబోతోన్నట్లు భావిస్తున్నారు. అది కేసీఆర్ తరహా ప్లాన్ బీ అని కూడా చెబుతున్నారు.
చంద్రబాబును కుప్పంలో ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని వైసీపీ దెబ్బకొట్టింది. అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారు. చిత్తూరు జిల్లా ఇంచార్జీగా పెద్దిరెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక కుప్పం ఇంచార్జీగా భరత్ కూడా జోరుమీదున్నారు.మరోవైపు కుప్పంలో ఓట్లను భారీ సంఖ్యలో పీకేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎక్కడో స్థిరపడి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే జనాలను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఓట్లను తొలగిస్తున్న నియోజకవర్గాల్లో కుప్పం కూడా ఒకటి. ఇవన్నీ టీడీపీకి అనుకూలంగా ఉండే ఓట్లేననే ఆరోపణలున్నాయి. అందుకే టీడీపీకి పడే ఓట్లను తొలగిస్తుండడంతో బాబు ఆలోచనలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండో నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మేలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
చంద్రబాబుకు రాయలసీమలో కుప్పం అచ్చొచ్చిన నియోజకవర్గం. కుప్పం ప్రజలు నిత్యం ఆయనకు అండగానే ఉన్నారు. ఐనా సరే వైసీపీ చేస్తున్న అవకతవకలు మాత్రం అనుమానాలకు తావిస్తున్నాయి. అందుకే అదనంగా కోస్తాలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచన. ఆయన ఆ అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటిస్తే.. ప్రతీ ఒక్కరూ తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని కోరే అవకాశం ఉంది. అందుకే స్వయంగా ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని ముందే ప్రకటించేయాలని అనుకుంటున్నారు. బాపట్ల, అవనిగడ్డ లేదా పెనమలూరు నియోజకవర్గాల్లో ఒక దాని నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. అదీ రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకుంటేనే అలా జరగొచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న అవనిగడ్డ, పెనమలూరు రెండు చోట్ల ఓటర్లు ఇప్పుడు వంద శాతం టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు టీడీపీ చేయించుకున్న తాజా సర్వేలో వెల్లడైంది. చంద్రబాబు ధైర్యం కూడా అదే కావచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…