తీరు మార్చుకున్న వైఎస్ తనయ..

By KTV Telugu On 12 September, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి తీరే విచిత్రంగా ఉంటుంది. ఆమె అందరి మీద విరుచుకుపడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పే కంటే..ఇతరులు ఏం చేయడం లేదో చెప్పేందుకు ఆమెకు 24 గంటలు చాలడం లేదన్న వాదన ఉంది. జగన్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కూడా ఆమె టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అదే పద్ధతిలో గత రెండు నెలలుగా అధికార కూటమి అధినేత చంద్రబాబుపైనా ఆమె విసుర్లు విసురుతున్నారు. అయితే బుడమేరు వరద వచ్చిన తర్వాత మాత్రం ఆమె తీరు మారిందనే చెప్పాలి. సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్లకుండా వరద సహాయ చర్యల్లో పాల్గొనడం చూసిన షర్మిల ఇప్పుడు పరోక్షంగానైనా ఆయన సేవలను ప్రస్తుతిస్తున్నారు. ఇంకా చేయాల్సింది చాలానే ఉందని అంటూనే చంద్రబాబు పనితీరును, ఆయన చొరవను, బాధితుల ఇంటింటికి వెళ్లి ఆయన పలుకరిస్తున్న పద్ధతిని ఆమె ప్రశంసిస్తున్నారు.రాజకీయ అవసరాల కోసం ఆమె పొగుడుతున్నారో, లేక నిజంగానే చంద్రబాబు గొప్పదనాన్ని ఆమె గుర్తించారో తేలీదు కానీ.. మొత్తానికి ఆమె వైపు నుంచి పాజిటివ్ యాటిట్యూడ్ కనిపిస్తోంది. నాయకులే కాకుండా అందరూ సహాయ చర్యల్లో పాల్గొనాలని అంటూ…అంటూ టీడీపీ, ఇటు కాంగ్రెస్ శ్రేణులకు ఆమె సందేశాలిస్తున్నారు. చిట్టచివరి ప్రాంతాలకు సహాయం అందకపోవడంపై కూడా కూడా ఆమె పాజిటివ్ గానే స్పందించారు.కొన్ని సందర్భాల్లో అందరికీ అన్నీ అందవని,ఐనా ప్రభుత్వం బాగానే పనిచేస్తోందన్నట్లుగా ఆమె మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆమె సున్నితంగా హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ప్ర‌జ‌ల బాధ‌లు విన‌ని ప్ర‌భుత్వాలు ఎల్ల‌కాలం మ‌న‌లేవ‌ని, దీనికి వైసీపీపాల‌నే ఉదాహ‌ర‌ణ అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం అందుతున్న సాయం చాలా మందికి చేర‌డం లేద‌ని.. వారంతా ఆక‌లి కేక‌లు పెడుతున్న‌ట్టు త‌మ‌కు తెలిసింద‌ని ష‌ర్మిల చెప్పా రు. అంద‌రినీ ఆదుకునేందుకు మీ అనుభ‌వాన్ని ఉప‌యోగించి.. మీరు సేవ చేయాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు. “మంచి ప‌రిపాల‌కుడిగా మీరు పేరుంది. దానిని నిల‌బెట్టుకోవాల‌ని కోరుతున్నాం” అని అన్నారు. బుడ‌మేరు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు మ‌రింత ప్ర‌య‌త్నించాల‌ని అన్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. జగన్ సోదరే చంద్రబాబును ప్రశంసిస్తున్నారని టీడీపీ వర్గాలు సంబరపడుతున్నాయి. షర్మిలను చూసైనా నేర్చుకోవాలంటూ జగన్ కు కొందరు నేతలు మంచి బుద్ధి చెప్పే ప్రయత్నంలో కూడా ఉన్నారు. పనిలో పనిగా జగన్ పై సెటైర్లు కూడా పేల్చుతున్నారు. షర్మిల మాదిరిగానే జగన్ కూడా హుందాగా ఉంటే రాజకీయ మనుగడ ఉంటుందని కొందరు సలహా ఇస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి