ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్షం విధ్వంసం రాజేస్తోందా? లేక పాలక పక్షమే విపక్షాల గొంతు నొక్కుతోందా? ప్రభుత్వ నిర్బంధాలను తెంచుకునే క్రమంలోనే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయా? రాయలసీమలో చంద్రబాబు నాయుడి పర్యటనలో చోటుచేసుకుంటోన్న ఘటనలకు ఎవరు బాధ్యులు? ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారా? లేక పాలక పక్షం ఆరోపిస్తోన్నట్లు ప్రధాన ప్రతిపక్షమే హింసను రాజేసి ప్రభుత్వం ప్రతిష్ఠను మంటగలపడానికి కుట్ర చేస్తోందా? రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని రాజకీయాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి?.
కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో చాలా చిత్ర విచిత్ర రాజకీయాలు జరుగుతున్నాయి. అవి చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఒక విధంగా అల్లకల్లోలాలు చెలరేగుతున్నట్లు కనపడుతున్నాయి. ప్రజలను ఆశాంతికి గురి చేస్తున్నాయి. తప్పెవరిదో తెలీడం లేదు కానీ ఘర్షణ వాతావరణాలు పదే పదే పునరావృత్తం అవుతున్నాయి. దీనికి కారణం మీరంటే మీరే అంటూ పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. రాజకీయాలు బాగా దిగజారిపోయాయని మేథావులు పెదాలు విరుస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్ది రోజులుగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరిట జిల్లాలు పర్యటిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై పోరాటంగా తన యాత్రకు ఆయన పేరు కూడా పెట్టుకున్నారు. యాత్రకు ముందు సాగు నీటి ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రెజంటేషన్లు ఇస్తూ ఏ ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో స్కూల్ మాస్టర్ లా ఓ బెత్తం పట్టుకుని బోర్డుపై విజువల్స్ చూపిస్తూ వివరిస్తూ పోతున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టుల వద్దకే వెళ్లి తాజా పరిస్థితిని పరిశీలిస్తానని అంటున్నారు చంద్రబాబు.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజక వర్గం అయిన పులివెందులతో పాటు తంబళ్లపల్లె, పుంగనూరు నియోజక వర్గాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ మూడు ప్రాంతాల్లోనూ ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసను రాజేశారని పాలక పక్షం ఆరోపిస్తోంది. అయితే విపక్ష కార్యకర్తలపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలే విచక్షణారహితంగా దాడులు చేశారని టిడిపి ఆరోపిస్తోంది.
తెలుగుదేశం కార్యకర్తలు ఒక పథకం ప్రకారమే పుంగనూరులో హింసను రాజేయాలన్న కుట్రతోనే దాడులకు తెగబడ్డారని పాలక పక్షం ఆరోపణ. అయితే చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకోడానికి వైసీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో వచ్చి అడ్డుకుని విధ్వంసాలకు తెగబడ్డారని టిడిపి అంటోంది. టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి^చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వారిని హింసకు రెచ్చగొట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వైసీపీ నేతలు రెచ్చగొట్టడం వల్లనే టిడిపి కార్య కర్తుల ఆవేశాలకు లోనయ్యారని టిడిపి అంటోంది.
పుంగనూరు నే చంద్రబాబు టార్గెట్ చేసుకోడానికి కారణం ఉందంటున్నారు వైసీపీ నేతలు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అప్రతిష్ఠపాలు చేసి పుంగనూరు లో విధ్వంసాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు స్కెచ్ గీశారని పాలక పక్షం అంటోంది. పుంగనూరులో టిడిపి కార్యకర్తల రాళ్లదాడిలో వైసీపీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడే గొడవలు పెరిగేలా హింసను రాజేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల ఏడాదిలో తన పర్యటనలకు జనాదరణ లేకపోవడం వల్లనే చంద్రబాబు విద్వేషాలు రగులుస్తున్నారని పాలక పక్షం అంటోంటే..వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని సాగనంపడం ఖాయమంటున్నారు టిడిపి నేతలు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…