కుప్పంలో జగన్, చంద్రబాబుల మధ్య తగ్గ పోరు నడుస్తోంది. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టాలనే వ్యూహంతో వైసీపీ ఉంటే ఇకపై తన నియోజకవర్గాన్ని టచ్ చేసే ఛాన్స్ జగన్‌కు ఇవ్వనంటూ సీబీఎన్ తన నియోజకవర్గంలో మకాం వేస్తున్నారు. దాంతో కుప్పంలో హై టెన్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కందుకూరు, గుంటూరు సభల్లో చోటుచేసుకున్న అపశృతిని దృష్టిలో పెట్టుకొని బాబు బహిరంగసభలు రోడ్‌షోలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ జీవో 1 తీసుకొచ్చింది. కుప్పం రోడ్లపై బాబు తిరగకుండా పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయినా తగ్గేదేలే అంటున్నారు టీడీపీ అధినేత. మూడు రోజుల పర్యటన ముగించుకొని తీరుతానంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రోడ్లపై కూడా ఎలాంటి ర్యాలీలు రోడ్ షోలు చేయకూడదు. కానీ చంద్రబాబు అవేవీ పట్టించుకోకుండా రోడ్లపైనే మాట్లాడుతున్నారు. పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. దీంతో నిబంధనలను ఉల్లంఘించినందుకు చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు చంద్రబాబు నామినేషన్ ప్రచారానికి వెళ్లకపోయినా ఆయనకు కుప్పం ప్రజలు పట్టం కట్టేవారు. కానీ ఇప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును కాలు అడుగుపెట్టకుండా చేయాలనే ప్లాన్‌తో వైసీపీ ఉంది. జగన్ ప్రతీ సభలోనూ తమ ప్రజాప్రతినిథులకు పార్టీ నేతలకు వైనాట్ 175. ఈ సారి కుప్పంలోనూ గెలవబోతున్నామనే మాటను పదే పదే చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు జగన్. 2019లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మాత్రమే గెలుపొందారు. గత ఎన్నికల్లో కుప్పంలో బాబు మెజార్టీ తగ్గడం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించడం లాంటి పరిణామాలతో బాబు కోటను కొట్టగలమనే ధీమాతో జగన్ ఉన్నారు. అన్ని నియోజకవర్గాలతో పాటే అభివృద్ధి సంక్షేమాన్ని బాబు గుమ్మంలోనూ పరిగెత్తిస్తున్నారు. కుప్పంను ప్రభుత్వం రెవిన్యూ డివిజన్ గా కూడా మార్చింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా సొంత నియోజకవర్గానికి ఏం చేయలేకపోయారని చెబుతూ తాము చేసిన అభివృద్ధిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే పార్టీ తరపున భరత్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు.
దాంతో అప్రమత్తమైన చంద్రబాబు తన కోటకు బీటలు వారకుండా చూసుకునేందుకు రంగంలోకి దిగారు. గతంలో ఎప్పుడో ఒక్కసారి నియోజకవర్గానికి వెళ్లే ఆయన జగన్ ఎఫెక్ట్‌తో ప్రతీ మూడు నెలలకోసారి పర్యటిస్తున్నారు. ప్రతీ గ్రామంలోకి వెళ్తున్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు. రోడ్ షోలు సభలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. యువత మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు సొంత ఇల్లు కట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అంతకుముందు చూస్తే చంద్రబాబు ఎప్పుడు కుప్పం వెళ్లినా పెద్దగా హడావుడి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడు వెళ్లినా హైటెన్షన్ నెలకొంటోంది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. జగన్ వ్యూహాలకు ధీటుగా బాబు కుప్పంలో నెలకొంటున్న పరిణామాలను తనకు అనుకూలంగామల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బాబు పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు కుప్పంలోకి రాకపోకలు నిలివేశారు. లోపలి వ్యక్తులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాల వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు. చంద్రబాబు అరెస్టు తప్పదన్న ప్రచారం సాగుతోంది.