ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంటోన్న పరిణామాల వెనుక ఆంతర్యం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ గురించి కేంద్ర ప్రభుత్వానికి ముందే తెలుసా? కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో దూకుడు పెంచిందా? చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం జాతీయ మీడియాలో ఎక్కువగా ఫోకస్ కాకూడదన్న వ్యూహంతోనే జీ-20 సదస్సు ఆరంభమయ్యే రోజునే చంద్రబాబును అరెస్ట్ చేశారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడి వంటి నేతను అంత ఈజీగా అరెస్ట్ చేయరని..కేంద్రం కూడా ఓకే అన్న తర్వాతనే సిఐడీ పోలీసులు ధైర్యం చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం రెండేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది. అయితే ఇంత వరకు చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేయలేదు సిఐడి. ఇదే కేసులో కొంతమందిని కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జి.ఎస్.టి. అధికారులే ఈ స్కాంని పట్టుకున్నారు. తర్వాత కేంద్రానికే చెందిన ఈడీ ఇందులోకి దూకింది. చంద్రబాబు నాయుడి పాత్ర గురించి సాక్ష్యాధారాలు ఉన్నా ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఏపీ అధికారులు చురుగ్గా ప్రయత్నాలు చేయలేదు. దానికి కారణం నిందితుడైన చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత కావడంతో పాటు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నాయకుడు కావడంతో ఏపీ ప్రభుత్వం ఆచి తూచి అడుగులు వేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంతో పాటు ఐటీ స్కాంలోనూ చంద్రబాబు నాయుడి పాత్రపై ఆధారాలు ఉన్నాయంటూ ఐటీ అధికారులు చంద్రబాబు నాయుడికి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. నిజానికి ఏడాది క్రితమే చంద్రబాబు నాయుడికి ఐటీ అధికారులు నోటీసులు పంపినా ఆయన సరియైన సమాధానాలు చెప్పకుండా మూడు లేఖలు రాసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల దృష్టికి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం గురించి వివరించినట్లు చెబుతున్నారు. అప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా సమాచారం అందుకున్న అమిత్ షా చట్టం ప్రకారం ముందడుగు వేయండని సూచించినట్లు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అవినీతి విషయంలో ఎవరినీ స్పేర్ చేయద్దని చెప్పడంతోనే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో దూకుడు ప్రదర్శించినట్లు చెబుతున్నారు. అప్పటికే చంద్రబాబు నాయుడి మోడస్ ఆపరాండీపై ఆరా తీసిన అధికారులు డబ్బులు ఎలా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు..ఆయన తనయుడు లోకేష్ లకు అందాయో సాక్ష్యాలతో సహా కోర్టుకు సమర్పించారు. ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లోనూ ఈ సాక్ష్యాలన్నింటినీ పొందు పర్చినట్లు సమాచారం.
చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసిన వెంటనే టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ప్రధాని నరేంద్ర మోదీ..హోంమంత్రి అమిత్ షాలకు ఏపీలో అక్రమ అరెస్టులు జరిగిపోతున్నాయని లేఖ రాశారు. కాకపోతే గల్లాకు తెలియనిది ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ కు కేంద్రంలోని పెద్దల ఆమోదం ఉంది కాబట్టే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లింది. అది కూడా గల్లా ఎవరికి అయితే లేఖలు రాసి మొర పెట్టుకున్నారో ఆ మోదీ అమిత్ షాలే చంద్రబాబు అవినీతికి బ్రేక్ వేయడానికి ఆయన అరెస్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఢిల్లీ వర్గాల భోగట్టా. అయితే తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబుకు ముందస్తు సమాచారం ఉంది. అందుకే అరెస్ట్ కు రెండు రోజుల ముందే ఆయన తనను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తారని అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడిపై మరి కొన్ని కేసులకు సంబంధించి దర్యాప్తులకు పిటీ వారెంట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో చంద్రబాబును విచారించడానికి తమ కస్టడీకి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఏసీబీ కోర్టులో అప్పీలు చేసుకుంది. ఇవి కాక అమరావతి భూకుంభకోణం, ఐటీ స్కాం, కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల స్కాం తో పాటు అసైన్డ్ భూముల కొనుగోలు స్కాం కేసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా విచారణకు అధికారులు ముందుకొచ్చే అవకాశాలున్నాయంటున్నారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…