ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లేని కేసులో చంద్రబాబును ఇరికించి అన్యాయంగా జైలుకు పంపారని టిడిపి ఆరోపిస్తోంది. టిడిపికి జనసేన అధినేత పవన్ తో పాటు ఇతర విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడికి జరిగిన అన్యాయాన్ని యావత్ దేశానికి తెలియ జెప్పాలని నారా లోకేష్ భావించారు. ఆ క్రమంలోనే ఢిల్లీ వెళ్లి జాతీయ ఛానెల్ లో డిబేట్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత జాతీయ మీడియాకు ఏపీలో జరుగుతోన్న వ్యవహారాలను వివరించారు.
చంద్రబాబు నాయుడి అరెస్ట్ తో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు అరెస్ట్ ను కమ్యూనిస్టు పార్టీలతో పాటు బిజెపి కూడా ఖండించింది. ఇదే సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడిపైనే కక్ష రాజకీయాలకు పాల్పడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని టిడిపి నిలదీస్తోంది. చంద్రబాబు నాయుడికి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేయాలని టిడిపి నిర్ణయించింది. అందు కే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టిడిపి ఎంపీలతో సమావేశం నిర్వహించిన లోకేష్ పార్లమెంటులో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశనం చేశారు.
జాతీయ టీవీ ఛానెల్ డిబేట్ లో నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం సిఐడీ పోలీసులు కూడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా సిఐడీ చంద్రబాబుపైకేసు నమోదు చేసి అర్ధరాత్రి దాటాక వెంటాడి వేటాడి తెల్లవారు జామున అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఎఫ్.ఐ.ఆర్. లో చంద్రబాబు నాయుడి పేరు లేకపోయినా చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని అన్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండానే చంద్రబాబును అరెస్ట్ చేసి మరో ఉల్లంఘనకు తెగబడ్డారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్న లోకేష్.. తన తండ్రి ఎలాంటి తప్పూ చేయకపోయినా.. ఆయన సంతకాలు లేకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు.
నారా లోకేష్ ఢిల్లీలో మీడియా సాక్షిగా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రత్యేకించి అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోకేష్ ఆరోపణలను ఢిల్లీలోనే ఖండించాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఏపీ సిఐడీ చీఫ్ సంజయ్ తో పాటు ఈ కేసులో వాదిస్తోన్న ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డిని ఢిల్లీ పంపారు. హస్తినలో కేవలం జాతీయ మీడియాను మాత్రమే పిలిచిన ఏపీ సిఐడీ చీఫ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఎప్పుడు మొదలైంది? షెల్ కంపెనీలు ఎలా పెట్టారు? డబ్బులను ఏ విధంగా చంద్రబాబు నాయుడి ఇంటికి తరలించారు? అన్నది పవర్ పాయింట్ ప్రెజంటేషన్ తో వివరించారు.
నిజానికి స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అన్నది ఏపీలో జరిగిన ఓ అవినీతి కుంభకోణం. అందులో చంద్రబాబు నాయుడి పాత్ర ఉందా లేదా అన్నది న్యాయ విచారణ పూర్తయితే కానీ తెలీదు. దర్యాప్తు సంస్థలు మాత్రం చంద్రబాబే దోషి అంటున్నాయి. ఇందులో చంద్రబాబు అరెస్ట్ తో ఇది టిడిపి-వైసీపీల మధ్య రాజకీయ యుద్ధానికి దారి తీసింది. నిత్యం రెండు పార్టీల నేతలూ ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే అదేదో ఏపీలోనే చేసుకుంటూ ఉంటే బాగుండేదేమో అంటున్నారు విశ్లేషకులు. అనవసరంగా దీన్ని ఢిల్లీకి తీసుకెళ్లడం ద్వారా రెండు పార్టీల ప్రతిష్ఠ బజారు పాలైందని వారంటున్నారు.
ఏపీలో ఇపుడు ఎవరిని కదిపినా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలోనూ దీనిపై చర్చ మొదలైంది. ఒక విధంగా ఇది మరో రచ్చకు దారి తీస్తుందంటున్నారు రాజకీయ పండితులు. అసలులోకేష్ ఢిల్లీకి వెళ్లకుండా ఉంటే బాగుండేదన్నది వారి అభిప్రాయం. అయితే టిడిపి వ్యూమాలు టిడిపికి ఉంటాయంటున్నారు విశ్లేషకులు. మొత్తం మీద ఈ కుంభకోణంలో నిజంగానే వందల కోట్లు లూటీ అయ్యిందా లేదా అన్నది కోర్టులో తేలాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…