ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతుందని నమ్మించడానికి చంద్రబాబు నానా పాట్లు పడుతున్నారు. కానీ ఆయన మాటలు జనం నమ్మడ లేదు. ఆయన సభలు వెలవెలబోతున్నాయి. దాంతో ఆ పార్టీ వ్యూహకర్త రాబిన్‌సింగ్‌కు తన బుర్రకు పదునుపెట్టారు. బాగా ఆలోచించి అయిదంచెల వ్యూహం అమలు చేస్తే కానీ ఫలితం ఉండదని చంద్రబాబుకు సూచించారట. ఆ అయిదంచెల వ్యూహాల్లో మొదటిది కుంభాకార దర్పణ వ్యూహం. గోరంతను కొండంత చూపడమే ఈ వ్యూహంలో దాగి ఉన్న రహస్యం. సభకు వచ్చిన పిడికెడు మందిని పది పన్నెండింతలు చేసి జనం ఎగబడినట్లు ఇసుక వేస్తే రాలనట్లుగా చూపిస్తుంది ఈ దర్పణం. ఈ వ్యూహం ఫలితమే కందుకూరు సభ. డ్రోన్ షాట్ల కోసం ఇరుకు సందులో సభ పెట్టారు. జనం లక్షల సంఖ్యలో వచ్చారని ఎల్లోమీడియాలో ప్రచారం చేసుకున్నారు. కాకపోతే తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది చనిపోయారు. ఆ విధంగా వారి కుంభాకార దర్పణ వ్యూహం సక్సెస్‌ఫుల్‌గా అమలు చేశారు.
ఇక రెండవది పల్లీబఠానీ వ్యూహం. టీడీపీ కొమ్ముకాసే ఎన్‌ఆర్‌ఐలు బిజినెస్ మ్యాన్‌లు చాలామంది ఉన్నారు. వారిని ఈ పల్లీబఠానీ వ్యూహంలో వినియోగించుకున్నారు. ఉయ్యూరు శ్రీనివాస్‌ను అనే ఎన్‌ఆర్‌ఐ చేత పేదలకు పల్లీబఠానీ పంపిణీ కార్యక్రమం అనౌన్స్ చేశారు. పేరు ఆయనది నిర్వహణ అంతా టీడీపీది. చీరె సారెలు ఇస్తామని 30 వేల మందికి టోకెన్లు పంచారు. చంద్రబాబు వచ్చి గంట సేపు జగన్‌ను తిట్టారు. ఈలోగా వారికి కావలసిన ఫోటోలు, డ్రోన్ షాట్లు తీసేసుకున్నారు. చంద్రబాబు వెళ్లిపోగానే రెండువేల మందికి తీసుకొచ్చిన పల్లీ బఠానీలను బిస్కెట్ల మాదిరిగా విసిరేశారు. తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. ఇంకా చంద్రబాబు దగ్గర పదిహేను మంది ఉయ్యురు లాంటి సంఘ సేవకులు పల్లీబఠానీలు పంచడానికి రెడీగా ఉన్నారట. నెలకొకరు చొప్పున ఈ బఠానీలు పంచిపెట్టాలి. ఆ కార్కక్రమాలకు చంద్రబాబు వెళ్లి జగన్‌ను తిట్టాలి. తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే జనం ఎంత పేదరికంలో ఉన్నారో చెప్పాలి. ఇదీ పల్లీబఠానీ వ్యూహం.
ఇక మూడవది కట్ పేస్ట్ వ్యూహం. ప్రపచంలో ఎక్కడెక్కడో ఏదో ఏదో సందర్భంలో లక్షలాదిగా గుమికూడిన జనాల ఫోటోలు తీసుకొచ్చి చంద్రబాబు సభకు వచ్చిన జనం అని చూపించడమే ఈ వ్యూహం. అందుకే కర్ణాకటలోని సిద్దేశ్వర స్వామి అనే మఠాధిపతి అంతిమయాత్రకు లక్షలాదిమంది ప్రజలు తరలివస్తే ఆ ఫోటోలు తీసుకుని చంద్రబాబు కుప్పం సభకు వెల్లువెత్తిన ప్రజలు అని ఎల్లోమీడియాలో ప్రచారం చేసుకున్నారు.
నాలుగవది ఆస్కార్ వ్యూహం. పోలీసులు, వైసీపీ నాయకుల దాడి చేశారని గగ్గోలు పెట్టి వారి దాడిలో గాయపడినట్లు యాక్టింగ్ చేయాలి. వారు ఆసుపత్రిలో మంచాల మీద పడుకుని ఉంటే ప్రధాన పాత్ర పోషించే చంద్రబాబు వెళ్లి వారిని పరామర్శించినట్లు నటించాలి. ఆ వీడియోలు చూసి జనం అయ్యో ఎంత కష్టం వచ్చిందని కన్నీరు పెట్టుకోవాలి. మొన్న కుప్పంలో ఇలాంటి సన్నివేశంలో చంద్రబాబు, ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఆస్కార్ లెవల్ పర్‌ఫామెన్స్ ఇచ్చారు.
అయిదవది తాటిమట్ట వ్యూహం. ఎక్కడ ఏం జరిగినా దానికి కారణం వైసీపీ ప్రభుత్వం అని గగ్గోలు పెట్టాలి. ఎండ కాసినా వాన పడినా చలిపెట్టినా జగనే కారణం అని అడ్డంగా వాదించాలి. కందుకూరు గుంటూరు తొక్కిసలాటకు వైసీపీనే కారణం అని వాదించడం ఈ వ్యూహంలో భాగమే. అది నాలుకా తాటిమట్టా అని జనం ఉమ్మెసినా ఫరావలేదు. గుడ్డ కాల్చి వైసీపీ వారి మొఖాల మీద పారేయడమే ఈ వ్యూహంలో ప్రధాన అంశం అన్నమాట. ఇలాటి అయిదంచెల వ్యూహాలను ముందు ముందు మరింత ఘోరంగా ప్రయోగించి జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం.