ఇటీవల ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు నేతలను కలిసి ఏపీ అభివృద్ధిపై చర్చించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉండటంతో.. ఏపీ అభివృద్ధి కోసం వీలైనంత మేర సహకారం సాధించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. . ఈ క్రమంలోనే ఏపీకి లక్ష కోట్లు ఆర్థిక సహాయాన్ని కోరినట్లు తెలిసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన చంద్రబాబు.. అమరావతి రాజధాని నిర్మాణం సహా ఇతర ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ మేరకు కేటాయింపులు చేయాలని కోరినట్లు సమాచారం. చంద్రబాబు ప్రతిపాదనల పట్ల మోదీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానూ చంద్రబాబు ఈ విషయం మీద చర్చించినట్లు సమాచారం.
ఆర్థిక లోటును భర్తీ చేయడానికి రూ.7000 కోట్లు, నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.50000 కోట్లు కేటాయించాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది. ఇందులో 15 వేల కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించాలని ఏపీ సీఎం కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వేల కోట్లను కేటాయించాలని కోరినట్లు తెలిసింది. భవిష్యత్తులోనూ ఈ ప్రాజెక్టుకు మరింత సహకారం అందించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అలాగే అప్పులను తీర్చేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.15000 కోట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం యాభై సంవత్సరాల రుణ పథకం కింద మౌలిక వసతుల అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరినట్లు సమాచారం.
ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలక పాత్ర వహించడంతో ఆయన అడిగిన సాయం పై మోదీ ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…