రాజకీయాలు కుటుంబాలను కలుపుతాయి. ఎంత కొట్టుకున్నా… బయట మంచిగా ఉంటాయి.. బయట కొట్టుకున్నా చివరకు దగ్గరకు చేర్చుతాయి. గత వైరాన్ని గాలికి వదిలేసి..వియ్యాలు అందుకుంటారు. పెళ్లిళ్లకు కూడా పిలుస్తారు.. ఇప్పుడు చంద్రబాబు, షర్మిల కుటుంబాలకు అదే రూలు వర్తిస్తోంది. గత వారం రోజులుగా పరిణామాలు చూస్తే ఇదీ మర్యాద కొద్దీ వస్తున్న పిలుపులా లేక భవిష్యత్తు రాజకీయ చిత్రం కళ్లకు కనిపిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి..
చంద్రబాబు వర్సెస్ వైఎస్.. ఇదీ లవ్ హేట్ రిలేషన్ షిప్.. అసెంబ్లీలో చంద్రబాబును ఇక చాల్లే కూర్చోమని వైఎస్ కటువుగా చెప్పినట్లు అనిపించినా… వారి మధ్య కాంగ్రెస్ పార్టీలో అంతకముందటి స్నేహం చూస్తే మాత్రం కేవలం చిన్నపాటి రాజకీయ వైరం మాత్రమే ఉండేదని చెప్పొచ్చు. ఎంత స్వర్ణాంధ్ర రథ సారథి అని చంద్రబాబును జనం పొగిడినా.. ఆయన్ను దించింది మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరిష్మానేనని చెప్పక తప్పదు. అయితే చంద్రబాబు, వైఎస్ మధ్య రాజకీయ వైరమే గాని కక్షసాధింపు ఎన్నడూ లేదు. జగన్ సీఎం అయిన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. చంద్రబాబుపై ఆయనకున్న కక్ష భవనాల కూల్చివేత నుంచి జైలుకు పంపడం వరకు సమకాలీన రాజకీయాల్లో కళ్లకు కనిపిస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు సైడ్ ట్రాక్ మరోకటి నడుస్తోంది. అదే చంద్రబాబు ఫ్యామిలీతో షర్మిలారెడ్డి కుటుంబం స్నేహం..
షర్మిల కుటుంబం, చంద్రబాబు కుటుంబం దగ్గరవుతున్నట్లుగా తాజా పరిణామాలు చెబుతూనే ఉన్నాయి.షర్మిలా రెడ్డి తనయుడు రాజారెడ్డి పెళ్లికి తొలి ఆహ్వానపత్రం చంద్రబాబుకే అందిందని ఇరు పార్టీల వర్గాలు వెల్లడించాయి. అంతకముందు చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్స్ పంపితే… వాళ్లు కూడా స్నేహ హస్తాన్ని అందించారు..
షర్మిల రెండు సార్లు పాదయాత్రలు చేశారు. ఒక సారి అన్న జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున కాలికి బలపం కట్టుకుని నడిచారు. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఏకబిగిన అన్ని అవరోధాలను అధిగమిస్తూ ఆమె 3 వేల 500 కిలోమీటర్లు నడిచారు.ఆమె సొంత పార్టీ పెట్టిన సందర్భంగా ఏదో చేస్తారనుకుంటే చివరకు కాంగ్రెస్ లో విలీనానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఏ రేవంతుడు అడ్డుపడ్డాడో కానీ ఆమెకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యత్వమిచ్చే మాట కూడా పక్కకు వెళ్లిపోయింది. తాజాగా మరో వార్త తెరమీదకు వచ్చింది. ఆమెను కాంగ్రెస్లో చేర్చుకుని ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షురాలిగా చేస్తారని కొన్ని పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ లోపు సైడ్ ట్రాక్ గా చంద్రబాబు, షర్మిల కుటుంబాల స్నేహంపై ఫోకస్ పెరిగింది. గతంలో కూడా ఆ రెండు కుటుంబాల అప్పుడప్పుడు స్నేహ వాక్యాలు వల్లించుకుంటూనే ఉన్నాయి. చంద్రబాబు అరెస్టును షర్మిల కుటుంబం ముఖ్యంగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఖండించారు. చంద్రబాబు కోసం ఏసు ప్రభువును ప్రార్థిస్తున్నానని బ్రదర్ అనిల్ చెప్పుకున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని కూడా అనిల్ తనదైన జోస్యం చెప్పారు. అంతకముందు షర్మిల స్వయంగా లోకేష్ కు, భువనేశ్వరికి షర్మిల ఫోన్ చేసి పరామర్శించారు. ఇప్పుడు క్రిస్మస్ పండగుకు షర్మిల బహుమతులను చంద్రబాబు ఫ్యామిలీకి పంపారు. దానిపై ప్రత్యేకంగా షర్మిల గారు అని పేరు కూడా రాసి ఉంది.ఆ బహమతులు లోకేష్ కు ఉద్దేశించినవిగా చెప్పుకున్నారు. అంటే లోకేష్ ను భవిష్యత్తు నాయకుడిగా షర్మిల గుర్తించారనుకోవాలి. దానితో స్పందించిన చంద్రబాబు కుటుంబం కూడా షర్మిల పిల్లలకు బహుమతులు పంపారు. ఈ లోపే అమెరికాలో చదువుకున్న షర్మిల కుమారుడు రాజారెడ్డి, అక్కడ స్థిరపడిన కమ్మ సామాజికవర్గం కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రియను ప్రేమించాడని జనవరి 17న పెళ్లి జరుగుతుందని తెలిసింది. దానికి సంబంధించిన తొట్ట తొలి ఇన్వినేషన్ చంద్రబాబుకే అందింది. ఇదీ కుటుంబ స్నేహానికి చిహ్నమని రెండు పార్టీలు చెప్పుకుంటుండగా, రాజకీయాలకు కూడా దాన్ని ముడిపెడుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో పరోక్ష స్నేహం ఉన్న టీడీపీ.. త్వరలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదన్న నమ్మకం ఏమిటన్నది పెద్ద ప్రశ్న..అందుకే కుటుంబ స్నేహం ద్వారా భవిష్యత్తు రాజకీయానికి బీజం పడిందని కూడా కొందరు చెప్పుకుంటున్నారు…
అందరికీ మేనమామనని చెప్పుకునే ఏపీ సీఎం జగన్ కు షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి శుభలేఖ అందిందో లేదో తెలియదు. ఆయనకు అందకపోతే మాత్రం జగన్, షర్మిల తెగదెంపులు ఖాయమైనట్లేనని చెప్పుకోవాలి. ఆ దిశగానే షర్మిల కుటుంబం చంద్రబాబుతో స్నేహాన్ని కోరుకుంటుందనుకోవాలి. రాజకీయంగా నిలదొక్కుకునేందుకు కూడా షర్మిల.. టీడీపీకి స్నేహహస్తం అందిస్తున్నారనుకోవాలి. ఏదైనా పిక్చర్ ఫుల్ క్లారిటీ రావాలంటే మరో నెలరోజులైనా ఆగక తప్పదు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…