చంద్రబాబునాయుడు టిఫినేం చేస్తారో మధ్యాహ్నం ఏం తింటారో రాత్రికి ఏం తీసుకుంటారోగానీ 24గంటలూ రాజకీయాన్ని మాత్రం బాగా ఆరగిస్తారు ఈజీగా అరిగించుకుంటారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. పొరపాటున కొడుక్కి కొద్దిగా కూడా అబ్బలేదుగానీ ఏడుపదుల వసులోనూ చంద్రబాబు పావులు కదుపుతూనే ఉన్నారు. పాచికలు విసురుతూనే ఉంటారు. ఒకప్పుడు బీజేపీ ఒళ్లో కూర్చున్నా ఎన్నికలముందు దూరం జరిగి అదే బీజేపీ ప్రభుత్వంపై ఆత్మగౌరవ పోరాటాలు చేసినా అది చంద్రబాబుకే చెల్లింది. 2024 ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య. ఈసారి కూడా మిస్ అయిందంటే 2029కి తన మార్క్ రాజకీయం చేసేందుకు ఆయనకు వయసు సహకరించకపోవచ్చు. అప్పటికి ఏదీ మన చేతుల్లో లేకుండా పోవచ్చు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్‌గా ఏ అస్త్రాన్నీ వదులుకోవడం లేదు టీడీపీ అధినేత. సింగిల్‌గా ఫైట్ చేయలేకపోతే తోడొచ్చేవారిని కలుపుకుని పోవాలనుకుంటున్నారు.
తటపటాయించేవారికి నయానోభయానో నచ్చజెప్పి ఈసారి వైసీపీని ఓడించడం చారిత్రక అవసరం అనుకుంటున్నారు. కొడుకు కాళ్లీడ్చుకుంటూ కిందామీదా పడి పాదయాత్ర చేస్తుంటే సైకిల్‌పార్టీకి హైప్ పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. జనసేన-బీజేపీ బంధం బలపడితే ఏపీలో ప్రత్యామ్నాయశక్తిగా మారతాయని చంద్రబాబు భయపడ్డారు. మొత్తానికి ఎలాగైతేనేం పవన్‌కళ్యాణ్ చూపుని తనవైపు తిప్పుకోగలిగారు. బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోకుండానే టీడీపీవైపు చూస్తున్నారు జనసేనాని. బీజేపీ కూడా కలిసొచ్చేలా పవన్‌కళ్యాణ్‌తో ఒత్తిడి పెంచాలన్నది చంద్రబాబు వ్యూహం. కానీ వైసీపీ-టీడీపీలను సమదృష్టితో చూడాలన్న పాలసీతో ఉంది కమలం పార్టీ. అందుకే బీజేపీపై మరోలా ఒత్తిడిపెంచుతున్నారు చంద్రబాబు. నాయకత్వం జారిపోయేలా చేసి బీజేపీ వచ్చి చేతులు కలపకతప్పని అనివార్యపరిస్థితిని సృష్టించాలన్నది ఆయన ఆలోచన కాబోలు.
కాపుల వ్యవహారం ఏపీ పాలిటిక్స్‌ని హీట్ పుట్టిస్తున్న టైంలో కన్నా లక్ష్మినారాయణ బీజేపీని వీడి టీడీపీ గూటికి చేరారు. విశాఖనుంచి విష్ణుకుమార్‌రాజు పేరు కూడా వినిపిస్తోంది. ఇక మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా త్వరలో మళ్లీ టీడీపీలోకి తిరిగిరావచ్చంటున్నారు. కడప జిల్లాకు చెందిన దేవగుడి ఆదినారాయణరెడ్డి కూడా బహుశా అదే నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే కైకలూరు టీడీపీ నేత వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో కామినేనికి సీటు రెడీగా ఉన్నట్లే. ముఖ్యనేతల చేరికల్ని ప్రోత్సహించి బీజేపీని బలహీనపరిస్తే జనసేన కూడా దిక్కులుచూడదన్న ప్లాన్‌తో ఉన్నట్లుంది చంద్రబాబు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. కన్నా లక్ష్మినారాయణ లాంటి ముదుర్లను తట్టుకోవడం అంతీజీ కాదు. పార్టీలో చేరిన మొదటిరోజే ఓ ఛానల్‌లో కన్నా కడుపులో ఉంది కక్కేశారు. జనసేనతో పొత్తు లేకపోతే అధికారంలోకి వచ్చే ఛాన్సేలేదని చెప్పేశారు. ఆయన టీడీపీలోకి వచ్చిందే ఆ పొత్తు ఉంటుందన్న నమ్మకంతో. గతంలో కమ్యూనిస్టులు ఒకటీ అరా సీట్లిచ్చినా సర్దుకుపోయేవాళ్లు. పవన్‌కళ్యాణ్‌కో క్లారిటీ ఉంది. కనీసం మూడోవంతు సీట్లు అడుగుతారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ కూడా పెరగొచ్చు. చంద్రబాబుకు కొత్త సవాళ్లు తప్పకపోవచ్చు. అందుకే అంటారు ఇల్లలకగానే పండగకాదని.