ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఎప్పుడేం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆత్మగౌరవ పోరాటం పేరుతో దుమ్మెత్తిపోసినా భవిష్యత్ అవసరాలకోసం పొగడ్తలతో ముంచెత్తినా చంద్రబాబుని మించిన రాజకీయ నాయకుడు లేరు. ఒకప్పుడు బీజేపీతో టీడీపీకి బలమైన బంధం ఉండేది. వాజ్‌పేయి హయాంనుంచీ ఉన్న ఫ్రెండ్‌షిప్ మోడీదాకా బలంగానే ఉంది. ఐదేళ్లక్రితం మాట తేడా వచ్చింది. మనసులో లెక్కమారింది. అందుకే బీజేపీకి తనంతట తానుగానే టీడీపీ దూరమైంది. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీచేయడం వల్లే వైసీపీ లాభపడిందన్నది చంద్రబాబు ఆలోచన. ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించాలని పంతంపట్టిన చంద్రబాబు ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌ని దువ్వారు. కానీ బీజేపీ కూడా కలిసిరాకపోతే జనసేనతో బంధం బలపడేలా లేదు. అందుకే ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో పడ్డారు.
మోడీ పాలన అద్భుతం అంటున్నారు చంద్రబాబు. ఇదే నోటితో ఆయన్ని చెడామడా తిట్టేసినా అది గతం అంటున్నారు. అవన్నీ మరిచిపోదామంటున్నారు. దేశాభివృద్ధికి జాతి అభ్యున్నతికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చంద్రబాబు కితాబు ఇస్తున్నారు. ప్రధాని ప్రతిపాదిస్తున్న విజన్-2047తో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు అందరి ముందూ ప్రకటించారు. మోడీ నిర్ణయాలతోనే భారత్ శక్తిని ప్రపంచం గుర్తించిందని ప్రధానిని చంద్రబాబు ఆకాశానికెత్తేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో ముడిపడ్డ ప్రత్యేక హోదా వంటి అంశాలపైనే కేంద్రంతో విభేదించామని కానీ వారి విధానాలను ఎప్పుడూ తప్పుపట్టలేదని తీరిగ్గా లెంపలేసుకుంటున్నారు విపక్షపార్టీ అధినేత. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సెమినార్‌లో చంద్రబాబు స్పందన చూసి ఊసరవెల్లి కూడా ఔరా అని ఆశ్చర్యపోతోంది.
మీరు మళ్లీ బీజేపీతో చేతులు కలపబోతున్నారా అన్న ప్రశ్నకు ఊహాజనిత ప్రశ్నలకు ఇది వేదికకాదంటూనే మోడీ సర్కారుపై ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు. దేశాభివృద్ధికి ప్రధాని స్పష్టమైన ఆలోచనా విధానంలో వెళుతున్నప్పుడు తోడుగా ఉండటం తన బాధ్యతన్నారు. ప్రపంచంలో భారత్‌ని నెంబర్ వన్‌గా నిలబెట్టాలన్న ప్రధాని దూరదృష్టిని సమర్ధించారు. ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాలపై విపక్ష పార్టీల విమర్శలకు మీ అభిప్రాయాలకు పొంతన లేదన్న ప్రశ్నకు రాజకీయాలు వేరు దేశ ప్రయోజనాలు వేరంటూ తెలివిగా సమాధానం ఇచ్చారు చంద్రబాబు. వాజ్‌పేయి హయాంలో ఏడెనిమిది మంత్రి పదవులు ఇస్తానంటేనే వద్దన్నానని అభివృద్ధికోసం కలిసి పనిచేయడానికి సిద్ధమని బీజేపీకి ప్రేమసందేశం పంపించారు.
బీజేపీతో కలిసి ఉంటే కొంప కొల్లేరయ్యేలా ఉందని ఎన్నికల ముందు చంద్రబాబు భయపడ్డారు. కేంద్రాన్ని మోడీని తిడితేనే జనం మద్దతు దొరుకుతుందని లెక్కలేసుకున్నారు. అందుకే ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఎన్డీయే ప్రభుత్వంనుంచి బయటికొచ్చి ధర్మపోరాట దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రచారం చేసుకున్నారు. కానీ ఎన్నిచేసినా 2019లో టీడీపీని ప్రజలు విశ్వసించలేదు. ఒక్కఛాన్స్ అంటూ ముందుకొచ్చిన వైఎస్ జగన్‌పైనే విశ్వాసం కనబరిచారు. దీంతో మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీని దూరంగా పెట్టి జనసేనతో పొత్తు పెట్టుకోవడం జరిగేలా లేదు. అందుకే తనవైపునుంచి బీజేపీకి కన్నుగీటుతూనే పవన్‌కళ్యాణ్ వైపునుంచి కూడా ఒత్తిడి పెంచాలన్న వ్యూహంతో చంద్రబాబు ఉన్నారు. కానీ టీడీపీతో కలిసే ప్రసక్తేలేదని ఇప్పటికే బీజేపీ నేతలు చెప్పేశారు. పొగడ్తలతో ముంచేస్తున్నాడని మనసు మార్చుకుంటారా లేకపోతే దూరంగా ఉండాలన్న స్టాండ్‌మీదే ఉంటారా అన్నది కాలమే నిర్ణయించబోతోంది.