చంద్రబాబు ఎమోషన్‌..పార్టీకొస్తుందా ప్రమోషన్‌

By KTV Telugu On 3 December, 2022
image

ఆ రోజులు మున్ముందిక రావేమిరా..ఏవిటో జీవితం!
అదే చెప్పుడు.. అదే కొట్టుడు.. వాటీజ్‌ దిస్ బాబూ!

సూటిగా సుత్తిలేకుండా ఏ నాయకుడి విషయంలోనైనా జనం కోరుకునేది ఇదే. సాగదీసీదీసీ చెవులుమూసి చావగొట్టేస్తే ఓపిగ్గా వింటూ కూర్చునే రోజులు పోయాయి. మన హయాంలో చేసిన ఘనకార్యాలు ఏకరువు పెట్టడం శుద్ధదండగ. నిజంగానే అన్ని గొప్పపనులు చేసి జనరంజక పాలన అందించి ఉంటే ఎందుకు ఓడిస్తారని ప్రశ్నించుకుంటే మనకో సమాధానం దొరుకుతుంది. సెల్‌ఫోన్‌ నేనే కనిపెట్టా తమ్ముడూ అంటే పిట్టలదొరని చూసినట్లే చూస్తారు. ఆ రోజుల్లో నేను అనుకుంటే అడుగుముందుకు వేసేవాళ్లా అని ప్రశ్నిస్తే ఏం ఆపని చేతగాలేదా అని చిలిపి ప్రశ్నలు వేస్తారు. సో ఎంతకావాలో అంత మాట్లాడమే ఈ వయసులో గౌరవంగా ఉంటుంది.

గుప్పిట్లో ఇమిడిపోయే ప్రపంచంలో బతుకుతున్నాం. ఎవరో ఒకరు చొరవచూపిస్తేనే సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందింది. అదేదో మన ఘనతని చెప్పుకుంటే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు. చంద్రబాబు ఈ విషయంలో ఇంకా నేలవిడిచి సాము చేస్తూనే ఉన్నారు. హైటెక్‌ సిటీ నేనే కట్టానంటారు. మరి తెలంగాణలో పార్టీకి అడ్రస్ లేదెందుకు? తన పాలనలో 30 లక్షలమందికి ఉద్యోగాలిచ్చానని చంద్రబాబు చెబుతుంటే అందరూ మొహాలు చూసుకుంటున్నారు. అధికారపార్టీ వాళ్లకి ట్రోల్‌ అవుతున్నారు.

ఇవే చివరి ఎన్నికలని ఆయన అన్నమాట భావోద్వేగాన్ని రగిలించలేదు సరికాదా కామెడీగా మారిపోయింది. పాపం వయసైపోయింది, 2023తర్వాత కూర్చుంటే లేవలేనని ఆయనగారికి అర్ధమైపోయిందని ట్రోలు తీస్తున్నారు కొంతమంది. తాడేపల్లిగూడెం టూర్‌లో గుంతలరోడ్ల గురించి ఎత్తిపొడిచే ప్రయత్నంలో జగన్‌ ‘ఉయ్యాల బాట’ పథకం తెచ్చినా తెస్తాడని చంద్రబాబు సెటైరేశారు. అక్కడితో ఆగినా బాగుడేంది. ఈ రోడ్లమీద తిరగలేక నడుంనొప్పి వస్తోంది, నాలుగురోజులు పోతే ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందనేశారు. ఈ వయసులో మోకాళ్ల నొప్పులు, నడుంనొప్పులు కాకుండా మరేం వస్తాయని రివర్స్‌ కౌంటర్లు పడుతున్నాయి. కృష్ణారామా అనుకోవాల్సిన వయసులోనూ జోష్‌ తగ్గలేదని తెగ తిరిగేస్తున్నారు చంద్రబాబు. కానీ ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అర్ధంకాక కొన్నిసార్లు కామెడీ అయిపోతున్నారు.