ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వ్యూహంపై చంద్రబాబు ఎంత త్వరగా నిర్ణయం ప్రకటిస్తే అంత మంచిదని టీడీపీ శ్రేణుల ఎదురు చూస్తున్నాయి. ప్రచారానికి ఉపకరిస్తుందని భావిస్తున్నాయి. చంద్రబాబు మాత్రం మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల నుంచి వచ్చే స్పందనను చూసిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నారు. మోదీ విశాఖ టూర్ తర్వాత చాప కింద నీరులా సంభవిస్తున్న పరిణామాలు చూస్తే మాత్రం టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్న అభిప్రాయం కలుగుతోంది. ఒకరిద్దరు టీడీపీ నేతలతో కూడా బాబు ఇలాంటి ప్రస్తావన చేసినట్లు చెబుతున్నారు.
విశాఖలో పవన్ కల్యాణ్ ను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పుడు హోటల్ రూమ్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నప్పుడూ చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు విజయవాడలో బస చేసిన పవన్ కల్యాణ్ ను స్వయంగా వెళ్లి పలుకరించి క్షేమ సమాచారాలు విచారించారు. నిజానికి ఒక పార్టీ నేత చిన్న పార్టీ నాయకుడి దగ్గరకు వెళ్లి పలుకరించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఉమ్మడి శత్రువు వైసీపీ తీరును ఎండగట్టే క్రమంగా చంద్రబాబు ఒక స్టెప్ కిందకు వచ్చారని కూడా తెలుస్తోంది. అప్పుడు లాంఛనంగా కాసేపు జరిగిన చర్చలో పొత్తులు, సీట్ల సర్దుబాటు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది.
విశాఖ వచ్చిన మోదీ జనసేనానిని పిలిపించుకుని మాట్లాడినప్పుడు జరిగినదేమిటో చాలా కాలం గోప్యంగా ఉంచినప్పటికీ ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు బయట పడుతున్నాయి. ఏపీలో జనసేన బలం పెరిగిందని మోదీ విశ్లేషించినట్లు సమాచారం. పవన్ కు సీఎం అయ్యే ఛాన్సుందని అలాంటప్పుడు చంద్రబాబుతో చేతులు కలపడం ఎందుకని మోదీ ప్రశ్నించడంతో జనసేనాని పునరాలోచనలో పడ్డారట పైగా తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని మోదీ ప్రశ్నించారట. ఇంకేముంది తనకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చిందని తెగ సంబరపడిపోయిన జనసేనాని ఇప్పుడు టీడీపీతో ఎందుకులే అన్నట్లుగా మాట్లాడుతున్న విషయాలు చంద్రబాబు చెవికి చేరాయి. అంతే జనసేనానితో మనకెందుకులో అన్నట్లుగా చంద్రబాబు తీరు కూడా మారిపోయింది.
తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ను గద్దె దించాలని బీజేపీ డిసైడైంది. అదే క్రమంలో కాంగ్రెస్ ను పూర్తిగా భూస్థాపితం చేయాలని వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకునే అంశంపై సీరియస్ గా దృష్టి పెట్టింది. 40 నియోజకవర్గాల్లో తమకు ఐదు వేల వరకు ఓట్లున్నాయని గతంలో పవన్ స్టేట్ మెంట్ పై బీజేపీ లెక్కలేసుకుంటోంది. జనసేనకు 20 నుంచి 30 సీట్లు కేటాయించి పొత్తులో కలుపుకుంటే తప్పేముందన్న చర్చ బీజేపీ వర్గాల్లో కనిపిస్తోంది. పైగా చంద్రబాబు కూడా తెలంగాణలో మళ్లీ టీడీపీని డెవలప్ చేయాలని నిర్ణయించుకున్న తరుణంలో ఆ పార్టీకి కూడా ఝలక్ ఇచ్చినట్లవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీని ఎదగనవ్వకూడదని, ఏపీలో దెబ్బకొట్టాలని అనుకుంటూ ద్విముఖ వ్యూహం పాటిస్తోంది.
బీజేపీ వ్యూహాలు, కమలం పార్టీ ట్రాప్ లో జనసేనాని పడిపోయిన వైనాన్ని చూసిన తర్వాత చంద్రబాబు తన వంతు పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఒంటరి పోరుకు సైతం రెడీగా ఉండాలని కొందరు కీలక నేతల వద్ద ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సంగతి పార్టీ శ్రేణులకు పొక్కి పోవడంతో వాళ్లు కూడా హ్యాపీగా ఉన్నారట. పొత్తు పేరుతో జనసేన అనే అదనపు లగేజీని మోయడం కంటే గెలిచినా, ఓడినా ఒంటరిగా బరిలోకి దిగడమే మంచిదని టీడీపీ క్షేత్రస్థాయి నేతలు భావిస్తున్నారు. ఏదైనా జనవరిలో ప్రారంభమయ్యే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో వచే ప్రజాస్పందనపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.