చంద్రబాబు యూటర్న్ రాజకీయం
ఇదే తనకు చివరి ఎన్నిక అన్నారు.
కాదు రాష్ట్రానికే చివరి ఎన్నికని మడతేశారు.
ఇప్పుడేమో అదంతా తూచ్ అంటున్నారు.
రాష్ట్రానికి తన అవసరం ఉందంటున్నారు.
ఇదేం ఖర్మ…కేడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారా.
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మళ్లీ గతంలో చేసిన తప్పులనే చేస్తున్నారా? ప్రస్తుతం ఆయన జిల్లా పర్యటనల్లో చేస్తున్న వ్యాఖ్యలను ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఆయన మాటల్లో నిలకడ లోపిస్తోంది. స్పష్టత కరువవుతోంది. కేడర్‌ను గందరగోళానికి గురయ్యే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఎందుకని. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో అనేకమార్లు నాలుక మడత వేశారు బాబు. ప్రత్యేకహోదా సంజీవని అని ఓ సారి, హోదాతోనే అంతా జరిగిపోతుందా అని, ప్యాకేజీ కావాలని మరోసారి…ఇలా రకరకాలుగా టంగ్ స్లిప్ కావడంతో వైసీపీ దాన్ని తమకు అనుకూలంగా మల్చుకుంది. గతంలో హోదా విషయంలో యూటర్న్ తీసుకున్న మాదిరే…ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ అంటూ చేస్తున్న ప్రచారం కూడా అదే తరహాలో కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు ప్రజలను కోరుతున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఎంచుకుంటున్న నినాదాల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఈ ఎన్నికల్లో గెలిస్తే సరే లేకుంటే ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. దీని పైన వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. రాజకీయంగా చర్చ సాగింది. దీంతో దెందులూరులో ఇవి తనకు చివరి ఎన్నికలు కాదని రాష్ట్రానికే చివరి ఎన్నికలని చెప్పుకొచ్చారు. ఇక నిడుదవోలు సభలో మరో నినాదం తీసుకొచ్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలని కొంతమంది సైకోలు అంటున్నారని వాళ్లందరినీ భూ స్థాపితం చేసే వరకూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే వరకూ తాను ఉంటానని చెప్పుకొచ్చారు. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటే ప్రజలు ఓటేస్తారేమోనని అనుకున్నారో ఏమో గానీ అది మొదటికే మోసం తెస్తుండడంతో యూటర్న్ తీసుకున్నారు. ఇదే ఛాన్స్ అన్నట్టుగా వైసీపీ ఓ ఆటాడుకుంటోంది.
బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది టీడీపీ. ప్రజాసమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. తాను ముందుండి కేడర్‌ను నడిపిస్తున్నారు చంద్రబాబు. పెద్దాయన నాయకత్వంపైనే టీడీపీ మొత్తంగా ఆధారపడింది. టీడీపీకి ఓటు వేయాలంటే అది చంద్రబాబును చూసి మాత్రమే పడుతుంది. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని బాబు భావిస్తున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ప్రభుత్వంపై పోరాటంలో బాబు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇదేం ఖర్మ, ఇదే లాస్ట్ ఛాన్స్ నినాదాలు పార్టీకి మేలు కంటే చెడునే ఎక్కువగా చేస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు బాబు తనపై గతంలో జరిగిన దాడి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రానికి తన అవసరం ఉన్నందునే వేంకటేశ్వరస్వామి తనను కాపాడారనే సెంటిమెంట్ జోడిస్తున్నారు. ఏపీ అంటే చంద్రబాబు అనేలా బ్రాండింగ్ చేసుకుంటున్నారు. తన అవసరం రాష్ట్రానికి ఉందంటూ చెప్పే క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారుతున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి.