జన్మభూమి కమిటీల ఊసెత్తని చంద్రబాబు – chandrababu naidu

By KTV Telugu On 6 April, 2024
image

KTV TELUGU :-

వాలంటీర్ వ్యవస్థ ఉండడానికి వీల్లేదన్నారు చంద్రబాబు. తన హయాంలో జన్మభూమి కమిటీలు అద్భుతంగా పనిచేశాయన్నారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఇంట్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎన్నికల నగారా మోగి ప్రజలంతా వాలంటీర్లకు బ్రహ్మరథం పడుతోంటే చంద్రబాబు  డైలాగ్ మార్చేశారు. వాలంటీర్ల వ్యవస్థను అలానే కొనసాగిస్తామంటున్నారు.  అంతే కాదు వారి జీతాలు 50 వేల వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరి తన జన్మభూమి కమిటీలనే తెస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు? వాలంటీర్లు చేసే సేవలనే  జన్మభూమి కమిటీలతో అందిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాచ్ దిస్ స్టోరీ.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  జన్మభూమి కమిటీలని కొన్ని గుంపులను పెట్టారు చంద్రబాబు నాయుడు. జన్మభూమి కమిటీలలో ఉండే వారంతా టిడిపి నాయకులే. ఏ గ్రామంలో అయినా..ఎవ్వరికైనా ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా అర్హతలు ఉంటే సరిపోదు. జన్మభూమి కమిటీల సిఫారసు ఉండాల్సిందే. జన్మభూమి కమిటి  ఇమ్మంటే అధికారులు పథకాలు ఇచ్చేవారు. ఫలానా వారికి వద్దు అంటే ఆపేసేవారు. రేషన్ కార్డు నుండి మరుగుదొడ్ల మంజూరుకూ జన్మభూమి కమిటీల మాటే వేద వాక్కు. జన్మభూమి కమిటీలు తన మానసపుత్రికలని అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని చంద్రబాబు పదే పదే చెప్పుకున్నారు.

సరే అది గతం.2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ పరాజయంలో జన్మభూమి కమిటీల వాటా చాలా పెద్దదే అని టిడిపి సీనియర్లే మండిపడ్డారు అప్పట్లో. అయితే చంద్రబాబు మాత్రం కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు జన్మభూమి కమిటీలను వెనకేసుకొచ్చారు. పైకి అనలేకపోయినా.. జన్మభూమి కమిటీలో చేతి వాటతనం..వారి దోపిడీలే  టిడిపికి ప్రజలను దూరం చేశాయని  చంద్రబాబు నాయుడికీ తెలుసు. అయితే ఆ కమిటీలు తనవే కాబట్టి ఆయన మౌనంగా ఉండిపోవలసి వచ్చింది. ఎక్కడ ఏ లోపం జరిగిందో ఆయన ఆత్మపరిశీలన చేసుకున్నారు.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మందికి పైగా వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ వ్యవస్థ రావడంతోనే గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాకారం అయ్యిందని పెద్దలు సంతోషించారు.పరిపాలన ప్రజల ఇళ్లకు చేర్చడంలో  వాలంటీర్లదే కీలక పాత్ర.ప్రతీ పథకాన్ని ఇంటింటికీ అందిస్తున్నారు వాలంటీర్లు. ఇళ్లల్లో అర్హతలు ఉండి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోని వారిని కూడా వాలంటీర్లే గుర్తించి వారి చేత దరఖాస్తులు చేయించి వాటిని వారికి మంజూరయ్యేదాకా తిరిగి  సేవలు అందిస్తున్నారు. అందుకే వాలంటీర్లు అనతి కాలంలోనే  ప్రజలకు ఆత్మబంధువులు అయిపోయారు.

అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులకు నెలలో మొదటి తారీఖునే  కోడి  కూయక ముందే పింఛన్లు తీసుకెళ్లి పువ్వుల్లో పెట్టి అందిస్తున్నారు వాలంటీర్లు. అందుకే చాలా మంది అవ్వాతాతలు వాలంటీర్లను మనవల్లా చూసుకుంటున్నారు. ఈ వ్యవస్థ విజయవంతం కావడంతో  ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగింది. అది పాలక పక్షం గ్రాఫ్ పెరిగింది. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని వైసీపీ  తనకు అనుకూలంగా పనిచేయించుకుంటోదన్నది చంద్రబాబు అనుమానం.  అందుకే అసలు వాలంటీర్లను ఎవరు తెమ్మన్నారు? అయిదు వేల ఉద్యోగం ఓ ఉద్యోగమా? ఏం చేయిస్తారు వారి చేత గోనె సంచీలు మోయిస్తారా? అంటూ  అసహనం వ్యక్తం చేశారు. తాము వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసిపారేస్తాం అన్నారు.

అయితే రోజులు గడిచే కొద్దీ వాలంటీర్ల పట్ల ప్రజల్లో చాలా మంచి అభిప్రాయం ఉందని  తెలియడంతోనే చంద్రబాబులో కంగారు మొదలైంది. ప్రభుత్వం చేసే మంచి పథకాల కారణంగా వాలంటీర్లకు మంచి పేరు వచ్చింది. వాలంటీర్ల సేవల ద్వారా ప్రభుత్వానికీ..పాలక పక్షానికి మంచి పేరు వచ్చింది. ఈ కారణంతోనే చంద్రబాబు నాయుడు తన కనుసన్నల్లో పనిచేసే నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపించారు.ఆంక్షల కారణంగా పింఛన్ల పంపిణీ ఆలస్యం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 66లక్షల మంది పింఛన్ దార్ల కుటుంబాల్లో ఆగ్రహావేశాలు రాజేసింది. ఇది చంద్రబాబులో ఆలోచన  పుట్టించింది.

ఈ నేపథ్యంలో వాలంటీర్లకు తాను వ్యతిరేకం కాదన్నారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు.కాకపోతే  ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయకూడదన్నదే తన  అభ్యంతరమని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే చంద్రబాబు నాయుడిపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. తాము అధికారంలోకి వస్తే  జన్మభూమి కమిటీలను మళ్లీ తెచ్చి  సేవలన్నింటినీ  అందిస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు? అని నిలదీస్తున్నారు.తన మానస పుత్రిక అయిన జన్మభూమి కమిటీల వ్యవస్థను  కాదని జగన్ మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థకే చంద్రబాబు కూడా భరోసా ఇవ్వడానికి కారణాలేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి