మోడీకి చంద్రబాబు నాయుడు ప్రేమ బాణాలు 

By KTV Telugu On 26 April, 2023
image

ఉన్నట్లుండి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు పొగుడుతున్నారు. 2019 ఎన్నికల ముందు మోదీకి భార్యా బిడ్డలు లేరు ఆయనకు ప్రజల కష్టాలు ఏం అర్ధం అవుతాయని వ్యక్తిగత దూషణలు చేసిన చంద్రబాబు నాయుడు ఇపుడు హఠాత్తుగా ఎలాంటి సందర్భం లేకుండా మోదీ పాలన అద్భుతమని ఎందుకు కీర్తిస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో మంచిగా ఉండేందుకు ఎందుకని తాపత్రయ పడుతున్నారు. తనకి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటున్నారా. చంద్రబాబు మదిలో ఏముందసలు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సడెన్ గా ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న అభివృద్ధి విధానాలతో తాను ఏకీభవిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాకనే భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని కొనియాడారు చంద్రబాబు. నరేంద్ర మోదీ తెస్తోన్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని చంద్రబాబు కీర్తించారు. నరేంద్ర మోదీ విధానాలు ఇలా కొనసాగిస్తే 2050 నాటికి భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు చంద్రబాబు. మోదీ విధానాలపై తనకు ఎటువంటి వ్యతిరేకత లేదన్న చంద్రబాబు నాయుడు 2018 లో ప్రత్యేక హోదా సెంటిమెంట్ కోసమే ఎన్డీయే నుండి బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు ఉన్నట్లుండి ఇలా నరేంద్ర మోదీని పొగిడే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారా. అన్న ప్రశ్నపైనే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఇవాళ నరేంద్ర మోదీ పుట్టిన రోజు కాదు. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి ఆయన్ను పొగడ్డానికి మోదీ ప్రధాని అయిన రోజు కూడా కాదు. ఆయన పాలన గురించి మాట్లాడే సందర్భంలో కొనియాడ్డానికి మరి ఎందుకని చంద్రబాబు నాయుడు పొగిడినట్లు ప్రధాని నరేంద్ర మోదీని తద్వారా బిజెపిని మంచి చేసుకోవడం కోసమే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మోదీని మంచి చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది ఏ సందర్భం లేకుండా మోదీ పాత విధానాలను ఇప్పుడే ఎందుకు గుర్తు చేసుకోవలసి వచ్చింది అన్న ప్రశ్నలపైనా చర్చ జరుగుతోంది. దీనికి లింక్ ఒకటి కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. కొద్ది రోజుల క్రితం టైమ్స్ నౌ-నవభారత్ సంస్థలు నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపతే కేంద్రంలో బిజెపియే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. రాబోయేది కూడా మోదీ ప్రభుత్వం కాబట్టే దాంతో మంచిగా ఉంటే అన్ని విధాలుగానూ బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉందని వారు అంటున్నారు. అన్నింటినీ మించి కొద్ది నెలలుగా ఏపీలో జనసేన-బిజెపిలతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు తో పొత్తుకు జనసేన అయితే సై అంది కానీ బిజెపి మాత్రం టిడిపిని మరోసారి నమ్మే ప్రసక్తే లేదని బల్లగుద్ది మరీ చెప్పేసింది.

బిజెపితో మిత్రపక్షంగా ఉన్న జనసేన బిజెపిని వదిలి తమతో పొత్తు పెట్టుకుంటే కొంత వరకు ఫరవాలేదు కానీ బిజెపితోనే కొనసాగితే టిడిపి పరిస్థితి ఏంటన్నది చంద్రబాబును ఆందోళనలోకి నెట్టేస్తోందంటున్నారు రాజకీయ పండితులు. ఈ కారణంతోనే బిజెపి అసహ్యించుకుంటోన్నా ఆపార్టీ అగ్రనేతలను మంచి చేసుకుని అయినా సరే పొత్తుకు ఒప్పించాలని చంద్రబాబు పంతంగా ఉన్నారని అంటున్నారు. అందుకోసమే నరేంద్ర మోదీని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారని వారు అంటున్నారు. 2018లో ఎన్డీయే నుండి బయటకు రావడానికి ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఒక్కటే కారణమని చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చుకుంటోన్న ధోరణిలో చెప్పుకొచ్చారు. బిజెపి ప్రభుత్వం నుండి ఎందుకు బయటకు వచ్చారని ఇపుడు చంద్రబాబు నాయుణ్ని ఎవరూ అడగలేదు. మరి ఆయన ఎందుకు వివరణ ఇచ్చుకుంటోన్నట్లు అని పరిశీలకులు నిలదీస్తున్నారు. ఒక వేళ చంద్రబాబు నాయుడు చెప్పిందే నిజమని కాసేపు ఒప్పుకున్నట్లు నటించినా కేవలం సెంటిమెంట్ కోసమే ఎన్డీయే నుండి బయటకు వస్తే ఆ తర్వాత నరేంద్ర మోదీపై చంద్రబాబు నాయుడు ఎందుకు వ్యక్తిగత దూషణలు చేశారు. భార్యా పిల్లలు లేనివాళ్లకి అనుబంధాల విలువ ఏం తెలుస్తుంది మనుషుల కష్టాలు ఏం అర్ధం అవుతాయని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఎత్తి పొడిచారు. నరేంద్ర మోదీ ఒక ఉగ్రవాది అన్నారు చంద్రబాబు.

నరేంద్ర మోదీ కన్నా తానే ముందుగా ముఖ్యమంత్రి అయ్యానని రాజకీయాల్లో మోదీ కన్నా తానే సీనియర్ ని అని అప్పట్లో చంద్రబాబు పదే పదే చెప్పుకున్నారు. మోదీని టార్గెట్ చేయడమే కాదు ఆయన్ను ఓడించి తీరాలని కంకణం కట్టుకున్నారు చంద్రబాబు. అందుకోసం టిడిపికి బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో కూడా జట్టు కట్టేశారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీకి కిరీటం పెట్టి ఆయనతో చేతులు కలిపి చాలా హడావిడి చేశారు.  నరేంద్ర మోదీ ఏపీని నాశనం చేశారని తిట్టిపోయడమే కాదు నాటి హోం మంత్రి అమిత్ షా కాన్వాయ్ పై తిరుపతిలో టిడిపి శ్రేణుల చేత దాడులు కూడా చేయించారు చంద్రబాబు. నరేంద్ర మోదీ సారధ్యంలోని బిజెపిని ఇంటికి పంపేస్తానన్నారు. ఇన్ని సవాళ్లు విసిరి మోదీని బిజెపిని టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడు ఇపుడు అదే మోదీని ఎందుకు పొగడాల్సి వచ్చింది కేవలం పొత్తులకోసమే కాకపోవచ్చునంటున్నారు మేథావులు. మోదీ ప్రధాని అయ్యాక ఈడీ సీబీఐ ఐటీ శాఖలకు ఖాళీ లేదసలు. అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు చురుగ్గా దర్యాప్తులు చేస్తున్నాయి. ఈ దూకుడులోనే తనపై ఉన్న అవినీతి ఆరోపణలపై కూడా దర్యాప్తులు మొదలవుతాయని చంద్రబాబు నాయుడు కంగారు పడుతున్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలోనే తనపై సిబిఐ ఈడీ దాడులు జరగవచ్చని తనని అరెస్ట్ చేయకుండా కాపాడుకోడానికి ప్రజలే రక్షణ కవచంలా ఏర్పడాలని చంద్రబాబు పదే పదే కోరుకున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల ప్రచారంలోనే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని సాక్షాత్తూ నరేంద్ర మోదీయే ఆరోపించారు. ఆ తర్వాత అమరావతి లో తమ బంధుమిత్రులతో పాటు టిడపి నేతలచేత భూములు కొనిపించి పెద్ద ఎత్తున భూకుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.

చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ ల పర్యవేక్షణలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకుందని దర్యాప్తులో బయట పడింది. దానిపై ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈకేసులు తన పీకలకు చుట్టుకుంటాయన్న భయం చంద్రబాబు నాయుడిలో ఉండి ఉండచ్చని అంటున్నారు. ఈ కేసుల దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయని ఏపీ బిజెపి నేతలు కూడా చాలా సందర్బాల్లో అన్నారు. ఇపుడా భయంతోనే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో వైరం లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. తాజా సర్వే ఫలితాలు చూసిన తర్వాత ఇక కేంద్రంలో 2024లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడం ఏపీలోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్సే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలో తేలడంతో చంద్రబాబు నాయుడిలో కంగారు రెట్టింపు అయ్యిందంటున్నారు. కేంద్రంలో అధికారంలోకి రాబోయే బిజెపితో మంచి సంబంధాలు ఉండేలా జాగ్రత్త పడితే రేపన్న రోజున కేసులు తన పీకకి చుట్టుకోకుండా చూసుకోవచ్చునని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు ఉందని వారు అంటున్నారు. ఈ కారణాలతోనే సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు అమాంతం నరేంద్ర మోదీని పొగిడి పొగిడి వదిలిపెట్టారని వారు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు ఎంత తెలివిగా మోదీని కీర్తించినా బాబు వ్యవహార శైలి ఎలా ఉంటుందో బిజెపి అగ్రనేతలకు తెలుసునంటున్నారు పరిశీలకులు. మరోసారి బాబు ట్రాప్ లో పడ్డానికి తాము సిద్దంగా లేమంటున్నారు బిజెపి నేతలు.