చంద్రబాబుకు పెద్దిరెడ్డి కలలోకి ఎందుకొస్తున్నారు?

By KTV Telugu On 18 January, 2023
image

సంక్రాంతి పండగ వేళ రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలు సందడి చేశాయి. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో రాజకీయ కోళ్లు కూడా తలపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆగర్భ శత్రువుగా ఉన్న రాష్ట్ర మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. అవి ఉద్రిక్తతలు రాజేశాయి. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు పోటీచేసే పరిస్థితే ఉండదని పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఏపీలో చర్చకు దారిస్తున్నాయి. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరి నేతల మధ్య రాజకీయ వైరం ఈ నాటిది కాదు. దశాబ్దాల చరిత్ర ఉంది దీనికి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చాలా సౌమ్యంగా మాట్లాడే మంత్రిగా మంచి పేరే ఉంది. ఎవరిమీద దుర్భాషలాడ్డం కానీ దూషించడం కానీ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు.

కాకపోతే చంద్రబాబు నాయుడు మాత్రం పెద్ది రెడ్డి పేరు వినపడితేనే ఒంటికాలిపై లేచి మండి పడుతూ ఉంటారు.
పెద్ది రెడ్డి పెద్ద స్మగ్లర్ అంటూ విమర్శలు సంధిస్తూ ఉంటారు చంద్రబాబు. చిత్తూరు జిల్లాకే చెందిన ఈ ఇద్దరికీ విద్యార్ధి దశ నుంచే అభిప్రాయ భేదాలు ఉన్నాయంటారు. విద్యార్ధి సంఘ రాజకీయాల్లోనూ చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేయడం పెద్దిరెడ్డి ప్రత్యేకత. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీయార్ పుణ్యమా అని టిడిపిలో చేరడం మామను ఒడుపుగా పదవి నుండి తప్పించి ముఖ్యమంత్రి సీటు లాగేసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు స్టేచర్ రాజకీయంగా పెరిగిపోయింది. అలాగని పెద్దిరెడ్డి తక్కువ కాలేదు. కాకపోతే తన నియోజక వర్గానికి పరిమితమయ్యే తన రాజకీయాలు తాను చేసుకుంటున్నారు.

వై.ఎస్.ఆర్.మరణానంతరం ఏపీలో రాజకీయ సమీకరణల్లో భాగంగా జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టడంతో పెద్ది రెడ్డి దానికి మద్దతు పలికారు. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ఆత్మీయుడిగానూ పేరు తెచ్చుకున్నారు.
చిత్తూరు జిల్లాకి సంబంధించి ఏ ఎన్నిక వచ్చినా వ్యూహరచన బాధ్యతను పెద్దిరెడ్డికే అప్పగిస్తారు జగన్ మోహన్ రెడ్డి.
2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత కేబినెట్ లో పెద్దిరెడ్డి కీలక బాధ్యతలే చేపట్టారు. ఈ మూడున్నరేళ్లలో చిత్తూరు లో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీని ముందుకు నడిపించింది పెద్దిరెడ్డే.
ఆయన వ్యూహాలు హిట్ కావడం వల్లనే చిత్తూరు జిల్లాలో అన్ని ఎన్నికల్లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఘన విజయాలు సాధించింది. అన్నింటినీ మించి చంద్రబాబు నాయుడికి కంచు కోట అయిన కుప్పం నియోజక వర్గంలోనూ టిడిపికి ఘోర పరాజయాలు తప్పలేదు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో టిడిపి చతికిల పడింది. దీనికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమలు చేసిన వ్యూహాలే. ఈ ఎన్నికల తర్వాతనే వచ్చే ఎన్నికల్లో తనకు కుప్పం సేఫ్ కాదేమోనని చంద్రబాబుకు కూడా భయం పట్టుకుంది. అందుకే స్థానిక ఎన్నికల పరాజయాల తర్వాత పదే పదే కుప్పం నియోజక వర్గానికి వెళ్లి మూడు రోజుల పాటు మకాం చేసి ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో ఓటమికి భయపడి తాను కుప్పం నుంచి కాకుండా వేరే చోట నుండి పోటీ చేస్తే నాయకుడే ఓడిపోతామని భయపడుతున్నాడన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని అది పార్టీకి ఏ మాత్రం మంచిది కాదని పార్టీ సీనియర్లు చంద్రబాబు చెవులు కొరికి మరీ చెప్పారట. దాంతోనే కుప్పం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. కుప్పంలో పోటీ చేస్తూనే మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుందని బాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కుప్పంలో చంద్రబాబును ఇంతగా కార్నర్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద దృష్టి సారించాల్సిన చంద్రబాబును కేవలం కుప్పానికి పరిమితం చేయడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి మైండ్ గేమ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టారని రాజకీయ పండితులు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడికి కంటి నిండా నిద్రలేకుండా చేస్తున్నారు పెద్దిరెడ్డి.