యంగ్ లీడర్లకు ఇంఛార్జ్ బాధ్యతలు.. పాతతరాన్ని పక్కనబెడుతోన్న చంద్రబాబు

By KTV Telugu On 4 February, 2023
image

టీడీపీకి పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లు లేకపోవడంతో పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. ఎవరికి వారే వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం తగువులాడుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా ఆ వ్యవహారాలను చక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. మళ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివాదాలు నెలకొన్న నియోజకవర్గాల్లో ముందుగా ఇంఛార్జ్ లను నియమించి అక్కడ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు నియోజకవర్గాలకు కొత్తగా సమన్వయకర్తలను నియమించారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుతం చంద్రబాబు నియోజకవర్గాల్లో కొందరి అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెడుతున్నారు. పొత్తులు తేలిన తరువాత వారిని అధికారికంగా అభ్యర్ధులుగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

తుని నియోజకవర్గంలో టికెట్ కోసం యనమల సోదరుల మధ్య గట్టి పోటీ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు తుని నుంచి తన కూతురును బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. కాగా తనకే టికెట్ ఇవ్వాలని తమ్ముడు కృష్ణుడు పట్టుబడుతున్నాడు. ఇటీవల ఓ కార్యకర్తతో కృష్ణుడు మాట్లాడిన ఆడియో కలకలం రేపింది. నియోజకవర్గంలో తనను కాదని మరొకరికి టికెట్ ఇస్తే పార్టీ గెలవదంటూ కృష్ణుడు వ్యాఖ్యానించారు. దాంతో అన్నదమ్ముల మధ్య పంచాయితీ కారణంగా తునిలో పార్టీ నష్టపోయే ప్రమాదం ఉండడంతో చంద్రబాబు ఆ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తనకు అత్యంత సన్నిహితుడైన యనమల రామకృష్ణుడు కూతురు దివ్యకు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆమెకేనని పరోక్షంగా బాబు స్పష్టం చేశారు. అధినాయకత్వం తనను కాదని దివ్యను ఇంఛార్జ్ గా ఖరారు చేయడంపై కృష్ణుడు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కృష్ణుడు ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. తుని నుంచి ప్రస్తుతం మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో దివ్య పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. యనమల రామకృష్ణుడు ఇక్కడి నుంచి ఆరు సార్లు గెలుపొందగా ఆయన సోదరుడు కృష్ణుడు వరుసగా రెండు సార్లు ఓడిపోయారు.

నెల్లిమర్ల సత్యవేడులో కొత్త నేతలకు అవకాశం కల్పించారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో విజయనగరం ఒకటి. నెల్లమర్ల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పతివాడ నారాయణ స్వామి స్థానంలో కొత్తగా కర్రోతు బంగార్రాజు ఇంఛార్జ్ గా నియమితులయ్యారు. పతివాడను వయో భారం కారణంగా తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారాయణస్వామినాయుడు వచ్చే ఎన్నికల్లో తనను తప్పిస్తే కుమారుడికి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. కానీ బాబు మాత్రం బంగార్రాజు వైపు మొగ్గుచూపుతున్నారు. ఆయనే పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్‌ నియమితులయ్యారు. హేమలత 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజశేఖర్ పోటీ చేసారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా హెలెన్ బరిలో నిలవనున్నారని తెలుస్తోంది. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ గా దివంగత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి తనయుడు హరీష్‌ మాధుర్‌ నియమితులయ్యారు. జనసేనతో పొత్తు కుదిరి చివరి నిమషంలో మార్పులు జరిగితే మినహా వీరంతా టీడీపీ అభ్యర్ధులుగా బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది.