తెలంగాణలో ఉన్న కొందరు బ్యూరోక్రాట్లను ఆఘమేఘాల మీద ఏపీకి వెళ్లిపోవాలని ఆదేశించడం వెనుక పెద్ద కథే నడిచిందని ఒక వర్గం వాదిస్తోంది. వాళ్లు కోర్టుకెక్కినా చుక్కెదురు కావడం వేరే విషయమే అయినా… ఇంకొన్నాళ్లు తెలంగాణలో ఉండకుండా వెళ్లాల్సి రావడం మాత్రం ఇప్పుడు అందరిలో చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో కోర్టులో ఏం జరిగిందో కూడా ఓ సారి పరిశీలించాల్సిందే….
క్యాడర్ వివాదంలో ఉన్న ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 16న ఎవరికి కేటాయించిన రాష్ట్రాల్లో వారు రిపోర్ట్ చేయాలంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ …క్యాట్…. ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏడుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం అంగీకరించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేయడంతో సదరు అధికారులకు షాకిచ్చినట్లయ్యింది. ఐఏఎస్ లు అయినంత మాత్రాన స్టే ఇవ్వాలా? అని ముక్కుసూటిగా ప్రశ్నించడం మింగుడు పడని అంశం. వాణీప్రసాద్, వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, రొనాల్డ్ రోస్ ప్రస్తుతం తెలంగాణలో ఉండగా, జి.సృజన, లోతేటి శివశంకర్, సి.హరికిరణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎవరి రాష్ట్రాల్లో వారు రిపోర్ట్ చేయాల్సిందేనని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి టీ హైకోర్టు నిరాకరించింది. క్యాట్‌లో నవంబరు 4న విచారణ ఉన్న నేపథ్యంలో అప్పటివరకైనా రిలీవ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. పైగా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కేసుకు వీరి వ్యవహారానికి సంబంధం లేదని కూడా ధర్మాసనం తేల్చిచెప్పింది.
తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులను స్వరాష్ట్రానికి వెళ్లిపోవాలని కోరడం వెనుక చంద్రబాబు మంత్రాంగం ఉందని ఒక వాదన ప్రచారానికి వచ్చింది. గత వారం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీలో పాలనను గాడిలో పెట్టేందుకు తనతో పాటు పనిచేయాల్సిన అధికారుల పేర్ల జాబితాను అమిత్ షా ముందుంచారు. వారిలో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. నిన్నటి దాకా జగన్ తో అంటకాగిన అధికారులను తన పాలనా బృందంలో కొనసాగించలేనని చంద్రబాబు తెగేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కొందరిని జీఏడీకి పరిమితం చేశామని అందరినీ అలా చేయలేమని చంద్రబాబు చెప్పారట. దానితో హోం శాఖ అధికారులను పిలిపించిన అమిత్ షా… తమ కూటమి భాగస్వామి చంద్రబాబు డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆదేశించారట. ఈ క్రమంలో డీఓపీటీ ఉత్తర్వుల రావడం, అధికారులకు క్యాట్, హైకోర్టులో చుక్కెదురు కావడం వెనువెంటనే జరిగిపోయాయి. ఇప్పుడు అనివార్యంగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న అధికారులు అత్యంత సమర్థులన్న పేరు ఉంది. ముఖ్యంగా వాకాటి కరుణ, ఆమ్రపాలి.. పాలనలో దూకుడును ప్రదర్శిస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆయా అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరికోరి.. ప్రత్యేక శాఖల్లో నియమించారు. జీహెచ్ఎంసీలో ప్రక్షాళన కోసమే ఆమ్రపాలికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో పనులు వేగం పుంజుకున్న నేపథ్యంలోనే డీఓపీటీ ఉత్తర్వులు వచ్చాయి. తెలంగాణ సీఎం రేవంత్ కు కూడా ఇదీ షాక్ గానే పరిణమించింది. గత్యంతరం లేక అయిష్టంగానే తెలంగాణ ప్రభుత్వం సదరు అధికారులను రిలీవ్ చేయాల్సి వచ్చింది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…