అఖిలప్రియకు చెక్, మౌనికకు ఎలివేషన్

By KTV Telugu On 4 August, 2023
image

KTV Telugu ;-

చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్ కొట్టాలనే డిసైడ్ అయ్యారా. కంట్రోల్ తప్పుతున్న భూమా అఖిలప్రియను ఇక పక్కన పెట్టాయ్యాలనుకున్నారా. అలాగని భూమా కుటుంబాన్ని పూర్తిగా దూరం చేసుకోవడం మంచిది కాదనుకున్నారా. అందుకే మంచు మనోజ్ ను పెళ్లిచేసుకున్న భూమా మౌనికా రెడ్డిని పైకి తీసుకురావాలనుకోవడం మంచి ఎత్తుగడ అవుతుందని భావిస్తున్నారా…

అధినేతకే అడ్డం తిరిగితే ఏమవుతుందో ఒక్క సారైనా చూపించకపోతే కేడర్లో గౌరవం ఉండదు. ఎగిరెగిరిపడుతూ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని దారికి తీసుకురాకపోతే అరాచకానికి దారితీస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో ఇప్పుడీ పరిస్థితి నెలకొనగా దాన్ని చక్కదిద్దే పనిగా చంద్రబాబు కొత్త నేతలను ప్రోత్సహించాలనుకుంటున్నారు. అందుకే భూమా అఖిలప్రియ చెల్లెలు మౌనికా రెడ్డిని రాజకీయంగా పైకి తీసుకురావాలన్న ఆలోచన ఆయనలో మెదులుతున్నట్లుగా చెబుతున్నారు.

మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక. తాను దత్తత తీసుకున్న ఆమె కుమారుడితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. పిల్లాడి పుట్టిన రోజున ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లినట్లు చెబుతున్నా.. అందులో పెద్ద మతలబే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భూమా, మంచు, నారా మూడు ఫ్యామిలీలు కలిస్తే రాజకీయం వేరుగా ఉంటుందన్న చర్చ ఒకటైతే… అఖిలప్రియ వ్యవహారమే ఈ భేటీకి కారణమని మరో వార్త ప్రచారంలో ఉంది. మాజీ మంత్రి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే అయిన మౌనికకు అక్కయ్య అఖిలప్రియ పార్టీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని చంద్రబాబు గుర్తించారు. పరోక్షంగా ఎంత నచ్చజెప్పినా ఆమె తీరు మారే అవకాశం కనిపించలేదని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారు. పైగా ఇటీవల యువగళం యాత్ర సందర్భంగా నారా లోకేష్ సమక్షంలోనే అఖిలప్రియ రౌడీయిజాన్ని ప్రదర్శించారు. లోకేష్ చూస్తుండగానే ఏపీ సుబ్బారెడ్డిపై ఎగబడి కొట్టారు. టీడీపీ పరువు బజారుకీడ్చారు. దీనితో ఆమెను కంట్రోల్ చేయకపోతే ఇబ్బందులు తప్పవని పార్టీ డిసైడైంది.

భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి కలిసి ఆళ్ళగడ్డతో పాటు నంద్యాలను కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సైతం జగన్ విఖ్యాత్ రెడ్డి లెక్క చేయడం లేదు. ఆ సీటు భూమా బ్రహ్మానందరెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు డిసైడయ్యారు. అయినా అఖిలప్రియ, జగత్ విఖ్యాత రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదు.చంద్రబాబు వారించినా వారిద్దరూ నంద్యాలలో ఒక ఆఫీసు తెరిచారు. నంద్యాల టీడీపీలో మూడు నాలుగు గ్రూపులను సృష్టించి గొడవలకు సిద్ధమవుతున్నారు. తాను నంద్యాల నుంచే పోటీ చేస్తానని జగన్ విఖ్యాత్ రెడ్డి ప్రకటించేశారు.పార్టీ అధిష్టానానికి ఇదీ మింగుడు పడని అంశంగా తయారైంది. దానితో అక్కా, తమ్ముడు ఇద్దరినీ పక్కన పెట్టేసి వారి కుటుంబంలోనే మరోకరికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చంద్రబాబులో వచ్చినట్లు చెబుతున్నారు. ఆళగడ్డ టికెట్ మౌనికా రెడ్డికి ఇస్తే ఫ్యామిలీ సెంటిమెంట్, లేడీ సెంటిమెంట్ రెండూ పండించినట్లవుతుందని, అదే టైమ్ లోే అఖిలప్రియ చాప్టర్ క్లోజ్ చేసినట్లవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవ‌ల నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుల‌తో చంద్ర‌బాబు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి నంద్యాల టీడీపీ ఇన్‌చార్జ్ భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్‌, ఏవీ సుబ్బారెడ్డి త‌దిత‌రులు వెళ్లారు. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికే టికెట్ అని చంద్ర‌బాబు ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అలాగే నంద్యాల‌లో మాజీ మంత్రి అఖిల‌ప్రియ జోక్యంపై ఆయ‌న కీల‌క ఆదేశాలు ఇచ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.నంద్యాల‌తో అఖిల‌ప్రియ కుటుంబానికి సంబంధం లేద‌ని, ఆమె వెంట ఎవ‌రూ వెళ్లొద్ద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఈ దిశగా ఇప్పుడు మౌనికను, మనోజ్ ను పిలిపించి మాట్లాడి ఉంటారని అంటున్నారు. పైగా ఎన్నికల ఖర్చులు పెట్టుకునేందుకు అఖిలప్రియ దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. ఆమె అప్పుల్లో ఉన్నారట. మౌనికా రెడ్డి అయితే మంచు ఫ్యామిలీ నుంచి ఫండింగ్ రావచ్చని ఎదురుచూస్తున్నారు. ఏం జరుగుతుందో మరి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..