పవన్ కు మరో లేఖరాసిన చేగొండి-CHEGONDI HARIRAMA JOGAIAH -PAWAN KALYAN-JANASENA

By KTV Telugu On 29 February, 2024
image

KTV TELUGU :-

సీనియర్  రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన తాజాగా మరో లేఖ రాసి పారేశారు. తరచుగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి లేఖలు రాస్తూ వస్తోన్న జోగయ్య ఆ పరంపరంలో భాగంగా చక్కటి దస్తూరీతో మరో లేఖ రాశారు. టిడిపి-జనసేన కూటమిలో అసలు పవన్ కళ్యాణ్ స్థానం ఏంటో క్లారిటీ ఇవ్వాలని  తాజా లేఖలో  ఆయన డిమాండ్  చేశారు. టిడిపి-జనసేనల ఉమ్మడి సభా వేదికపై ఈ అంశంపై క్లారిటీ ఇవ్వకపోతే ఫిబ్రవరి 29న తాను కీలక నిర్ణయం తీసుకుంటానని చేగొండి అల్టిమేటం జారీ చేశారు.

టిడిపి-జనసేనలు పొత్తు పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నప్పుడే చేగొండి హరిరామ జోగయ్య అల్మారాలోంచి  దుమ్ముపట్టిన తన లెటర్ ప్యాడ్ తీసి ఓ లెటర్ రాశరు. బడుగులకు రాజ్యాధికారం దక్కాలంటే పొత్తులో జనసేనకు గౌరవ ప్రదమైన వాటా తీసుకోవాలని అప్పట్లో సూచించారు. ఆ తర్వాత  తన రాత ముత్యాల కోవలో ఉందని ఎవరో పొగడ్డంతో మరో లెటర్ రాశారు. ఆ లేఖలో  చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే  జనసేన కనీసంలో కనీసం 60 స్థానాల్లో పోటీ చేయాలని షరతు విధించారు. దానికి పవన్ కళ్యాణ్  స్పందిస్తూ ఆరవై కాకపోయినా 50 స్థానాలకు తగ్గకుండా పోటీ చేసేలా చూస్తామని బదులిచ్చారని జోగయ్య అప్పట్లోనే బాహాటంగా చెప్పారు.ఆ తర్వాత టిడిపి వర్గాలనుండి లీక్ అయిన సమాచారం మేరకు జనసేన 35 సీట్ల కోసం పట్టుబడుతోంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు 27 స్థానాలు ఇస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

అప్పుడు జోగయ్య మళ్లీ  పెన్ తీసి మరో లెటర్ రాశారు. కనీసం 50 స్థానాలకు తగ్గద్దని పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు. ఆ పొత్తు కూడా పవన్ కు సిఎం పదవి ఇస్తామని చంద్రబాబు చేతనే చెప్పించాలని కూడా సలహా ఇచ్చారు చేగొండి. ఆయన అలా లెటర్ రాయడంతో పవన్ 40 స్థానాలు తగ్గకుండా  సీట్లు సంపాదిస్తామన్నారు.జనసైనికుల్లో  పొత్తులో తమకి ఎన్ని స్థానాలు వస్తాయో అన్న ఉత్కంఠ చెలరేగుతోందని గమనించిన పవన్ కళ్యాణ్.. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో  మనం ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తాం అన్నది ముఖ్యం కాదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఎక్కువ సీట్లు కావాలని అడిగే వారు టిడిపి-జనసేనల మధ్య చిచ్చురేపాలన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి కోవర్టుల కిందే లెక్క అని చిత్ర విచిత్రమైన వ్యాఖ్య చేశారు పవన్ కళ్యాణ్. దాంతో జనసైనికులు కూడా ఏం అనాలో అర్దం కాక జుట్టు పీక్కున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు బిజెపి పొత్తుకోసం విశ్వ ప్రయత్నాలు చేసినా లాభం లేకపోవడంతో  తీవ్ర అసహనంలోనే  టిడిపి-జనసేనల తొలి జాబితా ప్రకటించేందుకు పవన్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. టిడిపి పోటీచేయబోయే 94 స్థానాలు జనసేన పోటీ చేసే వాటిలో అయిదు స్థానాలను ఇద్దరూ కలిసి ప్రకటించారు. జనసేనకు మొత్తం మీద 24 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నామని చంద్రబాబు  పవన్ సాక్షిగా చెప్పారు. దానికి పవన్ తల ఊపారు.

స్కిల్ స్కాంలో చంద్రబాబు జైలుకెళ్లి..పార్టీ  అవసాన దశలో ఉన్న సమయంలో  టిడిపిని ఆదుకున్నందుకు జనసేనకు  ముష్ఠి 24 సీట్లు ఇస్తారా అని జనసైనికులు మండి పడుతోన్న తరుణంలో  చేగొండి హరిరామ జోగయ్య మళ్లీ పెన్ తీశారు.

జనసేనకు లెటర్స్ రాయడానికి మాత్రమే ఉపయోగిస్తోన్న తన లెటర్ ప్యాడ్ ను బయటకు తీసి ఇంకో లెటర్ రాశారు. చంద్రబాబు సీట్లు ఇవ్వడం ..జనసేన దేహీ అనడం చాలా ఛండాలంగా అసహ్యంగా ఉంది పవనూ అని చేగొండి నొచ్చుకున్నారు ఆ లేఖలో. ఏంటిది పవన్? జనసేనకు  24 సీట్లకు మించి సీన్ లేదా? అంతకు మించి గెలిచే సత్తా లేదా? ఇన్ని తక్కువ సీట్లు విదిలిస్తే నువ్వెలా ఊరుకున్నావు? ఇంకా ఎందుకు టిడిపితో కలిసున్నావ్? అంటూ  నిప్పులు చెరిగారు  చేగొండి హరిరామ జోగయ్య.చంద్రబాబు వైఖరి.. పవన్ కళ్యాణ్ జీహుజూర్ అంటూ   సైలెంట్ గా ఉండిపోవడం చూస్తోంటే బడుగులకు రాజ్యాధికారం  అన్న డిమాండ్ కాస్తా పక్కదారి పట్టేలా కనిపిస్తోందని చేగొండి  మరో లేఖ రాశారు. అట్టడుగు వర్గాల భవిత ఏంటో తేల్చాలంటూ పవన్ కళ్యాణ్ ను డిమాండ్ చేశారు. తాడేపల్లి గూడెంలో నిర్వహించనున్న టిడిపి-జనసేన ఉమ్మడి సభలో దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. ఆ రోజు కూడా బాబు కానీ పవన కానీ క్లారిటీ ఇవ్వకపోతే తాను సంచలన  నిర్ణయం తీసుకోక తప్పదని హెచ్చరించారు  చేగొండి.

మొదట్లో చేగొండిని లైట్ తీసుకుంటూ వచ్చిన జనసైనికులు ఇపుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అన్న భావనకు వచ్చారు. జనసేనను అవమానించేలా 24 సీట్లు ఇవ్వడమే కాదు.. జనసేనకు బలం ఉన్న నియోజక వర్గాలను జనసేనకు కాకుండా టిడిపికి ఏకపక్షంగా ఇచ్చుకుంటూ పోతున్నారు చంద్రబాబు నాయుడు. దీంతో జనసైనికుల్లో తీవ్ర  అసంతృప్తి రాజుకుంటోంది. చంద్రబాబు ఇష్టారాజ్యంగా చేస్తోంటే..పవన్ కళ్యాణ్ నోట్లో  బూరుగు పల్లి బెల్లం ముక్క బుగ్గన పెట్టుకున్నట్లు నోరు మెదపరేంటి? అని వారు నిప్పులు చెరుగుతున్నారు. జనసేన స్థానాల్లో టిడిపి అభ్యర్ధులను నిలబెడితే వారిని తామే ఓడిస్తామని జనసైనికులు శపథం చేస్తున్నారు. ఇటు జనసైనికులకు సద్ది చెప్పలేక..అటు చేగొండి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక..మరో వైపు చంద్రబాబు నాయుడికి ఎదురు తిరగలేక.. కనిపించని శత్రువుతో  పవన్ కళ్యాణ్ యుద్దాలు చేయాల్సి వస్తోందని ఆయన అనుచరులు సినిమాటిక్ భాషలో సెటైర్లు వేస్తున్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి