ఆయనకు కోస్తాలో కష్టాలు…! – CHEVI REDDY BHASKAR RREDDY

By KTV Telugu On 9 April, 2024
image

KTV TELUGU :-

రాయలసీమ వేరు, కోస్తా సీమ వేరని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి  ఇప్పుడిప్పుడే తెలుసొస్తోంది. తిరుపతి, చంద్రగిరి ప్రాంతంలో దశాబ్దంగా పైగా చక్రం తిప్పి.. అంతకముందు కాంగ్రెస్ లో  తుడా చైర్మన్ గా చేసిన చెవిరెడ్డికి.. ప్రకాశం జిల్లా ఎంట్రీ కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. ఉమ్మడి  జిల్లాలో పార్టీకి కష్టకాలం ప్రారంభమైన తర్వాత అక్కడి బాధ్యతలు తీసుకున్న చెవిరెడ్డికి  పరిస్థితులేవీ అర్థం కావడం లేదని వైసీపీ వర్గాల్లో టాక్. మేమున్నాము, అన్నీ చూసుకుంటామని చెప్పి ముగ్గులోకి దించిన కొందరు సీనియర్ నేతలు మొహం చాటేయ్యడంతో చెవిరెడ్డికి  దిక్కుతోచడం లేదు….

ఫిబ్రవరి మొదటి వారంలో చెవిరెడ్డిని  ఒంగోలు సమన్వయకర్తగా  ప్రకటించారు. ఆ విషయంలో విజయసాయి చక్రం తిప్పారని చెబుతారు. ఒంగోలు పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు  బాలినేని శ్రీనివాసరెడ్డి  ఒప్పుకోకపోవడంతో బతిమాలి ప్రయోజనం లేదనుకుని.. నేరుగా రాయలసీమ నుంచి చెవిరెడ్డిని  రంగంలోకి దించారు. మాగుండ శ్రీనివాసులు రెడ్డికి లోక్ సభ టికెట్ ఇవ్వకూడదని  నిర్ణయించుకున్న తర్వాత ఇక అంతా చెవిరెడ్డి మయమేననుకున్నారు. అయితే చెవిరెడ్డి  తొలుత మనస్ఫూర్తిగా ఒంగోలు రాలేదని, జగన్ పై ఉన్న  గౌరవంతో తప్పక వచ్చారని చెబుతుండేవారు. ఆ నియోజకవర్గం పరిధిలో రెడ్డి సామాజికవర్గానికి ఎంత ప్రాధాన్యం ఉందో, కమ్మ కులానికి కూడా అదే రేంజ్ లో ఫోలోయింగ్ ఉందని, గెలుపు అంత సులభం  కాదని చెవిరెడ్డి అర్థం చేసుకున్నారు. పైగా  ఆయనకు  ఇంచార్జీ ప్రకటించిన ఒకటి రెండు రోజులకే ప్రకాశం  జిల్లాలో అనేక చోట్ల చెవిరెడ్డి ఫ్లెక్సీలు చించేశారు. ఆ పని వైసీపీ వాళ్లే చేశారని ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతో చెవిరెడ్డికి ముచ్చెమటలు పట్టాయి. చెవిరెడ్డి స్థానికుడు కాకపోపోవడం, సాధారణంగానే వైసీపీకి జనంలో  వ్యతిరేకత పెరగడంతో ఆయనకు ఉక్కపోత తప్పలేదు. పైగా  జిల్లాలోని  క్రీయాశీల  వైసీపీ  శ్రేణులు ఒక్కరొక్కరుగా టీడీపీలోకి వెళ్లిపోతూ, పార్టీపై బురద జల్లడం మరో సమస్యగా మారింది. పైగా చాలా మంది పార్టీ  నేతలు చెవిరెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. తమకు బాలినేని మాత్రమే నాయకుడంటూ ప్రకటనలిస్తున్నారు..

ఎలా నెగ్గుకు రావాలో చెవిరెడ్డికి  అర్థం కావడం లేదు. అధిష్టానం ఆశీస్సులతో ఒంగోలు ఎంపీగా గెలవాలనుకుంటున్న  ఆయనకు ఎదురుగాలి  మొదలైంది. తనకు ప్రయోజనకరంగా ఉంటుందనుకుని ఏరి  కోరి తెచ్చుకున్న ఐపీఎస్  అధికారిపై తాజాగా ఎన్నికల సంఘం  వేటు వేయడంతో చెవిరెడ్డి గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది….

ఒంగోలు ఏస్పీగా ఉన్న  పరమేశ్వరరెడ్డిని ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటూ ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థులు  డైలమాలో పడ్డారు. 2010లో గ్రూప్ ద్వారా పరమేశ్వరరెడ్డి డీఎస్పీ అయ్యారు. జగన్ సీఎం అయిన తరువాత చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పరమేశ్వరరెడ్డి పని చేశారు. దీంతో జగన్ కుటుంబానికి దగ్గరైన పరమేశ్వరరెడ్డికి ఐపీఎస్ హోదా వచ్చిన వెంటనే తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కోసం పరమేశ్వరరెడ్డి ఖాకీ యూనిఫాంని కూడా పక్కన పెట్టి పని చేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున్న ఉన్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికల వేళ చంద్రగిరి అసెంబ్లీ నుండి ఒంగోలు పార్లమెంట్ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బదిలీ అయ్యారు. తనకు సన్నితుడిగా పేరుపొందిన పరమేశ్వరరెడ్డిని ప్రకాశం జిల్లా ఎస్పీగా తీసుకువచ్చారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి మన వాడే…మీరేమీ భయపడకండి అంటూ ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైసీపీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధైర్యం చెప్పినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగానే ఎస్పీ పరమేశ్వరరెడ్డి వ్యవహార శైలి కూడా ఉంది. గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్ లో టీడీపీ కార్యకర్త మునయ్యని చంపేస్తున్నామని వైసీపీ నాయకులు ముందస్తుగా చెప్పి మరీ హత్య చేశారు. మునయ్య హత్యకు ముందుగా కానీ, హత్య జరిగిన తరువాత నిందితుల్ని పట్టుకోవడంలో కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటుగా గత నెలలో చిలకలూరిపేట వద్ద  ఎన్డీఏ కూటమి నిర్వహించిన బహిరంగ సభ వద్ద విధుల్లో ఉన్న ఎస్పీ పరమేశ్వరరెడ్డి సభకి వెళ్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించడంతో పాటూ కొంత మందిపై స్వయంగా చెయ్యి చేసుకున్నారు.  పరమేశ్వరరెడ్డి తీరుపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఈసీ ఎస్పీ పరమేశ్వరరెడ్డిని పలిచి వివరణ కోరింది. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఈసీ ఆయనపై బదిలీ వేటు వేసింది.

ఒంగోలు నుంచి పరమేశ్వర రెడ్డి  నిష్క్రమణ ఇప్పుడు చెవిరెడ్డికే కాకుండా ఆయన్ను నమ్ముకున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా శాపంగా మారింది. ప్రజా  మద్దతు లేక, అధికార స్థాయి నుంచి పనులు జరక్క.. దిక్కుతోచడం లేదు. చెవిరెడ్డిని నమ్మి ఇబ్బందుల్లో పడిపోయామని వాళ్లు భావిస్తున్నారు.చెవిరెడ్డి పరిస్థితి కూడా అంతేననుకోవాలి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి