ఏపీ బీజేపీలో నాయకుల ఇష్టారాజ్యమైంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను రోడ్డుకీడ్చుతున్నారు. కొందరు బహిరంగ ప్రకటనలు చేస్తుంటే మరికొందరు అసమ్మతి రాజకీయాలు నడుతున్నారు. ఎవడైతే మాకేంటీ అన్నట్లుగా వాళ్లు వ్యవహరిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏకపక్ష ప్రవర్తన కూడా ఇందుకు కారణం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ జాతీయ పార్టీ కావచ్చు. కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణానికి బలమైన నాయకత్వం ఆ పార్టీకి ఉండొచ్చు. దేశంలో మోదీ మేనియా వేగంగా విస్తరిస్తుండొచ్చు. మోదీ విధానాలు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వర్గాలకు నచ్చుతుండొచ్చు. ఐనా సరే ఏపీలో బీజేపీ మైనర్ పార్టీ మాత్రమేనని మరిచిపోకూడదు. వైసీపీ, టీడీపీ, జనసేన తర్వాతే ఆ పార్టీ పరపతి ఉంటుందని గుర్తించి తీరాల్సిందే. గత ఎన్నికల్లో వచ్చిన సున్నా పాయంట్ ఐదు శాతం అంటే ఒక శాతం కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీ బలానికి ప్రామాణికంగా ఉంటాయని గుర్తించాల్సిందే. ఐనా సరే అంతర్గత కీచులాట, ఇష్టానుసార ప్రవర్తన, నోటికొచ్చిన కామెంట్లు ఆ పార్టీకి నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగుతున్నాయి.ఎంపీ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ ట్రెండ్ ఇంకా ఎక్కువైంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ కూడా ఇప్పుడు సొంత పార్టీ తీరుపైనే దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉండి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కూడా గెలిచిన అంబికా కృష్ణ.. ఇప్పుడు చంద్రబాబుతో బీజేపీ పొత్తును గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీలో ఎన్డీయే ఎక్కువ కాలం కొనసాగదని ఎన్నికలు ముగిసిన వెంటనే విచ్ఛిన్నం కావడం ఖాయమని ఆయన ప్రకటించేశారు. టీడీపీతో పొత్తు బీజేపీలో మెజార్టీ కేడర్ వ్యతిరేకిస్తోందని, చాలా మంది ఏపీ బీజేపీ నేతలు అధిష్టానానికి లేఖలు రాసినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదని ఆయన అంటున్నారు. ఏపీలో ఒక్క బీజేపీ కార్యకర్త సంతోషంగా లేడని ఆయన వాదిస్తున్నారు. వాస్తవానికి ఈ మాటలన్నీ పార్టీలో అంతర్గతంగా చెప్పాల్సినవే. కాకపోతే ఇప్పుడు అంబికా కృష్ణ లాంటి వారు ఓపెన్ అయిపోయారు.అది క్రమశిక్షణా రాహిత్యమా కాదా అన్నది బీజేపీ పెద్దలే నిర్ణయించుకోవాలి….
పురంధేశ్వరి అంటే చాలా మందికి పడదు. ఆమె పార్టీలో చేరి పదేళ్లయినా ఇంకా ఔట్ సైడర్ గానే చూస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఆమె హవా నడిచిందన్న ఆగ్రహం పాతకాపుల్లో గట్టిగానే ఉంది. ఇప్పుడు కొంత మంది నేతలు చాపకింద నీరుగా అసమ్మతి రాజకీయాలు చేస్తూ సహాయ నిరాకరణకు దిగుతున్నారు….
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి సర్ ప్రైజ్ ఛాయిస్ అని అంటారు. అంతవరకు ఆ పదవి కోసం ఎదురుచూసిన వాళ్లంతా చప్పున చల్లారిపోయారు. ఆమె రావడమే టీడీపీతో పొత్తుకు సంకేతమని ఒక వర్గం భావించింది. అంతవరకు జగన్ రెడ్డి వైపు మొగ్గు చూపిన ఒక వర్గానికి అసంతృప్తి తప్పలేదు. దానికి తగ్గట్టుగా కార్యవర్గ ఎంపికలో పురంధేశ్వరి కొందరిని పక్కన పెట్టారన్న ఆగ్రహమూ ఉంది. ఎంపీ టికెట్ ఆశించిన వారికి కాకుండా వేరే వారికి టికెట్లు రావడంతో ఆ అసంతృప్తి మరింతగా పెరిగింది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గం కక్కలేక మింగలేక కామ్ గా పాలిటిక్స్ చేస్తోందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.వారంతా ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలో సాఫ్ట్ కార్నర్ పాటిస్తూనే, చంద్రబాబుతో పొత్తును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలకు ఆ దిశగా సంకేతాలివ్వడం మొదలు పెట్టారని చెబుతున్నారు. చంద్రబాబుకే సీఎం పదవి ఎందుకని కొందరు ప్రశ్నించిన సందర్భమూ ఉంది. ఆ సంగతి అధిష్టానం దృష్టికి వెళ్లడంలో పద్ధతి మార్చుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది దానితో బహిరంగ ప్రకటనలు చేయకుండా వాళ్లు తమదైన రీతిలో చక్రం తిప్పే ప్రయత్నంలో ఉన్నారు….
ఏపీ బీజేపీలో క్యాస్ట్ పాలిటిక్స్ కూడా ఉన్నాయని ఒక వర్గం చెబుతున్న మాట. ఏ రెండు కులాలు కుమ్ములాటకు దిగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనికూడా లేదు. అందరూ కలిసి పార్టీకి కిందకు లాగుతున్నారన్నదే ఇప్పుడు అధిష్టానం టెన్షన్ . దాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. లేకపోతే పుణ్యకాలం గడిచిపోతుంది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…