ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత జిల్లాలో శిరోభారం తప్పడం లేదు. రాష్ట్రానికి సీఎం అయినా.. అన్ని జిల్లాలకు రారాజుగా వెలిగిపోతున్నా… ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాను మాత్రం ఎప్పటికీ దారికి తెచ్చుకోలేకపోతున్నారు. ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు సొంత జిల్లాలోనే ఆయన ఎక్కువ నష్టపోతూ ఉండేవారు. ఇప్పుడు అధికారానికి వచ్చి నాలుగు నెలలు దాటినా ఉమ్మడి చిత్తూరులో సమస్యలను పరిష్కరించేందుకు, నేతలను కంట్రోల్ లో ఉంచేందుకు ఆయన శతమతమవుతున్నారు. వైసీపీ విజయం సాధించిన 11 నియోజకవర్గాల్లో ఉమ్మడి చిత్తూరు నుంచి మూడు సెగ్మెంట్లు ఉండటం చంద్రబాబు పరివారానికి కాస్త మింగుడు పడని అంశమేనని చెప్పాలి. పెద్దిరెడ్డి , ద్వారకానాథ్ రెడ్డి లాంటి హేమాహేమీలను ఓడించలేకపోయామన్న అసంతృప్తి టీడీపీలో ఉండనే ఉంది. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు చేస్తున్నదేమిటంటే మాత్రం టెన్షన్ కొనసాగుతోంది…
వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడిన కేడర్… ఈ సారి కూటమి గెలుపుతో సంబరాలు చేసుకుంటున్నప్పటికీ… ఎమ్మెల్యేల తీరు మాత్రం క్షేత్రస్థాయిలో ఇబ్బందిగా మారింది. విజయాన్ని అవకాశంగా తీసుకుని జిల్లాలో పార్టీని పటిష్ట పరిచి చంద్రబాబు ప్రశంసలు పొందాల్సిన ఎమ్మెల్యేలు చిల్లర పనులు చేస్తూ, కలెక్షన్లకు దిగుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలకు సంపాదన మీద ఉన్న ఆసక్తి… కార్యకర్తలను కలుపుకుపోవడంలో లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలే కాకుండా జిల్లాకు సంబంధించిన ఇతర నేతలు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దండుకుంటున్నారని సమాచారం రావడంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదని తెలుుస్తోంది..
పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం వచ్చీరాగానే సంపాదనపై దృష్టి మళ్ళించారని, పార్టీ పటిష్టతను వదిలేసి దానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. నిఘా వర్గాలతో పాటు పార్టీ పరంగానూ వేర్వేరు మార్గాల్లో అందిన సమాచారం ఆధారంగా జిల్లాలో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, ఇంఛార్జుల పనితీరును, వారి వ్యవహార శైలిని అధినేత చంద్రబాబు బేరీజు వేస్తున్నట్టు సమాచారం. ఎక్కువమంది ఎమ్మెల్యేలు పార్టీకోసం కష్టపడిన నాయకులను పట్టించుకోకుండా, తమకు అనుకూలురైన ఒకరిద్దరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, వారు చెప్పినట్టే వినాలని మండలస్థాయిలో అధికారులకు ఆదేశాలిస్తున్నారని అధినేతకు ఫిర్యాదులు అందాయి. ఇక శాసనసభలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కొందరు ఎమ్మెల్యేలు ఇసుక మీద పడ్డారు. ప్రభుత్వ ఇసుక విధానం ఖరారు కాకముందే డంపుల్లో నిల్వవున్న ఇసుకను దౌర్జన్యంగా తెగనమ్మేసుకున్నారని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు. వైసీపీ నేతలు చేసిన భూ కబ్జా వ్యవహారాల్లో తలదూర్చి చెరి సగం దండుకునే పద్ధతిలో సర్దుడు బేరాలు మొదలు పెట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. తనకందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుంటున్న అధినేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఇంఛార్జుల పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. వైసీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జీలు తీరు సరిగ్గా లేదని కొందరు కార్యకర్తలు గుంపుగా అమరావతి వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు.
టీడీపీ నేతలు ఇప్పుడు జిల్లా అభివృద్ధిని తుంగలో తొక్కారు. సొంత ఆర్థికాభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. జిల్లాలో కార్యక్రమాల కోసం తన వద్దకు ఏమైనా ప్రతిపాదనలు వస్తే మంజూరు చేద్దామని చంద్రబాబు ఎదురు చూస్తున్నప్పటికీ ఆ దిశగా పని చేసే వారే కనిపించడం లేదు. రాజధానికి వచ్చి మంత్రులను కలిసి సొంత పనులు చక్కబెట్టుకునేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. చంద్రబాబు తిరుమల పర్యటనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ పరిస్థితి చర్చకు వచ్చింది. ఒకరిద్దరు నేతలను పిలిపించుకుని ఆయన పార్టీ పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమికంగా గీత దాటిన ఒకరిద్దరు నేతల గురించి ప్రస్తావనకు రాగా.. సమయాభావం వల్ల పూర్తి స్థాయి చర్చను వాయిదా వేయాల్సి వచ్చింది. తాను కబురు చేసినప్పుడు అమరావతి వచ్చి కలవాల్సిందిగా ఇద్దరు నేతలను చంద్రబాబు ఆదేశించినట్లుగా చెబుతున్నారు. అప్పుడు సమగ్ర కార్యాచరణను ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఎందుకుంటే చిత్తూరు జిల్లా పార్టీని అలాగే వదిలేస్తే మొదటికే ముప్పు వస్తుందని చంద్రబాబుకు అర్థమైంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…