అకస్మాత్తుగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ

By KTV Telugu On 24 January, 2023
image

మూడు సంవత్సరాలకు పైగా ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను అకస్మాత్తుగా బదలీ చేసి జనరల్ అడ్మినిస్టేషన్ డిపార్ట్ మెంట్ అంటే జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇదీ రొటీన్ ట్రాన్స్ ఫర్ కాదని సీఐడీ నుంచి సునీల్ గెంటివేతకు గురయ్యారని కొందరు వాదిస్తున్నారు. పోలీసు శాఖలో సునీల్ రోజువారీ చర్చనీయాంశం కావడంతో కొంత డైవర్షన్ కోసమే ఆయన్ను తప్పించారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసుల్లో సునీల్ అతి చొరవ చూపు అరెస్టులకు ప్రయత్నించడం వంటి చర్యలు జరిగాయి.

జగన్ కు ఎదురు తిరిగిన వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణ రాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి కాళ్ల మీద బాదుతూ లాఠిణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ఆ తంతు మొత్తాన్ని జగన్ కు లైవ్ ఇచ్చారని చెబుతారు. పైగా జగన్ పెట్టమన్న కేసుల కంటే సీఐడీ ఎక్కువ కేసులే పెట్టిందన్న చర్చ కూడా జరుగుతోంది. జగన్ ప్రైవేటు సైన్యానికి సునీల్ కుమార్ సేనాధిపతిగా మారారన్న ఆరోపణలు రోజురోజుకు పెల్లుబికాయి. పైగా ఇటీవలి కాలంలో ఏపీ సీఐడీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. జర్నలిస్టులు, టీడీపీ నేతలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిస్తే రిమాండ్ విధించేందుకు న్యాయస్థానం తిరస్కరించిన ఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తే సరిపోతుందంటూ కోర్టు ఆదేశాలిస్తోంది. ఇదంతా సునీల్ కుమార్ చేతగానితనం వల్లే జరుగుతోందని జగన్ ఆగ్రహం చెందుతున్నారట.

సునీల్ కుమార్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయనకు చెందిన స్వచ్చంద సంస్థ మత మార్పిళ్లకు పాల్పడుతున్నప్పటికీ జగన్ చూసిచూడనట్లుగా ఉరుకుంటున్నారని విపక్షం అంటోంది. ఆయన చేసిన చట్ట వ్యతిరేక చర్యలపై కేంద్రానికి ఎన్నో ఫిర్యాదులు అందాయి. వాటిపై చర్యలు తీసుకోవాలని అనేక సార్లు రాష్ట్రానికి కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. కానీ ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు. ఇటీవల మూడు నాలుగు సార్లు సునీల్ అమెరికా వెళ్లివచ్చారు. ఆయన అన్ని పర్యాయాలు ఎందుకు వెళ్తున్నారని ప్రభుత్వం ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయట పడ్డాయని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే వాటిపై స్పష్టమైన సమాచారం బయట పడాల్సి ఉంది.

సునీల్ కుమార్ ఇప్పుడు డైరెక్టుగా టీడీపీకి టార్గెట్ అయ్యారు. పైగా మూడు సంవత్సరాలు ఒక అధికారిని ఒకే శాఖలో ఉంచడం కూడా కరెక్టు కాదన్న అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వినిపిస్తోంది. అందుకే సునీల్ ను బదిలీ చేసినట్లు చెబుతున్నారు. సునీల్ మాత్రం ఇటీవలే డీజీపీ కేడర్ పొందిన నేపథ్యంలో తనకు ఆ పదవి వస్తుందని చెప్పుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. సునీల్ అమెరికా పర్యటనపై ప్రభుత్వం సీరియస్ గా ఆరా తీస్తోంది. పైగా కేంద్రప్రభుత్వం దృష్టి ఆయనపై పడింది. ఏం జరుగుతుందో.