టిడిపి,బిజెపిలు ఎందుకు అబద్ధం చెప్పాయి

By KTV Telugu On 3 May, 2024
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి-జనసేన-బిజెపి కూటమి ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు పవన్ కల్యాణ్ లు  మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రతినిథి ఉన్నప్పటికీ మేనిఫెస్టోతో బిజెపికి సంబంధం లేదన్నారు. జాతీయ స్థాయిలో బిజెపి మేనిఫెస్టో విడుదల చేసిందని కూడా అన్నారు. ఏ రాష్ట్రంలోనూ బిజెపి రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోలు విడుదల చేయలేదని చంద్రబాబు అన్నారు. బిజెపి ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సిద్ధార్ధ సింగ్ కూడా అదే  చెప్పారు. అయితే అటు చంద్రబాబు నాయుడు, ఇటు సిద్ధార్ధ కూడా పచ్చి అబద్దాలే చెప్పారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఏపీ లో కూటమి మేనిఫెస్టోకి బిజెపి దూరంగా ఉండడానికి చంద్రబాబు నాయుడు, బిజెపి నేత  సిద్ధార్ధ ఎందుకు అబద్ధాలు చెప్పారన్నది ఇపుడు చర్చ నడుస్తోంది. ఎందుకంటే బిజెపి ఏ రాష్ట్రంలోనూ  ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయలేదన్నది తిరుగులేని అబద్దం. గతంలో చాలా రాష్ట్రాల్లో బిజెపి ఉమ్మడి మేనిఫెస్టోలు విడుదల చేసింది. బిహార్ ఎన్నికల్లోనూ మిత్ర పక్షాలతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది. మరి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే బిజెపి ఉమ్మడి మేనిఫెస్టోకి ఎందుకు దూరంగా ఉంది? అన్నది ప్రశ్న. దీని వెనుక ఏం జరిగిందన్నది కూడా  మిస్టరీగా మారింది.

ఇతర రాష్ట్రాల్లో ఉమ్మడి మేనిఫెస్టోలు విడుదల చేయడమే కాదు. ఆంధ్ర ప్రదేశ్ లోనూ  ఉమ్మడి మేనిఫెస్టో కోసం బిజెపి నేతలు కసరత్తులు చేశారన్నది వాస్తవం. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. ఏప్రిల్ 30న టిడిపి-బిజెపి-జనసేనల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాం అన్నారు. అంతే కాదు ఏప్రిల్ 9న ఓ ఆంగ్ల పత్రికలో ఓ వార్తాకథనం వచ్చింది. అందులో  ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఏమేమి అంశాలు చేర్చాలన్న దానిపై ఎన్డీయే కసరత్తులు చేస్తోందని బిజెపి నేతలు ప్రకటించారు. దీనికోసం ప్రజల నుండి అభిప్రాయ సేకరణ కోసం ఒక ఫోన్ నంబర్ ను కూడా విడుదల చేశారు. ప్రజలు సలహాలు సూచనలు ఇవ్వచ్చన్నారు.

ఇక విశాఖ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో అక్కడి  స్థానిక సమస్యలు, ప్రజల ఆకాంక్షల ఆధారంగా స్థానికంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి విశాఖ నార్త్ నియోజక వర్గ బిజెపి అభ్యర్ధి విష్ణుకుమార్ రాజుతో పాటు ఇతర బిజెపి నేతలు కూడా హాజరయ్యారు. చాలా వరకు అభిప్రాయాలు సేకరించారు. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ బిజెపి తరపున మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపైనా చర్చ జరిగింది. అంతా సజావుగా జరుగుతోన్న సమయంలో హఠాత్తుగా బిజెపి అగ్రనాయకత్వం ఉమ్మడి మేనిఫెస్టో నుండి దూరం జరగడమే శ్రేయస్కరమని భావించినట్లు  బిజెపి వర్గాల్లో గుస గుసలు వినపడుతున్నాయి.

ఏపీ బిజెపికి చెందిన  సీనియర్ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్. కృష్ణారావు  టిడిపి-జనసేనల మేనిఫెస్టో లను ప్రస్తావిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కావని కుండబద్దలు కొట్టేశారు. ఏపీ బిజెపిలో పురందేశ్వరికి వ్యతిరేక వర్గ నేతలంతా కూడా ఈ మేనిఫెస్టోపై పెదవులు విరుస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే బిజెపి రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్. నరసింహారావు అయితే ఏపీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై సానుకూలంగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల మేనిఫెస్టోని కొనసాగించడం ద్వారా  విశ్వసనీయత సాధించారని ఆయన అన్నారు.దానర్దం ఏంటి? కూటమి మేనిఫెస్టో కన్నా బాగుందనే కదా? అంటున్నారు విశ్లేషకులు.

వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  అయిదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల కోసం ఏటా 71 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకాలను ఉద్దేశించి^గతంలో చంద్రబాబు  నాయుడు ఇలా డబ్బులు పంచిపెడితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని హెచ్చరించారు. వెనిజులా మాదిరిగా దివాలా తీస్తుందని అని కూడా అన్నారు. అయితే ఇపుడు చంద్రబాబు మేనిఫెస్టోలో హామీలను అమలు చేయాలంటే ఏడాదికి 1.65లక్షల కోట్లు అవసరం అవుతాయని ప్రాధమిక అంచనా. మరి ఇంత డబ్బును ఎక్కడి నుంచి తెస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.పైకి అనకపోయినా బిజెపిలో చాలా మంది సీనియర్లు ఇదే  భావనతో ఉన్నారు.  ఈ విషయంపై పార్టీ నాయకత్వంతోనూ వారు మాట్లాడినట్లు సమాచారం. అందుకే ఈ మేనిఫెస్టోకి దూరంగా ఉండడమే బెటరని కమలనాథులు భావించారేమో.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి