ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందా. పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. వీర్రాజు నాయకత్వంపై అసంతృప్తి స్వరం పెరుగుతోంది. ఆంధ్ర కమలం పార్టీలో ఓ బ్యాచ్ టీడీపీకి అనుకూలంగా మరో బ్యాచ్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే టాక్ ఉంది. ఇక గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బ్యాచ్ వీర్రాజు నాయకత్వంపై కాస్త గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది. వీర్రాజు వల్లే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానంటూ మొన్నటికి మొన్న పోతూ పోతూ కన్నా లక్ష్మీనారాయణ దుమ్మెత్తిపోశారు. అటు జీవీఎల్పైనా తన అసహనం వెలిబుచ్చారు. ఈ వివాదం ఇంకా సద్దుమనగక ముందు బీజేపీలో మరో రచ్చ మొదలైంది. ఎంపీ జీవీఎల్‌పై ఆ పార్టీ సీనియర్ నాయకురాలు పురందేశ్వరి ఫైర్ అయ్యారు.
ఏపీలో రెండు కుటుంబాల పేర్లే వినిపిస్తున్నాయని ఎంతసేపు ఎన్టీఆర్, వైఎస్సార్లేనా వంగవీటి రంగాను పట్టించుకోరా అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు. అంతే ట్విట్టర్ వేదికగా జీవీఎల్ కామెంట్‌కు పురందేశ్వరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరు కాదు ఆ మహానుభావులు అంటూ ట్వీట్ చేశారు. ఆ ఇద్దరి గురుంచి చెబుతూ జీవీఎల్‌కు హితబోధ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, రూ. 2లకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరోకరు ఫీజు రీయింబర్స్మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారని గుర్తు చేస్తూ సొంత పార్టీ ఎంపీకి చురక అంటించారు పురంధేశ్వరి. మొన్న కన్నా, నేడు పురంధేశ్వరి రేపు మరెవరో గానీ. ఏపీ బీజేపీలో గూడు కట్టుకున్న అసంంతృప్తి మెల్లిమెల్లిగా బయటపడుతోంది. దానికి సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహా రావే కారణమంటూ చాలా మంది నేతలు వారిద్దరివైపు వేళ్లు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇటీవల జీవీఎల్ కాపు నినాదం అందుకున్నారు. రాష్ట్ర జనాభాలో 22శాతం ఉన్న ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అన్నిటికీ ఎన్టీఆర్- వైఎస్సార్ పేర్లేనా రంగా పేరు ఎందుకు పెట్టరంటూ కొత్త వివాదానికి తెరలేపారు. సోము వీర్రాజు, జీవీఎల్‌లో ఒంటెద్దు పోకడలకు పోతున్నారనే ఆగ్రహంతో కొందరు కమలం నేతలున్నారు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న పెట్టిన కార్యవర్గ సమావేశాలకి చాలా మంది జిల్లా నాయకులు డుమ్మా కొడ్డటానికి ఈ విభేదాలు, అసంతృప్తులే కారణమని టాక్ గట్టిగా వినిపిస్తోంది. బీజేపీ నేతలే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకత్వంపై చాలా అసంతృప్తిగానే ఉన్నారు. ఢిల్లీ నాయకత్వం కారణంగానే ఇప్పటి వరకు పవన్ బీజేపీతో కలిసి ఉన్నారు. ఇటీవల పొత్తుల విషయంలో జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఇక్కడి వారికి అవగాహన లేదన్నట్టు మాట్లాడారు.