మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తోన్న సమయంలో అనూహ్యంగా గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఒక రాయి వచ్చి జగన్ మోహన్ రెడ్డి ఎడమ కంటికి పై భాగాన తగిలి పక్కనే ఉన్న పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కంటిని తాకింది. ఇద్దరికీ నెత్తుటి గాయాలయ్యాయి. ఇది కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నమే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సభలకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. టిడిపి-జనసేన సభలకు ఆ స్థాయిలో రావడం లేదన్న ఉక్రోషంతోనే జగన్ మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే దాడి చేశారని..కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించే కుట్రేనని వైసీపీ నేతలు అంటున్నారు. 2019 ఎన్నికల్లోనూ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో కత్తితో దాడి జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డే తన అభిమాని చేత దాడి చేయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా అలానే చేశారన్నది టిడిపి వాదన.
విజయవాడలో రాతి దాడి డ్రామాని తాను తేల్చేస్తానని చంద్రబాబు అన్నారు. దాడి జరిగిన వెంటనే ఇది వైసీపీ నేతలే చేయించుకున్న దాడి అన్నారు చంద్రబాబు. అయితే ఇది పకడ్బందీగా చేసిన దాడి అంటున్నారు పాలక పక్ష నేతలు. దాడి జరిగిన రోజు మధ్యాహ్నమే చంద్రబాబు నాయుడు ఓ సభలో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి.. రాయితో కానీ లేదా ఏది దొరికితే దానితో కానీ కొట్టండి..తర్వాత ఏం జరిగినా మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మరో సభలో జగన్ మోహన్ రెడ్డి మాడి మసైపోతారని కూడా చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యల లక్ష్యం కార్యకర్తలను దాడికి పురికొల్పడమే అంటున్నారు వైసీపీ నేతలు.
దాడి వెనుక ఎవరున్నారన్నది దర్యాప్తులో తేలాలి. ఈ దాడి విపక్షాలే చేయించాయనడానికి ఆధారాలు లేవు. కాకపోతే టిడిపి, జనసేన నేతల వ్యాఖ్యలు వింటే వారే దాడి చేయించినట్లు అనిపిస్తోందంటున్నారు మంత్రులు.పవన్ కల్యాణ్ అయితే ఆ రాయిని పూల దండలో పెట్టి వారే దాడి చేయించుకున్నారేమో ఎవరికి తెలుసు? అన్నారు. పవన్ సోదరుడు నాగబాబు అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్..ఎక్కడా స్క్రిప్టెడ్ అనిపించడం లేదు అంటూ ట్వీట్ చేశారు. అయితే దానిపై విమర్శలు రావడం వల్లనో ఏమో కానీ ఆయన దాన్ని ట్విట్టర్ నుండి తొలగించి దాడిని ఖండిస్తూ మరో పోస్టు పెట్టారు.
చంద్రబాబు నాయుడు కూడా ఒక పక్క దాడిని ఖండిస్తాం అంటూనే దాడి ఒక డ్రామా అంటూ విమర్శించారు. అది దాడా? లేక డ్రామానా? అన్నది చంద్రబాబు క్లారిటీకి రావాలని పాలక పక్ష నేతలు అంటున్నారు. జగన్ పై దాడికి నిరసనగా వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు తమ తమ సభల్లో తమపై కూడా రాళ్ల దాడి జరిగిందంటూ ఆరోపణలు చేయడం విశేషం. చంద్రబాబు యాత్రలో రాయి ఎక్కడో దూరంగా పడిందన్నారు. పవన్ సభలో అయితే రాతితో దాడి చేస్తున్నారనుకుని ఒకరిని పట్టుకుని చితకబాదారు. అయితే అతను జనసేన అభిమానే అని ఆ తర్వాత తేలింది.
మొత్తానికి జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడితో ఎన్నికల ముందు ఆ పార్టీకి సానుభూతి వస్తుందేమోనని టిడిపి,జనసేనలు జాగ్రత్తపడుతున్నాయి. తమపై కూడా దాడులు జరిగాయని అంటున్నాయి. అయితే వీటిపైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితేనే నిజా నిజాలు వెలుగులోకి వస్తాయి. కాకపోతే రాష్ట్ర చరిత్రలోనే ఎన్నికల ప్రచారంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇదే మొదటి సారి. జగన్ మోహన్ రెడ్డి అయితే దాడి జరిగిన తర్వాత ఒక రోజు మాత్రమే విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు నుండి యాత్ర మొదలు పెట్టేశారు. ఈ రాళ్ల దాడి ఆరోపణలు మే 13న జరగబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తి కరంగా మారింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…