ఎన్నికల్లో టికెట్ కచ్చితంగా తనకే వస్తుందని చెప్పేవాళ్లని చూశాం. టికెట్ ఇవ్వాలని కోట్లాడే నేతలను చూశాం. కానీ ఓ మాజీ మంత్రి ఏకంగా తనకు టికెట్ రాదని ముందే జోస్యం చెబుతున్నారు. అంతేకాదు తన భార్యకు టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని రానున్న ఎన్నికల్లో తనకు కూడా టికెట్ రాకపోవచ్చని అన్నారు. తన సతీమణికి టికెట్ ఇస్తారేమోనంటూ హాట్ కామెంట్స్ చేశారు. మహిళలకే ఇస్తామని తేల్చిచెబితే తానైనా పోటీ నుంచి వైదొలగకతప్పదన్నారు. పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా బాలినేని ఆ వ్యాఖ్యలు చేశారా లేక మహిళల ఓట్ల కోసం సెంటిమెంట్ పండించారా అనేది చర్చనీయాంశంగా మారింది.
కొండెపి నియోజకవర్గంలో వర్గవిభేదాలపై బాలినేని స్పందించారు. వైసీపీ ఇంఛార్జ్ అశోక్‌బాబుపై పలువురు అసంతృప్తితో ఉన్నారని విభేదాలు మరిచి కలిసికట్టుగా పని చేయాలని ఆయన సూచించారు. 2019 ఎన్నికల్లో కొండెపి నియోజకవర్గంలో వైసీపీ ఓటమిపాలైంది. ఈసారి మాత్రం అక్కడ కచ్చితంగా గెలిచి తీరడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు అమలు చేసుకుంటూ వస్తోంది. 2024లో కొండెపిలో వైసీపీ జెండా ఎగారల్సిందేనని బాలినేని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబర్చిన వాళ్లకే మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రులకు కూడా మినహాయింపు ఉండదని క్లారిటీ ఇచ్చారు. పనితీరు బాగోలేకపోతే ఎవరినైనా పక్కనపెడతామని సీఎం జగన్ అనేకసార్లు నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు వైసీపీ నాయకత్వం చెప్పిన విధంగా తమ పనితీరు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన మొత్తం స్థానాలతో పాటు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న 23 నియోజకవర్గాల్లోనూ ఈసారి కచ్చితంగా గెలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు జగన్. కుప్పంలో చంద్రబాబును ఓడించడంద్వారా మొత్తం 175 నియోజకవర్గాలను గెలవాలనే టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ దిశగా నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో కొండెపి, చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ పరమయ్యాయి. ఇవన్నీ ప్రకాశం జిల్లాలోనివే. దీంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వీటిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకు సహకరించాలని కోరుతున్నారు.
ఈ క్రమంలోనే మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు టికెట్ లేదని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్‌కు సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ విషయంలో పార్టీ నాయకత్వం ముందుగానే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందేమో అనే చర్చ జరుగుతోంది. తనకు టికెట్ లేదని ఈసారి పోటీ చేసే ఛాన్స్ తనకు భార్యకు వస్తుందేమో అని ఆయన చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు ఫిక్స్ అయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే వైసీపీ నాయకత్వం ఇంకెంతమందికి వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్ ఇచ్చే విషయంలో స్పష్టత ఇచ్చింది అనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జోరందుకుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులను మార్చే ఆలోచనలో ఉన్న వైసీపీ నాయకత్వం. ఈ మేరకు ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధం చేసుకున్నట్టు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాటలను అర్ధమవుతోంది.