కూర్చున్న కొమ్మను నరుక్కున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

By KTV Telugu On 1 February, 2023
image

నియోజకవర్గానికి నిధులు ఇవ్వడంలేదనో అభివృద్ధిపై అసంతృప్తి ఉందనో చెప్పుంటే గౌరవంగా ఉండేది. కానీ నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే నా మాటలెవరో రహస్యంగా వింటున్నారనడం అతిశయోక్తిలా ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారన్నది కోటంరెడ్డివాదన. దానికి ఆయన ఇంటలిజెన్స్‌ చీఫ్‌ పేరుని బయటికి లాగారు. తన స్నేహితుడితో మాట్లాడిన కాల్‌ ఆడియోని ఆ ఐపీఎస్‌ షేర్‌ చేశారంటున్నారు. బట్టకాల్చి మొహానేసినట్టు ట్యాపింగ్‌ జరగలేదని నిరూపించుకోవాలని అంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం.

ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నా వారు గీటుదాటినా పార్టీకి ద్రోహం చేయాలనుకున్నా ప్రభుత్వానికి ఏదోరకంగా సమాచారం ఉంటుంది. కేడర్‌ ఉంటుంది. పార్టీలో మిగతా నేతలు ఉంటారు. అంతగా కావాల్సి వస్తే ఏ స్పెషల్‌ బ్రాంచో అవసరమైన సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది. దీనికోసం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ని ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం ఏముంటుందన్నదే ప్రశ్న. కోటంరెడ్డి తనని తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారా లేదా ఓ ఆడియో రికార్డ్‌ అటూఇటూ మారి తన చేతుల్లోకి వచ్చేసరికి ఏదో జరిగిపోయిందని పొరబడుతున్నారా. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో రూరల్‌నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు ఆయన అనుచరులతో చెప్పిన ఆడియో అది. ఎవరన్నా అత్యుత్సాహంతోనో ఉద్దేశపూర్వకంగానో బయట పెట్టుండొచ్చు. దానికి ట్యాపింగ్‌ అవసరమా అన్నదే ప్రశ్న.

వైఎస్‌ కుటుంబానికి మొదట్నించీ విధేయుడు కావటంతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బుజ్జగించడానికి వైసీపీ నాయకత్వం ప్రయత్నించింది. స్వయానా సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆయనతో మాట్లాడారు. అయినా కోటంరెడ్డి నచ్చని సంసారం చేయలేనంటున్నారు. అంటే సెకండ్‌ సెటప్‌ రెడీ చేసుకున్నారన్నమాటే. ఆయన కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన బావ వరసైన కాకాణి గోవర్దన్‌రెడ్డికి మంత్రి పదవి వచ్చినప్పట్నించీ కోటంరెడ్డి మనసు మనసులో లేదు. తన రేంజ్‌కి ఎప్పుడో కేబినెట్‌లోకి తీసుకుని ఉండాల్సిందన్నది ఆయన ఆలోచన. కానీ అనుకున్నామని అన్నీ జరగవుగా అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీనుంచి దీనిపై సీరియస్‌గానే రియాక్షన్‌ వచ్చింది. ఆదాల ప్రభాకర్‌రెడ్డికి నెల్లూరు రూరల్‌ బాధ్యతలిస్తోంది వైసీపీ నాయకత్వం. అంటే ఇక ఎమ్మెల్యేగా కూడా కోటంరెడ్డి మాట చెల్లుబాటు కాకపోవచ్చు. అంటే ఆనం రామనారాయణరెడ్డి ట్రీట్మెంట్‌ యథాతథం అన్నమాట. కోటంరెడ్డి లెక్కలు ఏమైనా అయ్యుండొచ్చు. ఆవేశపడి కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారన్న మాటయితే సొంత మనుషులనుంచే వినిపిస్తోంది.