బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్ని పవర్ ఫుల్ పంచ్ డైలాగులే వదిలారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ను స్వర్గంలా మార్చేస్తానన్నంతగా హామీల జడివానలో జనాన్ని తడిపేసేందుకు ప్రయత్నించారు. ప్రజల సత్వర ఆకాంక్షలేమిటో తెలిసిన నాయకుడిగా వారిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. నీరు, విద్యుత్ లాంటి రంగాల్లో సుదీర్ఘ కాలంగా నలుగుతున్న సమస్యలను పరిష్కరించేందుకే బీఆర్ఎస్ స్థాపించామన్నట్లుగా చెప్పుకొచ్చారు. మహోజ్వల భారతదేశం కోసమే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఒక ప్రాంతానికి పరిమితం అయ్యే పార్టీ కాదన్నారు. బీఆర్‌ఎస్ అంటే తమాషా కోసమో చక్కిలిగింతల కోసమో కాదని దేశంలో ఒక మూల కోసమో ఒక రాష్ట్రం కోసమో కాదని. బీఆర్‌ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని కేసీఆర్ చెప్పుకున్నారు.
ఏపీ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, పార్థసారథి సహా పలవురు నాయకులు సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్‌ఎస్ కు తోడుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రావాలి. బీఆర్‌ఎస్ లో చేరి పని చేసే వారికి ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో దక్కిన గౌరవం దక్కుతుందని కేసీఆర్ అన్నారు. రొటీన్ రాజకీయం కాకుండా ప్రజలకు సరైన అభివృద్ధి కోసం మార్పు కావాలని ఆకాంక్షించినట్లు కేసీఆర్ విశ్లేషించారు. తెలంగాణ పథకాలు కావాలని అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ ఉందని సంక్రాంతి తర్వాత బీఆర్‌ఎస్ పరుగులు మొదలవుతాయని చెప్పారు. బీఆర్ఎస్ లో చేరేందుకు చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉత్సాహంగా ఉన్నారని కేసీఆర్ చెప్పుకున్నారు. దేశవ్యాప్తంగా 6 లక్షల 64 వేల గ్రామాల్లో బీఆర్ఎస్ కమిటీలు ఏర్పడాలని అందుకు త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. దేశంలోని 4,123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరుగులు తీసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయంటూ వారిని ఉత్సాహ పరిచారు.
దేశ జనాభాలో 50 శాతం ఉన్న రైతులను ఆకట్టుకునేందుకు కేసీఆర్ మరో సారి ప్రయత్నించారు. దేశంలోని రైతులందరికీ 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని ఏటా 25 లక్షల మందికి పథకాన్ని అందిస్తామని చెప్పుకున్నారు. దేశం ఎందుకు వెనుకబడి పోయిందీ దేశం ప్రజలు ఎందుకు అథోగతి పాలవుతున్నారో చెప్పేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. అన్ని వనరులూ ఉన్నా అధికారం చేపట్టిన వారి బాధ్యతారాహిత్యంతో వాటిని ఉపయోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన వెనకబాటుకు కారణాలను ప్రజల్లోకి చేరవేయగలిగితే చాలు కేంద్రంలో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఉజ్వల భారతావనిని తయారు చేసే దిశగా ఏపీ ప్రజలు కూడా అడుగులు వేయాలన్నారు. దేశంలో 50 శాతం సాగు యోగ్యమైన భూమి ఉన్నా లక్షల కోట్ల రూపాయల విలువైన పామాయిల్, కందిపప్పును దిగుమతి చేసుకుంటున్నామని నెలల తరబడి రైతులు ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. దేశం ప్రస్తుత దుస్థితిపై ప్రజా జీవనంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని కుండబద్దలు కొట్టారు. మోదీ ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేసినా కేంద్రంలో తాము అధికారానికి వచ్చిన వెంటనే జాతీయం చేస్తామన్నారు. దాదాపు రెండేళ్లుగా ఉద్యమిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. పైగా మోదీ ప్రభుత్వానిదీ ప్రైవేటువాదమని తమది జాతీయ వాదమని కేసీఆర్ చెప్పుకున్నారు. గంటకు పైగా సాగిన ప్రసంగంలో కేసీఆర్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎక్కడా అమరావతి గానీ మూడు రాజధానుల ప్రస్తావన గానీ తీసుకురాలేదు. అలాంటి ప్రకటనల వల్ల జరిగే అనర్థమేమిటో కేసీఆర్ కు బాగానే తెలుసు. అమరావతి రాజధానిని సమర్థిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు కోపం వస్తుందని కేసీఆర్ గ్రహించారు. మూడు రాజధానులంటే వెయ్యి రోజులుగా ఉద్యమిస్తున్న అమరావతి రైతులు దుమ్మెత్తి పోస్తారని కేసీఆర్ అర్థం చేసుకున్నారు. అందుకే అలాంటి వివాదాస్పద అంశాల జోలికి పోలేదు. మరి మున్ముందు ఇలాంటి అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారో చూడాల్సి ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో ఎగుడుదిగుడులు, గెలుపోటములు సహజమని కేసీఆర్ అంగీకరించారు. ప్రబల గుణాత్మక మార్పు దిశగా దేశ ప్రజల ఆలోచన సరళిలో మార్పు తీసుకు రావడానికే బీఆర్‌ఎస్ ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పుకోవడం జనానికి బాగానే ఎక్కే అవకాశం ఉంది. రాజకీయాలంటే గోల్‌మాల్, బ్లఫ్ చేయడం కాదని ఎన్నికల మసాలా మిర్చి మాటలు, గోల్ మాల్ చేసి గెలవడం కాదని రాజకీయాలు అంటే కర్తవ్యమని వివరించారు. పార్టీ నేతలకు ఆ సంగతి అర్థమవుతుందో లేదో చూడాలి.