తలుపు గొళ్లెం హారతి పళ్లెం గుర్రపు కళ్లెం- కాదేదీ కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఈ కవిత నుండే స్ఫూర్తి చెందినట్లున్నారు. దేన్నుంచి అయినా రాజకీయం చేసేయచ్చని వారు బాగా డిసైడ్ అయిపోయారు. వడ్ల గింజలు లిక్కర్ చుక్కలు ప్రశ్నా పత్రాలు అయిపోయాయి ఇపుడు ఉక్కు ముక్కల వెంట పడుతున్నారు పొలిటీషియన్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల మధ్య ఇపుడు విశాఖ ఉక్కు రాజకీయం వారధిగా నిలిచింది. ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం దీన్ని కొద్దిగా మార్చి విశాఖ ఉక్కు ఆదానీ హక్కు అని పాడుకుంది. ఆ పాటే పాడుకోమని అందరికీ చెప్పుకొచ్చింది కూడా. విశాఖ ఉక్కు ను ఆదానీకో అంబానీకో కట్టబెట్టేసి ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని విశాఖ ఉక్కు కార్మికులు ఏడాదిగా ఉద్యమిస్తూనే ఉన్నారు. కార్మికులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసి ప్రైవేటీకరణ ఆపాలని కోరింది. అయితే కేంద్రంలో ఉన్న పుష్ప ప్రభుత్వం తగ్గేదే ల్యా అంటోంది. అటు ఆదానీ ఏమో విశాఖ ఉక్కును ఉద్దేశించి ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అని సొంత బాణీ ఓటి కట్టేసుకున్నారు. ఈ వ్యవహారాలు ఇలా ప్రశాంతంగా నడిచిపోతూ ఉన్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తానేమీ తక్కువ తినలేదని కొత్త పాట కట్టారు. అది నిజం పాట కాదు వేలం పాట.
అంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తూ చూస్తూ ఊరుకోమన్న కేసీయార్ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని చెప్పి విశాఖ ఉక్కు వేలం పాటలో తాము కూడా పాల్గొని అందరికన్నా శ్రావ్యంగా పాట పాడి దాన్ని దక్కించుకుని కార్మికులను కాపాడుకుంటామని ప్రకటించారు. విశాఖ ఉక్కును ఆదానీకి కట్టబెట్టేసేందుకు కుట్ర జరుగుతోందని కేంద్రంపై విరుచుకు పడ్డారు తెలంగాణ మంత్రి కేటీయార్. ఆయన అలా అన్నారో లేదో ఏపీలో రాజకీయాలు స్టీల్ ఫర్నేస్ లో పెట్టి కాల్చినట్లు ఎర్రగా కాలిపోతున్నాయి. కేసీయార్ ఇలా ప్రకటన చేయగానే ఏపీలోని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడి పాలక పక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పై విరుచుకు పడిపోయారు. మన రాష్ట్రంలో విశాఖ ఉక్కును కాపాడ్డానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తోంటే మీరేం చేస్తున్నారు అంటూ జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు. ఇక టిడిపి అనుకూల మీడియా అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపే సత్తా లేదు అంటూ ముఖ్యమంత్రిపై ఓ కథనాన్ని రాసి పారేసింది. అటు వైసీపీ కూడా టిడిపికి దీటుగానే కౌంటర్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం గురించి టిడిపి నేతలు మాట్లాడ్డమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అని వైసీపీ అంటోంది దానికి కారణం లేకపోలేదు. ఎన్టీయార్ ను వైస్రాయ్ హోటల్ గేట్ నుంచి అలాగే బయటకు పంపేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో యాభైకి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను ఎడా పెడా రెండు చేతులతోనూ ప్రైవేటు తమ్ముళ్లకు అమ్మి పారేశారు. ఆ క్రమంలో ప్రతిష్ఠాత్మకమైన చారిత్రకమైన భారీ సంస్థలను కూడా మూసి వేశారు. అలా చేయడం చాలా విజనరీ అని దానికి మంచి పేరు కూడా పెట్టారాయన.
తన స్వదస్తూరీతో రాసిన మనసులో మాట పుస్తకంలో పరిశ్రమలు కంపెనీలను ప్రభుత్వాలు నడపడమేంటి నాన్సెన్స్ అన్నారాయన. సంస్కరణలతో ముందుకు పోతేనే కానీ ఇంగ్లీషు వాడిలా అభివృద్ధి చెందలేం అని గిరీశం మార్కు లెక్చర్లూ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎంత వేగంగా ఎంత కారు చౌకగా ఓఅయ్య చేతిలో పెట్టేస్తే అంత గొప్ప విజన్ ఉన్నట్లు లెక్క అని సూత్రీకరించిన చంద్రబాబు వేలాది మంది కార్మికులపై వర్క్ లోడ్ తగ్గించి వారిని ఇంటికి పంపేశారు. అటువంటి చరిత్ర ఉన్న టిడిపి నేతలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడ్డం విడ్డూరంగా ఉందంటున్నారు వైసీపీ నేతలు. కొసమెరుపు ఏంటంటే 2014లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడి హయాంలోనే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు ప్రయత్నాలు మొదలైపోయాయి. చంద్రబాబు నాయుడు మోదీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగానే ఆ ముచ్చట జరిగిపోయింది. బాబు హయాంలోనే విశాఖ ఉక్కుపై మనసు పడ్డ పోస్కో కంపెనీ ప్రతినిథులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలీదు కానీ కొంత కాలం తర్వాత ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సమయం మరింత దగ్గరైందని కేంద్రం ప్రకటించింది.
ఇంత చరిత్ర ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బిడ్ లో దక్కించుకుని కార్మికులను కాపాడతానని ఇపుడుకేసీయార్ అంటున్నారు. అయితే కేసీయార్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించడానికి ఉద్దేశించిన బిడ్డింగ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనేందుకు వీలే లేదు. వాటికి అర్హత లేదు. నిబంధనలు ఆ విధంగా రూపొందించేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ఆ విషయం కేసీయార్ సారుకూ తెలుసు. మరి ఏ విధంగా తెలంగాణ తరపున బిడ్ లో పాల్గొంటానని ఆయన అంటున్నారో అర్ధం కావడం లేదంటున్నారు వైసీపీ నేతలు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా అని చెప్పిన కేసీయార్ బిడ్ లో ఎలా పాల్గొంటారని కూడా ఏపీ మంత్రులు నిలదీస్తున్నారు. బిడ్ లో పాల్గొనడం అంటేనే దాన్ని ప్రైవేటు పాటలో దక్కించుకోవడం. మరి కేసీయార్ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు నిర్ణయాలు ఎలా చేస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రులు కుతూహలంగా అడుగుతున్నారు. ఇక తెలంగాణాలోనూ ఈ ఉక్కే రోహిణీ కార్తెని మించిన ఉక్కపోత పెడుతోంది. విశాఖ ఉక్కు కొనేసి కార్మికులను ఆదుకుంటానని అంటోన్న కేసీయార్ తెలంగాణా రాష్ట్రంలో మూతపడి ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు తెరిపించడం లేదని తెలంగాణా రాజకీయ నేతలు నిలదీస్తున్నారు. వరంగల్ లోన ఆజాం జాహీ మిల్స్ నిజాం సుగర్స్ రిపబ్లికన్ ఫోర్జ్ కంపెనీ ఏపీ రేయాన్స్ వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు గత ప్రభుత్వాల నిర్వాకాల వల్ల మూతపడ్డాయి.
వాటిలో మెజారిటీ కంపెనీలు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూత పడ్డాయి. వాటి స్థలాలను కారు చౌకగా విక్రయించే తెరచాటు వ్యవహారాలూ నడిచాయి. మరి 2014లో ముఖ్యమంత్రి అయిన కేసీయార్ ఈ తొమ్మిదేళ్లలో వాటిలో కొన్నింటిని అయినా ప్రభుత్వ పరంగా తెరిపించి ఉంటే బాగుండేది కదా అంటున్నారు తెలంగాణా వాదులు. అంతెందుకు విభజన సమయంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం కడతామని కేంద్రం హామీ ఇచ్చి ఆ తర్వాత వెనక్కి పోయింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొంటానంటోన్న కేసీయార్ బయ్యారం ఉక్కు కర్మాగారానికే శ్రీకారం చుడితే తెలంగాణా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అని తెలంగాణాలో విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తన ఇంటిని బాగు చేసుకోవడం చేతకాని కేసీయార్ పొరుగు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని వారు సెటైర్లు వేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి అసలు దాని వేల్యూ ఏంటి దాని పొజిషన్ ఏటి ఎంతకు బేరం ఆడొచ్చు అన్నవి తేల్చుకోడానికి తెలంగాణ ప్రభుత్వ ఓ బృందాన్ని విశాఖ పంపింది. రెండు రోజుల పాటు వారు అక్కడే ఉండి దాని రేటు గిట్టుబాటు అవకాశాలు అన్నీ కనుక్కొని వస్తారని అంటున్నారు. అంతా అయ్యాక నిజంగానే విశాఖ ఉక్కును కేసీయార్ కొంటారా అని ఉక్కు కార్మికులతో పాటు చాలా మంది ఆశగా చూస్తున్నారు.