పవన్‌కు జగన్-కేసీఆర్ షాక్.. ముల్లుని ముల్లుతోనే తీసే రాజకీయం

By KTV Telugu On 4 January, 2023
image

వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోనని పవన్‌ అంటే తోట చంద్రశేఖర్ రూపంలో జనసేన అనుకూల ఓట్లు చీల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు కేసీఆర్ జనసేన మీద పడ్డారేంటి అని అందరూ అనుకుంటున్నారు. ఆ పార్టీకి చెందిన కీలక నేత తోట చంద్రశేఖర్‌ను ఏపీలో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేశారు కేసీఆర్. మరికొందరు నేతలకు కండువా కప్పారు. అయితే దానివెనక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేరే ఉందని తెలుస్తోంది. ఏపీలో బీజేపీ, జనసేన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ రెండు పార్టీలు టీడీపీతో కూడా జతకట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈనేపథ్యంలో పవన్‌కు పాజిటీవ్‌గా ఉన్న ఓ సామాజికవర్గం ఓట్లను కొల్లగొట్టేందుకే కేసీఆర్ తోటకు ఏపీ పగ్గాలు అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. తద్వారా బీజేపీని దెబ్బకొట్టొచ్చనే వ్యూహంతో ఉన్నారని సమాచారం. అదే జరిగితే జగన్‌కు ప్లస్ అవుతుంది.

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కాపుల చుట్టే తిరుగుతున్నాయి. కాపులంతా జనసేనకు మద్దతుగా ఏకమవుతున్నారు. ఇప్పటికే కాపుల రిజర్వేషన్ అంశంపై దుమారం రేగుతోంది. హరిరామజోగయ్య కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ అంశంపై దీక్ష చేసి పవన్ విజ్ఞప్తి మేరకు విరమించారు. రానున్న రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గాన్ని కేసీఆర్ టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీని అధికారంలోకి రానివ్వనని, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలబోనివ్వనని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. ఈ సమయంలో ముల్లుని ముల్లుతోనే తీయాలనే రాజకీయాన్ని జగన్ తెరచాటుగా నడిపిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ పార్టీ ద్వారా తోట రూపంలో ఓ వర్గం ఓట్లు చీల్చే ప్రయత్నాలు మొదలుకావడం సెగలు రేపుతోంది.

పవన్ రైట్ హ్యాండ్‌ను పార్టీలోకి తీసుకొని కేసీఆర్ ఏపీ పగ్గాలు అప్పగించడం వెనుక జగన్ ఉన్నారనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు కొందరు నేతలు. తమ ఆలోచన ఏపీ గురించే తప్ప మరో ఆలోచన లేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాగా రాష్ట్రాలు, భార్యలను మార్చమని ఇటీవల సభలో జగన్ వ్యాఖ్యానించారు. అంటే తెలంగాణలో కేసీఆర్‌కు పరోక్షంగా జగన్ సహకరించనున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి. అదే సమయంలో జగన్‌కు ఏపీలో మేలు చేకూర్చేందుకే కేసీఆర్ నయా ప్లాన్ వేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-జనసేన పొత్తును బలహీన పర్చేందుకే బీఆర్ఎస్ రూపంలో సీఎం కేసీఆర్ ఏపీ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టారని ఆరోపించారు. ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన అత్యంత బలమైన కాపు సామాజిక వర్గాన్ని బీజేపీకి దూరం చేయడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. ఇదిలా ఉంటే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీని వైసీపీ నేతలు స్వాగతిస్తున్నారు. కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయవచ్చంటున్నారు. మొత్తంగా 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్‌కు పరోక్షంగా కేసీఆర్ సహకరించారనే టాక్ ఉంది. వచ్చే ఎన్నికల కోసం మరోసారి వైసీపీకి అనుకూలంగా కేసీఆర్ చేస్తున్న రాజకీయం ఆసక్తిని రేపుతోంది.